జగిత్యాల పోలీసుల అరెస్టుతో వెలుగులోకి
దండకారణ్యానికి తరలిస్తున్న ఘనుడు…
దిశ దశ, జగిత్యాల:
దండకారణ్య అటవీ ప్రాంతానికి మందు గుండు సామాగ్రి సరఫరా మాత్రం ఆగడం లేదు. అక్కడ బలగాల కూంబింగ్ పెద్ద ఎత్తున చేస్తున్నా పేలుడు పదర్థాలు మాత్రం తరలిపోతూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల పోలీసులు జిలిటెన్ స్టిక్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడంతో మరో సారి వెలుగులోకి వచ్చింది. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొలాస వ్యవసాయ క్షేత్రం సమీపంలోని ప్రధాన రోడ్డుపై కారులో తరలిస్తున్న పేలుడు పదార్థాలను పట్టుకున్నారు పోలీసులు. వీటిని చత్తీస్ గడ్ లోని మావోయిస్టులకు విక్రయించేందుకు తరలిస్తున్నట్టుగా విచారణలో తేలింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో కొంతకాలం ఆర్ఎంపీగా జీవనం సాగించి ప్రస్తుతం ధరూర్ క్యాంపులో నివాసం ఉంటున్న మురుగుపాలయ రాము అనే వ్యక్తి చత్తీస్ గడ్ లోని బీజాపూర్ కు చెందిన ప్రభుత్వ టీచర్ ను 2014 వివాహం చేసుకున్నాడు. బీజాపూర్ లోనే తన భార్యతో కలిసి ఉంటున్న రాము అడపాదడపా జగిత్యాల సమీపంలోని ధరూర్ క్యాంపులోని తన ఇంటికి వచ్చి వెల్తుండేవాడు. 2022 సంవత్సరంలో రాముకు అతని పాత స్నేహితులు, వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని గూడురుకు చెందిన సంపంగి బాలకృష్ణ, సంపంగి సురేష్ లు కలిశారు. కాంట్రాక్టు పనులు ఉన్నాయని భాగస్వామ్యంతో పనులు చేద్దామని వారు ప్రతిపాదించడంతో రాము రూ. 10 లక్షలు అప్పు చేసి వారికి పెట్టుబడిగా ఇచ్చాడు. అయితే వారిద్దరు కూడా రామును మోసం చేయడంతో అప్పులు తీర్చేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. కొద్ది రోజులుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఆసరెల్లిలో ఆర్ఎంపీగా ప్రాక్టీసు చేయడం మొదలు పెట్టాడు. ఒకసారి భూపాలపట్నంలో ఉన్న సమయంలో రాము ఆర్ఎంపీ అని తెలుసుకుని మావోయిస్టు పార్టీ నక్సల్స్ అడవికి తీసుకెళ్లారు. అనారోగ్యంతో బాధ పడుతున్న నక్సల్స్ కు చికిత్స చేస్తున్నప్పుడు అక్కడి అటవీ ప్రాంతంలో తీవ్రంగా చేస్తున్న కూంబింగ్ నియంత్రించాలంటే పేల్చివేతలకు పాల్పడాలని మాట్లాడుకున్నారు. ఈ మాటలు మనసులో పెట్టుకున్న రాము తన అప్పులు తీరాలంటే నక్సల్స్ కు పేలుడు పదార్థాలు సరఫరా చేయడం సముచితమని నిర్ణయించుకున్నాడు.
క్వారీల పేరిట…
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలానికి చెందిన వనపర్తి తిరుపతిని కలిసి తనకు జగిత్యాల జిల్లా కొండగట్టులో, కరీంనగర్ జిల్లా బావుపేటలో క్వారీలు ఉన్నాయని నమ్మబలికి పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. రూ. 29,700 చెల్లించి మూడు కార్టన్ల జిలిటెన్ స్టిక్స్, రెండు బెండిల్స్ డికార్డ్ ఫ్యూజ్ లను కొనుగోలు చేశాడు. 2024 ఆగస్టు నెలలో కొనుగోలు చేసిన ఈ పేలుడు పదార్థాలను తన కారు నంబర్ TS02EC6633లో ధర్మపురి, మంచిర్యాల, చెన్నూరుల మీదుగా చత్తీస్ గడ్ సరిహధ్దుల్లోని అటవీ ప్రాంతంలో దాచి పెట్టాడు. మరోసారి చికిత్స కోసం మావోయిస్టుల నుండి పిలుపును అందుకున్న రాము వారితో తాను పేలుడు పదార్థాలు తీసుకచ్చానని చెప్పాడు. దీంతో వాటిని మావోయిస్టులు అక్కడి అటవీ ప్రాంతంలోని ఓ చోట దాచిపెట్టాలని చెప్పి అతనికి రూ. 6 లక్షల నగదు ఇచ్చారు. ఆ తరువాత కూడా మూడు సార్లు వనపర్తి తిరుపతికి రూ. 71 వేలు చెల్లించి ఏడు బాక్సులు జిలిటెన్ స్టిక్స్, నాలుగు బెండిల్ల డికార్డ్ ఫ్యూజ్ ను చత్తీస్ గడ్ కు తరలించి దాచి పెట్టాడు. మావోయిస్టులను కలిసినప్పుడు తాను మళ్లీ పేలుడు పదార్థాలు తీసుకవచ్చానని రాము వివరించడంతో మావోయిస్టులు వరదలి గ్రామ ఉప సర్పంచ్ చిల్లమర్క నివాసి అయిన పిన్నాపెళ్లి రమేష్ ను కలిసి అప్పగించాలని చెప్పారు. అతన్ని కలిసిన రాము నక్సల్స్ ఇచ్చిన సమాచారం అతనికి చేరవేసి రూ. 20 లక్షలు ఇవ్వాలని అడిగాడు. పిన్నాపెళ్లి రమేష్ మాత్రం రూ. 15 లక్షలకు బేరం కుదుర్చుకుని రూ. 10 లక్షలు అప్పగించాడు. పేలుడు పదార్థాలు ఇలాగే అక్రమ రవాణా చేసి నక్సల్స్ కు అప్పగించినట్టయితే తన ఆర్థిక సమస్యలన్ని తొలగిపోతాయని భావించిన రాము తిరిగి జగిత్యాలకు చేరుకున్నాడు. వనపర్తి తిరుపతికి రూ. 64 వేలు చెల్లించి 400 జిలిటెన్ స్టిక్స్, 8 బెండిల్ల డికార్డ్ ఫ్యూజ్ లను కొనుగోలు చేసి ధరూర్ క్యాంపులోని తన ఇంటికి తరలించాడు. ఆదివారం మద్యాహ్నం పేలుడు పదార్థాలను రాము కారులో తరలిస్తున్న క్రమంలో పోలీసులు ధర్మపురి రహదారిలోని పొలాస వద్ద పట్టుకున్నారు. కారులో రూ. 7.50 లక్షల నగదు, 400 జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లు, 8 బెండిళ్ల డికార్డ్ ఫ్యూజ్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుని మొబైల్ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. క్రైం నంబర్ 212 2025, సెక్షన్ 61 (2) రెడ్ విత్ 3 (5) BNS యాక్ట్, సెక్షన్ 4 ఆప్ ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ 1908, సెక్షన్ 10, 13, 16, అండ్ 18 Unlawful Activities Prevention Amendment Act-2008/2019 and Sec. 8(i)(ii) of TSPS act లలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో మురుగు పాలయ రాము, వనపర్తి తిరుపతి, పిన్నాపెళ్లి రమేష్ లను కూడా నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.