‘‘బండి’’ నజరానా…
దిశ దశ, కరీంనగర్:
స్థానిక సంస్థలను కైవసం చేసుకునేందుకు కార్యాచారణ అమలు చేస్తున్న బీజేపీ మరో కొత్త ఎత్తుగడతో ముందుకు సాగుతోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు ఇప్పటికే క్షేత్ర స్థాయి కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బూత్ లెవల్లో పార్టీ నిర్మాణంపై దృష్టి సారించిన కరీంనగర్ బీజేపీ నాయకులు స్థానిక సమరానికి సమాయత్తం అవుతున్న సంగతి తెలిసిందే. కరీంనగర్ లోకసభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లకు సంబంధించిన పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించడంలో సఫలం అయిన నేపథ్యంలో స్థానిక సంస్థల్లో కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పంచాయితీ రాజ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నజరానాలు ప్రకటించారు. బుధవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులను ఉధ్దేశించి మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పెషల్ ప్యాకేజీలను ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించినట్టయితే నిధుల వరద పారిస్తానని వెల్లడించారు. బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి గెలిచినట్టయితే మండలానికి రూ. 10 లక్షలు, ఎంపీటీసీ గెలిస్తే రూ. 5 లక్షలు ఇస్తానని బండి సంజయ్ తెలిపారు.
విద్యార్థులకూ…
ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే సైకిళ్లను పంపిణీ చేశామని 9వ తరగతి స్టూడెంట్స్ కు కూడా సైకిళ్లను అందజేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. అలాగే ఒకటో తరగతి నుండి 6వ తరగతి విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుండి మోదీ కిట్స్ కూడా అందజేస్తానన్నారు.

