ఆన్ లైన్ వ్యాపారం… అడ్డగోలు ఆదాయం… నిండా ముంచుతున్న వైనం…

దిశ దశ, జగిత్యాల:

క్రిప్టో కరెన్స్ ద్వారా పెట్టుబడులు పెడితే మీ ఆదాయం మూడింతలు అవుతుంది… మీతో పాటు మరికొంత మందిని జాయిన్ చేస్తే ఎక్కువ లాభాలు గడించవచ్చు… యాప్స్ క్రియేట్ చేసి అంకెల గారెడీ చూపిస్తూ సామాన్యులను నిట్ట నిలువునా ముంచేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా క్రిప్టో ద్వారా పెట్టు బడులు పెట్టిస్తున్న చీటింగ్ గ్యాంగ్స్ పెద్ద సంఖ్యలో తయారయ్యాయి. ఇప్పటికే కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేయగా తాజాగా జగిత్యాల జిల్లా పోలీసులు కూడా కొరడా ఝులిపిస్తున్నారు. మెటా ఫండ్ ప్రో యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్టయితే మూడింతల సొమ్ము గడించవచ్చని కలల ప్రపంచం చూపించి బాధితులను మోసగించారు. సామాన్యుల నుండి భారీగా వసూలు చేసుకున్న తరువాత యాప్ క్లోజ్ చేసేయడంతో లబోదిబోమనడం బాధితుల వంతయింది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన కస్తూరి రాకేష్ కుమార్ ను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కొడిమ్యాలకు చెందిన సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, వీరబత్తిని రాజులను జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై 318(4), 316(2), r/w 3(5) BNS, Sec 5 of Telangana Protection of Depositors of Financial Establishments Act-1999 and Sec 3 & 4 of the Prize Chits & Money Circulation Schemes (Banning) Act-1978 సెక్షన్లలో కేసు నమోదు చేశామని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ మీడియాకు తెలిపారు.

టూర్లతో ఎర…

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టేందుకు ఏజెంట్ల వ్యవస్థ ద్వారా నెట్ వర్క్ వ్యాపారాన్ని కొనసాగించారు. సింగపూర్, గోవా తదితర పర్యాటక కేంద్రాలకు తీసుకెళ్లి స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేసి త్రిశంకు స్వర్గాన్ని చూపించారు ప్రబుద్దులు ఈ స్థాయిలో ఖర్చులు పెడుతున్నారంటే ఖచ్చితంగా భారీ వ్యాపారమే జరుగుతుందని గమనించిన నమ్మిన సామన్యులు చాలా మంది తమ వద్ద ఉన్న డబ్బులు క్రిప్టోలో పెట్టి నిండా మునిగారు. ఇలాంటి వారి మాయమాటలు నమ్మి మోసపోకూడదని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.

వారూ నిందితులే..?

ఇకపోతే నెట్ వర్క్ బిజినెస్ లో తమకు లాభాలు వస్తాయని అంచనాలు వేసుకుని ఏజెంట్లుగా రూపాంతరం చెందిన వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తమను కూడా బాధితులుగా గుర్తించాలని ఫిర్యాదు చేసినప్పటికీ లాభాపేక్షతో పలువురిని మోసానికి గురి చేసి ఈ ఊబిలో దింపిన వారు నిందితులే అవుతారు కానీ బాధితులు మాత్రం కారని పోలీసులు తేల్చి చెప్తున్నట్టుగా సమాచారం. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇలాంటి వారి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోకూడదని అధికారులు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆర్థిక లావాదేవీలు జరిపినట్టుగా ఆధారాలు ఉండడంతో పాటు అసలైన బాధితుల పక్షాన మాత్రమే పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకోనే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. మెటా ఫండ్ ప్రో యాప్ నిర్వాహకులు చేసిన భారీ మోసం గుట్టు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడం సంచలనంగా మారింది. ఈ దందాలో కేటుగాళ్లను మరింతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఆన్ లైన్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.