బలహీన పడుతున్న పార్టీ… వారి పరిస్థితి ఏమిటీ..?

దిశ దశ, దండకారణ్యం:

లొంగుబాట్లు, ఎన్ కౌంటర్ల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నేతల గురించి చర్చ మొదలైంది. సింగిలి డిజిట్ కే పరిమితం అయిన కేంద్ర కమిటీలో అత్యంత కీలక బాధ్యతల్లో ఉన్న ముఖ్య నాయకులు రక్షణ వలయంలోనే ఉన్నారా లేక సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారా అన్నదే హాట్ టాపిక్ గా మారింది.

PLGA…

మావోయిస్టు పార్టీ విభాగాల్లో అత్యంత కీలకమైనది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA)నే. అయితే వరస సంఘటనలతో పీఎల్జీఏ నామమాత్రంగానే మిగిలిపోయిందని పోలీసు వర్గాలు అంటున్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడు, మిలటరీ కమిషన్ ఇంఛార్జిగా వ్యవహరించిన మడావి హిడ్మా నవంబర్ 18న ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. హిడ్మా తరువాతి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందన్న దేవా అలియాస్ దర్శన్ అలియాస్ సుక్కు కూడా జనజీవనంలోకి రావడంతో మావోయిస్టు పార్టీ సైనిక విభాగం తుడుచుకపెట్టుకపోయే స్థితికి చేరుకుందని పోలీసు వర్గాలం అంచనా వేస్తున్నాయి. పీఎల్జీఏలో అత్యంత బలమైన నాయకులుగా ఎదిగిన ఇద్దరిలో ఒకరు మరణించగా మరోకరు బాహ్య ప్రపచంలోకి వచ్చారు. దీంతో పీఎల్జీఏలో ప్రస్తుతం 40 నుండి 50 మంది వరకు మాత్రమే ఉన్నట్టుగా పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేఫథ్యంలో స్వీయ రక్షణ చర్యలతో పాటు, ప్రత్యర్థులపై పై చేయి సాధించేంత బలం మావోయిస్టు పార్టీ పీఎల్జీఏకు లేకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే శనివారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు జనజీవనంలోకి దేవాతో పాటు మరో 20 మంది రాగా, వీరి నుండి దాదాపు 50 వరకు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ పోలీసులు. పార్టీ శ్రేణుల స్వీయ రక్షణ కోసం ఉపయోగించే ఆయుధ సంపత్తి కూడా పోలీసుల వద్దకు వచ్చి చేరుతుండడంతో పార్టీలో ఇంకా కొనసాగుతున్న నేతల పరిస్థితి ఏమిటన్నదే అంతు చిక్కకుండా పోతోంది.

వారి పరిస్థితి..?

ప్రస్తుతం కేంద్ర కమిటీలో తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, నరహరి అలియాస్ విశ్వనాథ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరు సభ్యులు ఉన్నట్టుగా సమాచారం. ఇటీవల కాలంలో జరిగిన వరస ఎన్ కౌంటర్ లలో కేంద్ర కమిటీ సభ్యులు మరణించడంతో సీసీ కమిటీ సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

ఆ నేతలు… ?

మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకంగా ఉన్న గణపతి, దేవ్ జీలు ఎక్కడ ఉన్నారు..? వారు సేఫ్టీ జోన్ లోనే ఉన్నారా లేక పార్టీ శ్రేణుల రక్షణ వలయం నడుమ ఉన్నారా అన్నదే పజిల్ గా మారింది. పార్టీలో నెలకొన్న పరిణామాలపై ఈ ఇద్దరు నేతల నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన కూడా వెలువడకపోవడం గమనార్హం. 2017 వరకు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన గణపతి అంతర్జాతీయ విప్లవ సమూహాల ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరిగింది. కార్యదర్శిగా బాధ్యతల నుండి తప్పుకున్నప్పటికీ ఆయన మాత్రం కేంద్ర కమిటీలో సభ్యునిగా కొనసాగుతున్నారు. తనతో పాటు కలిసి నడిచిన వారంతా మరణించడమో లేక ఆయుధ విరమణ ప్రకటిస్తున్నా గణపతి నుండి మాత్రం స్పందన లేకపోవడం ఆశ్యర్యానికి గురి చేస్తోంది. పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న పెద్దాయన నుండి స్పందన ఎందుకు రావడం లేదన్నదే అంతుచిక్కకుండా పోతోంది. మరో వైపున తిపిరి తిరుపతి నుండి కూడా స్పందన లేకపోవడం గమనార్హం. గత నవంబర్ నెలలో ఏపీలో అరెస్ట్ అయిన వారిలో కేంద్ర కమిటీ కార్యదర్శి రక్షణ వలయంలో పని చేసిన వారు కూడా పోలీసులకు దొరికారు. అప్పుడే తిరుపతి ఎలా ఉన్నాడోనన్న చర్చ కూడా సాగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నివాసం ఉంటున్న తిరుపతి సోదరుడు గంగాధర్, ఆయన కూతురు సుమ కూడా మీడియా ముందుకు వచ్చి ఆయన ఆచూకి కోసం ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తిరుపతి నుండి మాత్రం నేటికి ఎలాంటి ప్రకటన వెలవడకపోవడం గమనార్హం. పార్టీ అత్యంత దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో కూడా ఈ ముఖ్యనేతలిద్దరి నుండి స్పందన రాకపోవడం ఆశ్యర్యానికి గురి చేస్తోంది. పార్టీకి కంచుకోటగా ఉన్న దండకారణ్యంలో బలగాల పైచేయి సాధిస్తున్న క్రమంలో ముఖ్య నేతలు అక్కడే పార్టీ శ్రేణుల రక్షణ మధ్య ఉన్నారా లేక సేఫ్ జోన్ కు తరలి వెళ్లిపోయారా అన్న విషయంపై మాత్రం స్ఫష్టత లేకుండా పోయింది. సాయుధ పోరుతోనే ముందుకు సాగాలని వాదనలు వినిపించిన నాయకులు కూడా బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈ సమయంలో కూడా గణపతి, దేవ్ జీ ఉనికి ఏ మాత్రం లీక్ కాకపోవడం వెనక ఉన్న కారణం ఏంటన్నదే మిస్టరీగా మారింది.