పెద్దనాన్నకు కూతురి సూచన…
దిశ దశ, కరీంనగర్:
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీని అభ్యర్థిస్తు ఆయన సోదరుడు గంగాధర్ తనయ సుమ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇన్ స్టా స్టేటస్ లో పోస్ట్ చేసిన సుమ రాసిన కామెంట్స్ ఆలోచింపచేస్తున్నాయి. ‘‘అరణ్యంలో కాదు… అందరి మధ్యలో ఉండాలి, ఇన్ని రోజుల మీ వనవాసం ఎప్పుడు ముగుస్తుందోనని చూసే నాలాంటి వారి తరుపున గెలిచేసిన పోటీలో ఇంకా పాల్గొనడం ఎందుకు, మీరు గెలిచేసారు… అరణ్యం అంటే మీ పేరే అడవి అంతా మీ సైన్యమే, మేము నేర్చుకోవాలి, మేము తెలుసుకోవాలి, మీ నుండి ఇంకా ఎన్నో రావాలి, ఇప్పుడు మీరు అరణ్యంలో కాదు అందరి మధ్యలో ఉండాలి. పైసా కోసం పరిగెత్తే ప్రపంచమిది, సమానత్వం ఉందిలే అని సర్దుకపోయే సమాజమిది, వచ్చేయండి మీరు…. మా కోసం… ఎన్నో నేర్చుకోవాలని ఎదురు చూసే సమాజం కోసం ఒక మార్పు కోసం… అరణ్యం వదలి అందరి మధ్యలోకి రావాలి… లొంగుబాటు కాదు ఇది… లోకానికి మీ తెలివి అవసరం కోసం… ధైర్యం కోసం… ప్రశ్నించడం కోసం… విప్లవం కోసం ఒక మార్పు కోసం… లొంగుబాటు కాదు లోకానికి మీ అవసరం తిపిరి తిరుపతి’’ అంటూ తిపిరి సుమ తన భావాలను పంచుకున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా విప్లవ పంథాలో ముందుకు సాగుతున్న తిపిరి తిరుపతిని ఉద్దేశించి సుమ రాసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు, సాయుధులుగా కొంతమంది నేతలు, నిరాయుధులుగా మరికొంతమంది జన జీవనంలోకి వస్తున్న నేపథ్యంలో సుమ షేర్ చేసిన ఈ పోస్టు ఆలోచింపచేసే విధంగా ఉంది. పీపుల్స్ వార్ ప్రస్థానం నుండి మావోయిస్టు పార్టీ వరకు అడవులతోనే మమేకమైన తిపిరి తిరుపతిని ఉధ్దేశించి సుమ చేసిన ఈ సూచనపై ఆయన ఎలా స్పందిస్తారో తెలియదు కానీ… సోషల్ మీడియా అకౌంట్ వేదికగా ఆమె ఇచ్చిన పిలుపు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో కూడా తిపిరి తిరుపతిని ఉద్దేశించి సుమ షేర్ చేసిన పోస్ట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె చేసిన ఈ పోస్టు ప్రభావం ఎంతమేర ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

