ఆపరేషన్ అక్కడ… పరేషన్ ఇక్కడ…

మావోయిస్టు ఏరివేతపై  ఆందోళన

దిశ దశ, హైదరాబాద్:

మావోయిస్టు ఏరివేత ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ముందుకు సాగుతోంది. చత్తీస్ గడ్ లో మావోయిస్టులను సమూలంగా అంతమొందించాలన్న లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం కలిసివచ్చిందనే చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో నక్సల్స్ కోసం బలగాలు చేపడుతున్న కూంబింగ్ ఆపరేషన్లపై తెలంగాణాలో పౌరహక్కులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ అంతా కూడా చత్తీస్ గడ్ కేంద్రీకృతంగానే సాగుతున్నా తెలంగాణలో మాత్రం రాజకీయ పార్టీలు కూడా శాంతి చర్చలకు ముందుకు రావాలని పిలుపునిస్తున్నాయి.

దండకరాణ్య జోన్…

2026 మార్చి నాటికల్లా మావోయిస్టు పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా మావోయిస్టు పార్టీ ఏరివేత కోసం పెద్ద ఎత్తున బలగాలు కీకారణ్యాల్లో సంచరిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాలను షెల్టర్ తీసుకుని ముందుకు సాగుతున్న మావోయిస్టుల కోసం బలగాలు కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుంటూ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దీంతో ఇటీవల కాలంలో వందలాది మంది నక్సల్స్ జనజీవనలో కలవగా మరి కొంత మంది ఎదురు కాల్పుల్లో మరణించారు. గత కొద్ది రోజులుగా చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని, కాల్పుల విరమణ ఒప్పందంతో ముందుకు సాగుదామని మావోయిస్టు పార్టీ ప్రకటన చేస్తోంది.

ఎల్టీటీఈ తరహాలో...

లిబరేషన్ టైగర్స్ ఆప్ తమిళ ఈలం (LTTE)ని 1976లో ప్రారంభించిన వేలుపిల్లై ప్రభాకరన్ తమిళులకు ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ తో ఉద్యమాలు ప్రారంభించాడు. త్రివిధ దళాలను ఏర్పాటు చేసుకున్న ప్రభాకరన్ తన పోరాటాన్ని 2009 వరకు కొనసాగించాడు. శ్రీలంక ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ ద్వారా LTTE సమూలంగా నిర్మూలించబడింది. అయితే LTTEని తుదముట్టించేందుకు శ్రీలంక ప్రభుత్వం దశాబ్దాలుగా బలగాలను మోహరించడంతో పాటు వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగాల్సి వచ్చింది. ప్రస్తుతం చత్తీస్ గడ్ లోని బస్తర్ పూర్వ జిల్లాలో విస్తరించిన దండకారణ్య అటవీ ప్రాంతమంతా కూడా మావోయిస్టు పార్టీ పరిపాలిస్తున్నది. సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న మావోయిస్టు పార్టీ క్రాంతి కారీ జనతన్ సర్కార్ పేరిట ఆదివాసీలను పరిపాలించే పనిలో నిమగ్నం అయింది. LTTE తరహాలోనే మావోయిస్టు పార్టీ కూడా ప్రత్యేకంగా మిలటరీని తీర్చిదిద్దుకున్నది కానీ ఇక్కడి బౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఒక్క మిలటరీ వ్యవస్థతోనే సరిపెట్టింది. రెండు దశాబ్దాల కాలంగా అభూజామఢ్ అటవీ ప్రాంతంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న మావోయిస్టులను ఏరివేసేందుకు LTTEతో జరిపిన పోరాటాం మాదిరిగానే బలగాలు సెర్చింగ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి.

ఆ నాలుగు చోట్ల…

అయితే కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రమైన అంశంగా భావిస్తున్న వామపక్ష విప్లవోద్యమాన్ని అణిచివేసేందుకు చాలా రకమైన అంశాలు కలిసి వస్తున్నాయని చెప్పవచ్చు. గతంలోనే అంతర్గత భద్రతకు సంబంధించిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసు విభాగాల అధిపతులతో సమావేశం అయినప్పుడే కేంద్రం నక్సలిజం ఏరివేసేందుకు ఎలా ముందుకు సాగుతామో స్పష్టంగా వివరించింది. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదన్న సంకేతాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే మావోయిస్టుల ఏరివేత కోసం భారీగా పారా మిలటరీ బలగాలను పంపిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మహారాష్ట్ర, చత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు కావడం, ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడం కూడా కలిసి వస్తున్నట్టుగా ఉంది. నక్సల్స్ అత్యంత ప్రభావిత చూపిస్తున్న చత్తీస్ గడ్ రాష్ట్రానికి పొరుగున ఉన్న ఒక్క తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.

హక్కుల నేతల ఆందోళన…

చత్తీస్ గడ్ లో బలగాల మోహరింపుతో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితులకు బ్రేకులు వేసేందుకు తెలంగాణ కేంద్రీకృతంగానే పావులు కదుపుతున్నారు పౌర హక్కుల నేతలు. దండకారణ్యంలో ఆదివాసీల హననం సాగుతోందని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వరుసగా సాగుతున్న ఎన్ కౌంటర్ల పరంపరకు తోడు గత వారం రోజులుగా చత్తీస్ గడ్, తెలంగాణ సరిహధ్దుల్లోని కర్రె గుట్టలపై బలగాలు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ తో హక్కుల సంఘాలు శాంతి చర్చలు జరిపించాలన్న డిమాండ్ ను మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఇందు కోసం భారత్ బచావో సంస్థ కూడా కార్యరంగంలోకి దిగి సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రి సీతక్కను కలిసి కూడా మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించాలన్న ప్రతిపాదన చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కలు నక్సలిజాన్ని తాము శాంతి భద్రతల కోణంలో కాకుండా సామాజిక కోణంలో ఆలోచిస్తున్నామని వ్యాఖ్యానించడం హక్కుల సంఘాల నేతలకు బలాన్ని చేకూర్చినట్టయింది. అంతేకాకుండా ఆదివారం భారత్ బచావో సంస్థ ప్రతినిధి బృందంతో సమావేశం అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చర్చలకు ప్రాతినిథ్యం వహించిన సీనియర్ నేత జానారెడ్డితో సంప్రదింపులు జరుపుతానని కూడా మాట ఇచ్చారు. ఇందుకు అనుగుణంగానే సోమవారం రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా చర్చలు జరిపారు. మావోయిస్టు పార్టీతో శాంతి చర్చల అంశంపై సహచర మంత్రులతో కూడా చర్చించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా సీఎం చర్యలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రజతోత్సవ వేదిక నుండే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని, ఆదివాసీలపై హత్యకాండను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ నేత కూనవరం సాంబ శివరావు ఇప్పటికే చర్చలు చేపట్టాలని కోరగా వామపక్ష పార్టీలన్ని కూడా ఈ అంశంపై తమ గళాన్ని వినిపిస్తున్నాయి. 

తెలంగాణాలో కలవరం…

పీపుల్స్ వార్ సహా పలు విప్లవ పార్టీలు ఒకే గొడుగు కిందకు రావాలన్న నినాదంతో మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ గా ఆవిర్భవించిన తరువాత కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన పీపుల్స్ వార్ నాయకులే ఎంసీసీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 12 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 8 మంది తెలుగు వారే కాగా ఇందులో ఎక్కువ మంది తెలంగాణ వాసులు ఉన్నారు. దశాబ్దాల కాలంగా అడవులతోనే మమేకం అయి దోపిడీ పీడనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ముఖ్య నేతల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయింది చత్తీస్ గడ్ రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితుల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పినట్టియితే మావోయిస్టుల కోసం సాగుతున్న వేటకు తాత్కాలికంగా బ్రేకులు పడే అవకాశాలు ఉంటాయి. అయితే తెలంగాణకు చెందిన హక్కుల ఉద్యమకారులు తీసుకొస్తున్న ఒత్తిళ్లతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళన అయితే అన్ని వర్గాల్లోనూ వ్యక్తం అవుతోంది. తెలంగాణ సర్కార్ ప్రతినిధుల ద్వారా శాంతి చర్చల గురించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవచ్చిన తరువాత జాతీయ స్థాయిలోనూ ఈ అంశాన్ని లేవనెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మావోయిస్టు ప్రతిపాదనకు అనుకూలంగా మాత్రం ఒక్క తెలంగాణ నుండి తప్ప… నక్సల్స్ ప్రభావం ఉన్న ఇతర రాష్ట్రాల నుండి మాత్రం శాంతి చర్చల అంశానికి అనుకూలంగా పెద్ద ఎత్తున హక్కుల ఉద్యమాలు జరగడం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

You cannot copy content of this page