దిశ దశ, కరీంనగర్:
ఉపాధ్యాయులుగా కలిసి పనిచేసినప్పటి స్నేహ బంధం మామూళ్ల వసూళ్లకు చేదోడుగా నిలిచింది. స్నేహితుడి హితం కోసం లంచం వసూళ్లకు సహరించినందుకు టీచర్ కూడా అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు కరీంనగర్ అర్బన్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రామును అదుపులోకి తీసుకున్నారు. గుండేటి రాము గతంలో వేములవాడ SHOగా పనిచేస్తున్నప్పుడు బెల్లం వ్యాపారుల నుండి నెల నెల లంచం తీసుకునేవాడు. అయితే మాముళ్లు నేరుగా తీసుకోకుండా అతని స్నేహితుడు ఒబులాపూర్ లో ఎస్జీటీగా పని చేస్తున్న జక్కని వేణు అకౌంట్ కు యూపీఐ పేమెంట్ చేయించుకున్నారు. 2019 నుండి 2024 ఫిబ్రవరి వరకు UPI లావాదేవీల ద్వారా జక్కని వేణుకు చెందిన SBI, UBI ఖాతాలకు నగదును బదిలీ చేయించుకున్నారు. ఆ తరువాత ఈ డబ్బును ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాము, అతని తండ్రి అకౌంట్లకు టీచర్ జక్కని వేణు బదిలీ చేశారు. ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కు బినామీగా వ్యవహరించినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రామును, టీచర్ జక్కని వేణులను అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చినట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ఎస్జీటీలుగా…
కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాము, జక్కని వేణులు ఇద్దరు గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT)లుగా కలిసి పని చేశారు. ఆ తరువాత రాము ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గా ఉద్యోగం సాధించాడు. అయితే ఉపాధ్యాయులుగా కలిసి పని చేసినప్పటి స్నేహాన్ని ఆసరగా తీసుకున్న రాము జక్కని వేణ అకౌంట్ ద్వారా తన మామూళ్లు వసూళ్లు చేసుకోవడం మొదలు పెట్టాడు. స్నేహితుని లంచం కోసం టీచర్ అయిన వేణు యూపీఐ పేమెంట్స్ ద్వారా తన అకౌంట్స్ కు నగదును బదిలీ చేయించుకునేందుకు సమ్మతించాడు. అయితే గుండేటి రాము గురించి ఏసీబీ డీజీపీకి ఫిర్యాదు చేయడంతో సమగ్రంగా విచారణ చేసిన ఏసీబీ అధికారులు రాముతో పాటు అతనికి సహకరించిన టీచర్ వేణును కూడా అరెస్ట్ చేశారు. మరో వైపున మంగళవారం రాత్రి గుండేటి రాము ఇంట్లో సోదాలు చేయగా రూ. 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టుగా ఏసీబీ అధికారులు వెల్లడించారు.

