మామ కరిష్మా… కోడలు ‘‘చరిష్మా’’..!

జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం…

తెరపైకి చిన్న కోడలు పేరు…

దిశ దశ, జగిత్యాల:

సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి కుటుంబ రాజకీయాల్లో సమీకరణాలు పూర్తిగా మారనున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుతో అసహనం వ్యక్తం చేస్తున్న జీవన్ రెడ్డి పార్టీ ఫిరాయించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆయన ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారోనన్న అంశంపై క్లారిటీ అయితే రావడం లేదు. కానీ రాష్ట్రంలో సీనియర్ నాయకుల్లో ఒకరైన జీవన్ రెడ్డికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ తో పాటు కాంగ్రెస్ పార్టీపై పట్టు సాధించాలన్న లక్ష్యంతో ఇతర పార్టీలు పావులు కదుపుతున్నాయి. అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఆయనకు సెక్రటరీ జనరల్ బాధ్యతలు అప్పగించడంతో పాటు రాష్ట్రంలో గులాభి పార్టీ బలోపేతం చేసే క్రియాశీలక బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించే యోచనలో బీఆర్ఎస్ అధినేత ఉన్నట్టుగా కూడా స్థానికంగా చర్చ సాగుతోంది. మరో వైపున బీజేపీ కూడా జీవన్ రెడ్డిని తమ పార్టీలో చేర్పించుకోవాలని పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. గవర్నర్ లేదా రాజ్యసభ పదవిని కట్టబెట్టేందుకు సిద్దంగా ఉన్నామన్న సంకేతాలను బీజేపీ నేతలు పంపించినట్టుగా తెలుస్తోంది.

వారసురాలు ఎంట్రీ…

అయితే ఇంతకాలం వారసులను రాజకీయాలకు దూరంగా ఉంచిన  జీవన్ రెడ్డి ఇప్పుడు మాత్రం వారిని రంగంలోకి దింపాలన్న యోచనలో ఉన్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మాత్రం జగిత్యాల అసెంబ్లీ స్థానం  మహిళలకు కెటాయించే అవకాశాలు ఉన్నాయన్న అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ వారసురాలిగా చిన్న కోడలు చరిష్మా రెడ్డిని బరిలో నిలిపే యోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చరిష్మా రెడ్డి తండ్రి కూడా రాజకీయాల్లో ఉండడంతో ఆమెకు కలిసి రానుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా జగిత్యాల అసెంబ్లీ టికెట్ జీవన్ రెడ్డి వారసులకు ఇచ్చి ఆయనకు పార్టీలో సముచిత ప్రాధాన్యత కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. చరిష్మా రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినట్టయితే  నియోజకవర్గంలో ఆయనకు ఉన్న పట్టు, రాష్ట్రంలో ఆయనకు ఉన్న  ఇమేజ్  కలిసి వస్తుందని అనుకుంటున్నారు. అసెంబ్లీ, లోకసభ, మునిసిపల్ ఎన్నికల్లో చర్మిష్మా రెడ్డి విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. దీంతో స్థానికంగా ఆమెకు గుర్తింపు కూడా ఉండడం లాభించే అవకాశం ఉంది. ఇంతకాలం వారసులను రాజకీయాలకు దూరంగా ఉంచిన జీవన్ రెడ్డి ఈ సారి మాత్రం ఖచ్చితంగా వారికి ప్రాధాన్యత కల్పిస్తారన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.  బీఆర్ఎస్ అధినేత కూడా జీవన్ రెడ్డిని పార్టీకి బలమైన ఆయుధం అవుతారని భావిస్తున్నట్టుగా స్థానికంగా చర్చ జరుగుతోంది.

పరాభవం…

జీవన్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీని వీడే పరిస్థితిని కల్పించారని పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా ఆయనతో మంతనాలు జరిపేందుకు ప్రయత్నించినప్పటికీ తన నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారని సమాచారం. అయితే ఇప్పటి వరకు ఆయన ఏ పార్టీలో చేరుతారోనన్న విషయంపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో కొంత సస్పెన్స్ అయితే నెలకొంది. కానీ గురువారం నుండి పరాభవ నామ సంవత్సరం అడుగుపెడుతున్న క్రమంలో ఆయన ఏ పార్టీలో చేరుతారో వెల్లడించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 25వ తేదిన జగిత్యాల గడ్డపైనే పార్టీ మారనున్నారని సమాచారం.