బీఆర్ఎస్ పార్టీకి సరికొత్త తలనొప్పి…
దిశ దశ, కరీంనగర్:
విశ్వాసంతో అక్కున చేర్చుకున్న ఆ నాయకునికి ద్వితీయ శ్రేణి నాయకులు వేసిన తప్పటడుగులు తలనొప్పిగా మారాయా..? ఆయన చుట్టూ వలయంగా ఏర్పడిన ఆ రెండు కమిటీల్లో ఒక్కరిద్దరు మినహా ప్రతి ఒక్కరూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారేనా..? స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ సరికొత్త తలనొప్పి తెచ్చిపెట్టారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో. తమ నేత ముందు ఈ విషయాన్ని చెప్పలేకపోతున్న ఇతర నాయకులు మింగలేక కక్కలేక మదిలోనే దిగమింగుకుని ముందుకు సాగుతున్నారు. ఒకరిద్దరు నాయకులు సదరు నాయకునికి వివరించినా ఆయన లైట్ గా తీసుకోవడంతో మిగతా వారు వారి గురించి ఆయన ముందు చెప్పేందుకు సాహసించలేకపోతున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
రెండు కమిటీలు…
కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకునికి అత్యంత సన్నిహితంగా ఉన్న కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు ‘‘త్రి మేన్ కమిటీ’’ ‘‘ఫై మెన్’’ కమిటీలుగా ఏర్పడ్డారు. ఈ రెండు కమిటీలలో ఉన్న నాయకుల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా కూడా ఏదో ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే కావడం గమనార్హం. కేసుల్లో ఇరుక్కున్న వారిలో కొంతమంది అరెస్ట్ కాగా మరికొంత మంది నాట్ టూ అరెస్ట్ ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నారు. ఆరోపణల నేపథ్యంలో వీరంతా కూడా సదరు ముఖ్య నాయకునికి నష్టాన్ని చేకూర్చే విధంగా వ్యవహరించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నాయకులు కూడా వారి వ్యవహార శైలిని తప్పు పట్టినప్పటికీ చూసీ చూడనితనంగా వ్యవహరించడం వల్ల ఇప్పుడు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఎన్నికల వేళ…
స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులపై వస్తున్న ఆరోపణలు ఇబ్బందిగా మారనుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నష్ట నివారణ చర్యలు తీసుకోనట్టయితే ఎన్నికల ప్రచారంలో ప్రతికూలతను ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. ఆయా నాయకులు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ఇతర పార్టీల వారికి అనుకూలంగా మారినట్టయితే పార్టీకి తీరని నష్టం వాటిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్న వారూ లేకపోలేదు. రానున్న ఎన్నికల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందన్న సూచనలు కూడా చేస్తున్నారు పార్టీ నాయకులు.

