సరిహద్దులు దాడుతున్నాయ్…
సంచులు మారుతున్నాయ్…
రేషన్ బియ్యం దందాగాళ్ల నయా స్కెచ్…
దిశ దశ, కరీంనగర్:
‘‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’’ అంటే ఇదేనేమో… రేషన్ షాపులకు సన్న బియ్యం సరఫరా చేసినట్టయితే స్మగ్లింగ్ కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావించింది. చాలా మంది సన్న బియ్యం తీసుకుంటున్నారని అనుకున్నప్పటికీ ఇవికూడా అక్రమ మార్గాల గుండా స్మగ్లింగ్ అవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పట్టుబడుతున్న సంఘటనలే ఇందుకు సాక్ష్యంగా చెప్పవచ్చు. అయితే అధికారుల కళ్లుగప్పి వెలుతున్నవి మాత్రం పెద్ద మొత్తంలోనే ఉంటున్నాయని తెలుస్తోంది.
అప్పుడు అటే…
గతంలో రేషన్ షాపులకు దొడ్డు బియ్యం సరఫరా చేసినప్పుడు భారీ నెట్ వర్క్ ద్వారా రాష్ట్రం నలుమూలల నుండి సేకరించిన స్మగ్లర్లు వాటిని మహారాష్ట్రకు తరలించే వారు. సరిహద్దు ప్రాంతాల్లోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల మీదుగా మహారాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రవాణా చేసి సొమ్ము చేసుకునే వారు. దొడ్డు బియ్యం కిలోకు రూ. 12 లేదా రూ.13 చొప్పున కొనుగోలు చేసిన ఏజెంట్లు బడా స్మగ్లర్లకు రూ. 16 చొప్పున విక్రయించే వారు. అక్కడి నుండి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు తరలించిన తెలంగాణ రేషన్ బియ్య ధరలకు రెక్కలు వచ్చి రూ. 30 వరకు విక్రయించే వారు. అయితే మహారాష్ట్రలో బియ్యంపై నియంత్రణ లేకపోవడంతో తెలంగాణ రేషన్ బియ్యాన్ని పట్టుకునేవారు లేకుండా పోయారు. దీంతో కొన్నేళ్లుగా ఈ దందా దర్జాగా సాగింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ బడా వ్యాపారి, గడ్చిరోలి జిల్లాలోని సరిహధ్దుల్లో డెన్ ఏర్పాటు చేసుకున్న కొందరు రేషన్ బియ్యం వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగించారు.
ఇప్పుడు ఇటే…
రాష్ట్రంలో సన్న బియ్యం సరఫరాతో సరిహధ్దు ప్రాంతాల్లోని వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవల్సిందేనని అనుకున్నారు. సన్న బియ్యం సరఫరా తరువాత రేషన్ షాపుల నుండి నేరుగా ఇతర రాష్ట్రాలకు బియ్యం అక్రమ రవాణా దాదాపుగా నిలిచిపోయింది. సన్న బియ్యం పంపిణీ వల్ల ప్రభుత్వ లక్ష్యం సాధించుకున్నట్టయిందని భావించారంతా. కానీ ఇప్పుడు ఆ వ్యాపారులు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. రేషన్ బియ్యం కిలోకు రూ. 18 నుండి రూ. 20 చొప్పున కొనుగోలు చేస్తూ వాటిని పొరుగు రాష్ట్రాలకు తరలించి ప్యాకింగ్ మార్చేస్తున్నారు. సన్న బియ్యాన్ని బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించిన బ్యాగుల్లో ప్యాక్ చేసి ధరలు పెంచి తిరిగి తెలంగాణ రిటేల్ షాపులకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ క్వింటాల్ బియ్యానికి రూ. 2 వేల చొప్పున చెల్లించి మహారాష్ట్ర, ఆదిలాబాద్ లోని తూర్పు ప్రాంతంలోని డెన్ లకు తరలించి రేషన్ బియ్యాన్ని వివిధ బ్రాండ్లకు సంబంధించిన సంచుల్లో ప్యాక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోని రిటేల్ షాపులకు వీటిని అమ్ముతున్న వ్యాపారులు క్వింటాలుకు రూ. 3 వేల నుండి రూ. 3, 500 చొప్పున దండుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడి రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన బియ్యం స్థానిక రిటేల్ దుకాణాలకు చేరిన తరువాత రూ. 4 వేల నుండి 4, 500 చొప్పున విక్రయిస్తున్నట్టుగా సమాచారం. రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నా సన్నాలను కూడా వ్యాపారం చేస్తూ పబ్బం గడుపుకునేందుకు కొత్త దారి ఎంచుకున్నట్టుగా స్పష్టం అవుతోంది.

