స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి… గెలిపించిన ప్రజలు…

రేకొండ సర్పంచ్ అల్లేపు సంపత్…

దిశ దశ, చిగురుమామిడి:

సేవ చేసినా వేళకు డబ్బులు పంచాల్సిందే… డబ్బులు లేనట్టయితే గెలుపు సాధ్యం కాదన్న ప్రచారానికి ఆ గ్రామస్థులు చెక్ పెట్టారు. స్వచ్ఛందంగా ప్రజా సేవ చేసిన వారికి ప్రజలు ఆదరిస్తారని రుజువైంది. పంచాయితీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం… డబ్బుల పంపిణీ పెద్ద ఎత్తున సాగిందన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా ఓ గ్రామస్థులు సర్పంచును ఎన్నకున్నారు. పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ మెజార్టీ ఓటర్లు ఆయనను అక్కున చేర్చుకున్నారు.

రేకొండ…

చిగురుమామిడి మండలం రేకొండ గ్రామ సర్పంచ్ గా అల్లేపు సంపత్ గెలుపొందారు. 4 వేల పైచిలుకు ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో దాదాపు 3500 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సర్పంచ్ గా ఆరుగురు పోటీలో నిలవగా సంపత్ 897 ఓట్లతో విజయం సాధించారు. అయితే సంపత్ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం, డబ్బు పంపిణీ చేయకుండానే సర్పంచ్ గా గెలవడం విశేషం.

సేవా కార్యక్రమాలు…

రాజకీయాల్లో ఉన్న అల్లేపు సంపత్ భార్య ఓ సారి వార్డు మెంబర్ గా గెలవగా, సర్పంచ్ గా 75 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఓ సారి ఎంపీటీసీగా కూడా ఓడిపోయినప్పటికీ సంపత్ మాత్ర గ్రామస్థులకు స్వచ్ఛందంగా సేవ చేయడంలో మాత్రం వెనుకడుగు వేయలేదు. గ్రామంలో 390 లబ్దిదారులకు ఎల్పీజీ కనెక్షన్లు, 76 మందికి పెన్షన్లు, అంత్యోదయ కార్డులు, కోతుల బెడద నివారణలో కూడా పాలు పంచుకున్నాడు. అంతేకాకుండా గ్రామంలోని ఆలయానికి రోడ్డు కోసం తన భూమిని కూడా వితరణ చేశాడు. ఇలా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి అవసరాలను తీర్చుతున్న సంపత్ ను రేకొండ గ్రామస్థులు గెలిపించడం ఆదర్శంగా నిలిచింది.

స్వతంత్ర అభ్యర్థిగా…

ఇకపోతే రేకొండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అల్లేపు సంపత్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. అయితే గ్రామస్థులు మాత్రం ఏ పార్టీ నుండి పోటీ చేయవద్దని, ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని సూచించడంతో ఆయన బీఆరెఎస్ పార్టీ మద్దతును నిరాకరించాడు. పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ గ్రామ ప్రజలకు తాను అందుబాటులో ఉంటున్న తీరే తనను గెలిపిస్తుందన్న ధీమాతో ప్రచార పర్వాన్ని కొనసాగించాడు సంపత్. ఆయన అందించిన సేవలను గుర్తించిన గ్రామస్థులు కూడా అక్కున చేర్చుకోవడం విశేషం.

కాంగ్రెస్ పార్టీలోకి…

రేకొండ పంచాయితీ సర్పంచ్ గా గెలుపొందిన అల్లేపు సంపత్ అధికార పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా ఆయన గ్రామాభివృద్ది కోసం మాత్రమే చేరుతాను తప్ప స్వలాభం కోసం మాత్రం కాదని స్పష్టం చేశారు. తన గ్రామానికి రవాణా సౌకర్యాలు మెరుగు పరిచేందుకు అవసరమైన నిధులు కెటాయించాలన్న డిమాండ్ ను అధికార పార్టీ ముఖ్య నాయకుల ముందు ఉంచారు. ప్రధానంగా రేకొండ, మొగిలిపాలెం, ఎగ్లాస్ పూర్, రేకొండ, రేకొండ స్మశాన వాటిక, రేకొండ బొమ్మనపల్లి మత్తడిపై వంతెనలు నిర్మించేందుకు అవసరమైన నిదులు ఇప్పించాలని సర్పంచ్ సంపత్ కోరారు. ఇందుకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సమ్మతించారని, గ్రామాభివృద్ది కోసం నిధులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారని సంపత్ వివరించారు. గ్రామాన్ని అభివృద్ది చేయాలన్న తపనతోనే తాను అధికార పార్టీలో చేరానని వెల్లడించారు.