నిర్మాణాలు జురుగుతున్న వైనం…
దిశ దశ, కరీంనగర్:
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కెనాల్స్ అస్తిత్వానికి సవాల్ విసురుతున్నారు స్థానికులు. కాలువల పరిసర ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం చేసుకుంటూ ఏకంగా కాలువలకు ఇరువైపులా సైడ్ వాల్స్ కడుతున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. కరీంనగర్ రూరల్ మండలం నగునూరు శివార్ల మీదుగా వెలుతున్న D93 కెనాల్ సమీపంలో నిర్మాణాలు చేస్తున్న స్థానికులు కాలువ నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా లైనింగ్ వర్క్స్ చేసుకుంటున్నారు. వాస్తవంగా SRSP అధికారులే కాలువలను ఆధునీకరించేందుకు నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు ఇండ్ల నిర్మాణం చేపట్టి లైనింగ్ పనులు చేయించుకుంటుండడం విస్మయం కల్గిస్తోంది. నగునూరు దుర్గామాత ఆలయానికి వెల్లే రహాదారిలో జన సంచారం పెరగడంతో ఒక్కొక్కరూ ఇండ్ల నిర్మాణం చేపట్టడం మొదలు పెట్టారు. అయితే ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్నా కాలువ అడ్డంకిగా మారడంతో అధికారుల అనుమతులతో సంబంధం లేకుండానే డ్రైనేజీలకు ఇరువైపులా చేపట్టే నిర్మాణాల మాదిరిగా పెద్ద పెద్ద రాళ్లతో కట్టడాలు చేపట్టారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు కాలువల లైనింగ్ వర్క్ చేపట్టేందుకు కాలువలు దెబ్బతినేందుకు ఇరువైపులా సిమంట్, కాంక్రీట్ తో ఒక లేయర్ వేయిస్తారు. కానీ నగునూరులో మాత్రం ఏకంగా భారీ సైజు బండలతో కాలువలకు ఇరువైపులా నిర్మాణం చేయడంతో పాటు, నీరు పారే దిగువ ప్రాంతంలో కూడా కాంక్రీట్ తో బేస్ వేస్తున్నారు. దీంతో ఎగువ ప్రాంతం నుండి వచ్చే నీరు దిగువకు వెల్లేందుకు అనువుగా నిర్మించినా కెనాల్ లోపల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల సకాలంగా సాగునీరు దిగువ ప్రాంతాలకు చేరే అవకాశం లేకుండా పోవడతో పాటు లైనింగ్ వర్క్స్ లేని చోట్ల ఒత్తిడికి గురై కాలువలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

ఇరువైపులా భూమి…
D93 కెనాల్ తో పాటు ఇరువైపులా కూడా భూసేకర జరిపారు అధికారులు కాలువలు దెబ్బతినకుండా ఉండడంతో పాటు ఓ వైపున రోడ్డు నిర్మాణం చేసుకునేందుకు అవసరమైనంత మేర భూసేకరఫణ జరిపారు. ఈ కెనాల్ కు ఎడమ, కుడి వైపున అవసరమున్నంత మేర రోడ్లను నిర్మించుకునేందుకు సేకరించిన ఈ భూమి కూడా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోకే వస్తుంది. ఆయా ప్రాంతాలను బట్టి ఎడమ వైపున 11 మీటర్ల నుండి 37 మీటర్ల వరకు, కుడి వైపున 11 మీటర్ల నుండి 35 మీటర్ల వరకు భూ సేకరణ జరిపినట్టుగా ఎస్సారెస్పీ రికార్డులు చెప్తున్నాయి. అయితే నగునూరు మీదుగా వెల్తున్న డి93 కెనాల్ సమీపంలో ఇండ్ల నిర్మాణాలు జరుపుకుంటున్న స్థానికులు కేవలం కెనాల్ మాత్రమే ఎస్సారెస్పీకి చెందిందని మిగతా భూమి అంత తమదేనని దర్జాగా చెప్పుకుంటున్న తీరే విస్మయానికి గురి చేస్తోంది. కాలువలపై జరుగుతున్న అక్రమ నిర్మాణాల గురించి ఎస్సారెస్పీ అధికారులకు సమాచారం అందడంతో వారు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. వాస్తవంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు బాధ్యులపై నీటిపారుదల శాఖ చట్టాల ఆధారంగా చర్యలు తీసుకోవల్సి ఉంటుందని తెలుస్తోంది. కానీ అధికారులు మాత్రం హెచ్చరించి వెల్లిపోవడంతోనే సరిపెట్టడం ఏమిటని స్థానికులు అంటున్నారు. ఈ నిర్మాణాల విషయంలో పట్టించుకోని వైఖరి అవలంభిస్తే భవిష్యత్తులో ఎస్సారెస్పీ కాలువల ఉనికే ప్రశ్నార్థకం కానుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

