Telangana Congress Party: సోషల్ మీడియాలో కలకలం… కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆందోళన…

సంచలనంగా మారిన తీరు…

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పీసీసీ బాధ్యతల్లో ఉన్న ఆయన ఓ జిల్లా కలెక్టర్ చర్యలను తప్పు పడుతూ చేసిన పోస్ట్  వైరల్ గా మారింది. పీసీసీ   సీనియర్ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం చేసిన పోస్టు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనపై తప్పుడు ఆరోపణలకు సంబంధించిన ఫిర్యాదులు తీసుకుని అభియోగాలు మోపుతూ తన కార్యాలయానికి విధిగా హాజరు కావాలని కలెక్టర్ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ఇది తన ఒక్కడిపైనే కాదని జిల్లా ప్రజల్లో ఎంతో మంది ప్రత్యక్ష్యంగానో పరోక్షంగానో తెలియని కారణాల వల్ల అన్యాయానికి గురవుతున్నారన్నారు. జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ స్థాయిలో ఉన్న వ్యక్తి విరోధం, ప్రతీకార భావనతో ఇలా వ్యవహరించడం అంటే ప్రమాదకరమైన దాడి అని తాను భావిస్తున్నానని మృత్యుంజయం కామెంట్ చేశారు. ఇలాంటి చర్యలకు తాను చింతించను కానీ దీనివల్ల జిల్లా ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు ఆయన పుట్టకపోయి ఉండవచ్చన్నారు. తన రాజకీయ ప్రత్యర్థుల సలహాతో 40 ఏళ్లుగా ఉన్న ఆయుధ లైసెన్స్ రద్దు చేయాలని ప్రయత్నాలు చేశారని, ఇది ఖచ్చితంగా తనను నిరాయుధుడిని చేసేందుకు రాజకీయ శత్రువుల కుట్రేనని  మృత్యుంజయం ఆరోపించారు. తన ఫోన్ నంబర్ కూడా కలెక్టర్ బ్లాక్ లిస్టులో పెట్టారని, ఈ విషయాన్ని సీసీ, సూపరింటిండెంట్ కు సమాచారం ఇచ్చిన పరిస్థితిలో మార్పులేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న విషయాలను ప్రభుత్వ, పార్టీలోని ప్రముఖుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని కూడా వివరించారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన మృత్యుంజయం ఫేస్ బుక్ వేదికగా చేసిన ఈ పోస్టు సరికొత్త చర్చకు దారి తీస్తోంది. రాష్ట్రంలోని ప్రముఖ నాయకులతో పాటు సీనియర్ అధికారులతో వ్యక్తిగత పరిచయాలు ఉన్న నేత ఈ విధంగా పోస్ట్ చేయడం మాత్రం సరికొత్త చర్చకు దారి తీస్తోంది.

మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ ఇదే…

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారశైలిపై ఒక రాజకీయ అనుభవజ్ఞుడిగా,ఒక సామాజిక కార్యకర్తగా నా వేదనాత్మక పరిశీలన. 

నా సుదీర్ఘ సామాజిక-రాజకీయ జీవన ప్రయాణంలో ,అనేక జిల్లాల కలెక్టర్లను చూశాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పనిచేసిన అందరూ కలెక్టర్లను కలిశాను, చూసాను. కొందరు తమ విధి పరిధిలోనే పనిచేసేవారు, మరికొందరు ప్రజాసేవకు అంకితమయ్యారు. ప్రజల మదిలో నిలిచిపోయిన సేవా నిరతులు కూడా ఉన్నారు. కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రస్తుత కలెక్టర్‌లా విచిత్రమైన వైఖరి కలిగిన వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. మొదట నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమోనని అనుకున్నాను. కానీ, నా మొబైల్ నెంబర్‌ను ఆయన బ్లాక్ చేసినట్టు అనిపించింది. ఎన్నిసార్లు ఆయన నెంబర్ (7032867111) కి ఫోన్ చేసినా, ఒకే ఒక్కసారి రింగ్ అయ్యి వెంటనే కట్ అవుతుంది — బిజీగా ఉందన్న సంకేతం వస్తుంది. ఇదంతా తెలుసుకున్న తరువాత కూడా, కలెక్టరేట్‌లోని ఆయన ‘సీసీ’ కి మరియు ఒక సూపరింటెండెంట్‌కు కూడా నాఫోన్ బ్లాక్ అయిన విషయం చెప్పాను. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. నిరాధారమైన ఆరోపణలు గల కొందరిని ప్రోగుచేయించి తప్పుడు ఆరోపణ పత్రాలు వారినుండి స్వీకరించి, నాపై అభియోగాలను మోపుతూ నన్ను తన కార్యాలయానికి విధిగా హాజరు కావాలని నోటీసులు.
ఇది నా ఒక్కడిపైనే కాదు,ఈ జిల్లా ప్రజల్లో ఎంతోమంది, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎందుకో తెలియని కారణాల వల్ల అన్యాయానికి గురవుతున్నారు. ఒక జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ స్థాయిలో ఉన్న వ్యక్తి సడన్‌గా విరోధం, ప్రతీకార భావనతో ఇలా వ్యవహరించడమంటే ,అది వ్యక్తిగత స్థాయికి మించిపోయిన ప్రమాదకరమైన దాడి అని నేను భావిస్తున్నాను. నా పట్ల ఆయన విద్వేషపూరిత వైఖరికి నేను వ్యక్తిగతంగా చింతించను. కానీ, అధికార దుర్వినియోగానికి ప్రజలు బలవుతున్నారు. ఈ విచ్చలవిడితనాన్ని చూస్తుంటే ఆశ్చర్యము మరియు బాధ కలుగుతున్నాయి. ఎక్కడిదీ ధైర్యం! కనీసం రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా నాకు గౌరవం ఇవ్వనప్పుడు , ఆయన వెంటనే ఉండి , అనేక తప్పులు చేయిస్తున్న అనధికార వ్యక్తులో, కింద పనిచేస్తున్న అధికార వర్గాలో ,ఆయనకు తెలియచేయక పోవచ్చు— నేను శాసన సభ్యుడిగా ఎన్నుకోబడ్డప్పుడు, ఆయన పుట్టకపోయి ఉండవచ్చు అని. నేను ఈ విషయం ప్రజల దృష్టికి తీసుకురావాలనుకున్న ముఖ్య కారణం: ఈ కలెక్టర్ గారు నా రాజకీయ ప్రత్యర్థుల సలహాతో నాకు 40 ఏళ్లుగా ఉన్న ఆయుధ అనుమతి (గన్ లైసెన్స్) రద్దు చేయాలనే ప్రయత్నం చేశారు. ఇది ఖచ్చితంగా నన్ను నిరాయుధుణ్ణి చేయాలనే నా రాజకీయ శత్రువుల కుట్ర. ఇది అధికార దుర్వినియోగానికి ప్రతీక. ఈ విషయాన్ని నేను కొందరు ప్రభుత్వ మరియు పార్టీ ప్రముఖుల దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈరోజుకు ఇక్కడితో ముగిస్తున్నాను. నా స్నేహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు – నా ఆందోళనను అర్థం చేసుకొని, ఈ అక్రమ అధికార ప్రయోగాన్ని ఆపడానికి బాధితులందరూ మన ప్రజా ప్రభుత్వానికి లేఖల ద్వారా విన్నపాలు చేసుకోవాలని సూచిస్తున్న.

– కటకం మృత్యుంజయం, మాజీ సభ్యుడు, గ్రామపంచాయితీ, గంభీరావుపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా, మాజీ అధ్యక్షుడు, PACS గంభీరావుపేట, మాజీ అధ్యక్షుడు, జిల్లా సహకార బ్యాంక్, కరీంనగర్, మాజీ ZPTC సభ్యుడు, ఓదెల, పెద్దపల్లి జిల్లా, మాజీ శాసనసభ్యుడు, కరీంనగర్