ప్రకృతితో మమేకం కండి… వినూత్న ఆవిష్కరణలతో ఆదర్శంగా నిలవండి: కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి…

దిశ దశ, కరీంనగర్:

విద్యార్థులు క్రియేటివిటీతో కూడిన ఆలోచనలకు పదును పెట్టాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్ కొత్తపల్లి అల్పోర్స్ ఈ టెక్నో పాఠశాలలో 2025-26 సంవత్సర జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ అవార్డ్స్ మనాక్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… 10 ఏళ్లుగా క్రమం తప్పకుండా కరీంనగర్ జిల్లా నుండి సైన్స్ ఎగ్జిబిట్స్ రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఏ జిల్లాలో లేని విధంగా కరీంనగర్ లో సైన్స్ మ్యూజియం ఉందని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఈ మ్యూజియాన్ని సందర్శించవచ్చన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా బాల శాస్త్రవేత్తలను తీర్చిదిద్దే అవకాశం ఉందని, దీనిని ప్రతి విద్యార్థి కూడా వినియోగించోకవాలని సూచించారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో భూమిక పోషించడంలో విద్యార్థులదే కీలక పాత్ర అయినందున ప్రతి స్టూడెంట్ కూడా సరికొత్త ఆలోచనలతో తయారు చేసే వినూత్న ఆవిష్కరణలే భావితరాలకు ఆదర్శంగా ఉంటాయని కలెక్టర్ అన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ది, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం, పునరుత్పాదక శక్తి, శాస్త్ర, సాంకేతికత, నీటి సంరక్షణ, ఆరోగ్యం, పరిశుభ్రత, గణిత నమూనాలు తదితర అంశాలపై విజ్ఞాన మేళ నిర్వహిస్తున్నామన్నారు. నీరు, ఆహారం, విద్యుత్, వంటి వాటిని ఆధా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రపంచ స్థాయిలో సృజనాత్మకత ఉండాల్సిన అవసరం లేదని మన చుట్టూ నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కూడా ఆలోచనలు చేయాల్సిన అవశ్యకత కూడా ఉందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని పమేలా సత్పతి సూచించారు. ప్రకృతితో మానవ జీవితం ముడిపడి ఉందని, నూతన ఆవిష్కరణలు కూడా ప్రకృతితో ముడిపడి ఉండాలని, దీనివల్ల శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధికి సార్ధకత ఉంటుందని ఉద్ఘాటించారు. ప్రకృతికి అనుగుణంగా జీవన విధానం ఏర్పరచుకొని భవిష్యత్ తరాలకు నూతన ఆవిష్కరణలను అందించాల్సని బాధ్యత ఉందన్నారు. విద్యార్థులు ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి వైజ్ఞానికతతో కూడిన ఆవిష్కరణలు చేయాలన్నారు. ఉపాధ్యాయులు కూడా పాఠశాలల్లోని విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలను వినియోగిస్తూ విద్యార్థుల్లో శాస్త్రపరమైన ఆలోచనలు పెంపొందించడానికి కృషి చేయాలని సూచించారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల ఛైర్మన్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… భారత ప్రభుత్వం విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు వారిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఇన్స్పైర్ పురస్కారాల ద్వారా అధిక నిధులు వెచ్చిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇంజనీరింగ్, వైద్యరంగాలపై మాత్రమే కాకుండా విజ్ఞాన శాస్త్రంపై కూడా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. దీనివల్ల భారతదేశ శాస్త్ర సాంకేతికతను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ… జిల్లాస్థాయిలో బాల వైజ్ఞానిక ప్రదర్శన కోసం మొత్తం 807 సైన్స్ ఎగ్జిబిట్స్, 126 ఇన్స్పైర్ మనాక్ ఎగ్జిబిట్లు వచ్చాయని వివరించారు. ఇందులో ఏడు అంశాలను ప్రదర్శనకు ఉంచామని ప్రతి అంశం నుంచి ఉత్తమంగా వచ్చిన ఒక ప్రదర్శనను రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రతిపాదిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి ఎస్.భగవంతయ్య, సెక్టోరియల్ అధికారులు కర్ర అశోక్ రెడ్డి, ఆంజనేయులు, మిల్కూరి శ్రీనివాస్, కృపారాణి, కొత్తపల్లి మండల విద్యాశాఖాధికారి ఆనందం తదితరులు పాల్గొన్నారు.