దిశ దశ, దండకారణ్యం:
గెరిల్లా విముక్తి ప్రాంతంగా ప్రకటించుకునే దిశగా పట్టు బిగించిన పీపుల్స్ వార్ పార్టీ అనూహ్య పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతాన్ని వదిలి పెట్టింది. పెట్టని కోటగా ఉన్న ఉత్తర తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంలో పీపుల్స్ వార్ పార్టీ ఆదిపత్యం చెలాయించింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వరకూ కొన్ని ప్రాంతాల వైపు వెల్లేందుకు కూడా సాహసించని పరిస్థితి ఉండేది. ఎక్కడ మందు పాతర పేలిందో… ఎటు వైపు నుండి తూటాలు కక్కుతున్నాయో అంతుచిక్కని భయానక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడేవి. ప్రభుత్వానికి సవాల్ విసురుతూ పీపుల్స్ వార్ కొనసాగించిన కార్యకలాపాలను నిరోధించేందుకు అప్పటి పోలీసు యంత్రాంగం ప్రాణాలు గుప్పిట పెట్టుకుని నక్సల్స్ ఏరివేతలో పాల్గొనేది. ఏరియా కమిటీలు, లోకల్ గెరెల్లా స్క్వాడ్స్, జిల్లా కమిటీలు, రాష్ట్ర, కేంద్ర కమిటీ బాధ్యులకు షెల్టర్ జోన్ గా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ సమాంతర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ జిల్లాల్లో పార్టీ తన పట్టు జార విడుచుకుంది. పోలీసులు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి కోవర్టులకు తెరలేపడం, దళాల కదలికలను గుర్తించి ఏరివేత చేపట్టడం కూడా పార్టీకి నష్టాన్ని చేకూర్చింది.
విఫలయత్నం…
అయితే ఉత్తర తెలంగాణాలో గత వైభవం కోసం మావోయిస్టు పార్టీ పలుమార్లు విఫలయత్నం చేసింది. పార్టీలో అత్యంత కీలక నాయకత్వం అంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే అయినప్పటికీ వారి ఇలాకాలో బలహీనపడడం ఆందోళన కల్గిస్తున్నదన్న విషయంపై పలుమార్లు చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీని పునర్నిమాణం కోసం చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. ఆదిలాబాద్ మంగి, మహదేవపూర్, ఏటూరునాగారం, భద్రాద్రి ఏరియాల్లో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసేందుకు చేసిన ప్రయత్నాలూ విఫలం అయ్యాయి. ఒకప్పుడు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ (NTSZC)కి రాష్ట్ర కమిటీ హోదా ఉండగా ఈ కమిటీ కార్యదర్శికి కేంద్ర కమిటీలో ప్రత్యామ్నాయ సభ్యుని హోదా ఉండేది. మిగతా తెలంగాణ అంతా ఒక రాష్ట్ర కమిటీగా ఉన్నప్పటికీ పార్టీ కార్యకలాపాలు మాత్రం NTSZC పరిధిలోనే ఎక్కువగా సాగేవి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విభజించుకుని రెండు జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకున్న చరిత్ర నాటి పీపుల్స్ వార్ ది. అలాంటి పరిస్థితుల నుండి నేడు కనీసం సాయుధ దళాలను ఏర్పాటు చేసుకోలేని పరిస్థితికి చేరుకుంది.
ఒకే ఒక్కడు…
పార్టీ బలహీన పడిపోయిన తరువాత తెలంగాణలో ఏర్పాటు చేసిన కమిటీలన్ని కనుమరుగు అయ్యాయి. చిరవకు తెలంగాణ రాష్ట్ర కమిటీ నేతృత్వంలోనే కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బడే చొక్కారావు అలియాస్ దామోదర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ కమిటీలో సభ్యునిగా ఉన్న కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ రెండు రోజుల క్రితం తెలంగాణ పోలీసుల ముందు లోంగిపోయాడు. దీంతో తెలంగాణ స్టేట్ కమిటీలో అర్బన్ కొరియర్ గా వ్యవహరిస్తున్న ఒకరు, బడే చొక్కారావులు మాత్రమే మిగిలారు. మిగతా వారంతా కూడా బస్తర్ అటవీ ప్రాంతానికి చెందిన వారే కాగా, ఈ కమిటీలో ముఖ్య నాయకులు మాత్రం ఎవరూ లేనట్టుగా స్పష్టం అవుతోంది. ఒకప్పుడు దేశ వ్యాప్త సంచలనాలకు కేరాఫ్ గా నిలిచిన తెలంగాణలో ఇప్పుడు పార్టీ నామమాత్రంగానే మిగిలిపోవడం గమనార్హం.

