దిశ దశ, హుజురాబాద్:
వ్యవసాయ భూములను సస్యశామలం చేసేందుకు నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల అస్తిత్వానికి సవాల్ విసురుతున్నట్టుగా ఉంది. ఏకంగా కెనాల్ రోడ్డు మీదుగానే ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తున్న తీరు సంచనలంగా మారింది. ప్రభుత్వం పరిధిలో ఉన్న రెండు విభాగాల మధ్య సమన్వయం లేకుండా పోవడం వల్లే ఈ పరిస్థితి తయారైనట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వీణవంకలో…
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిపై పలు చోట్ల తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (TGMDC) ఇసుక రీచులను ఏర్పాటు చేసింది. మండలంలోని మల్లారెడ్డిపల్లి ఇసుక రీచుకు ప్రత్యేకంగా దారి లేకున్నప్పటికీ ఇసుక రీచును నిర్వహిస్తుండడం విచిత్రంగా ఉంది. TGMDC అధికారులు ఇసుక రీచు ఏర్పాటు చేసే ప్రాంతానికి లారీలు రాకపోకలు సాగించడంతో పాటు స్టాక్ యార్డు ఏర్పాటు చేసుకునేందుకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ మల్లారెడ్డిపల్లి ఇసుక రీచు విషయంలో మాత్రం అధికారులు ఈ విషయాలను అంతగా పట్టించుకోనట్టుగా స్పష్టం అవుతోంది.
కెనాల్ మీదుగా…
మండలంలోని పంట చేలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించేందుకు ప్రధాన, ఉప కాలువల నిర్మాణం గతంలోనే జరిగింది. సబ్ కెనాల్ కు సంబంధించిన ఓ కాలువ కోసం వేసిన రోడ్డు మీదుగానే ఇసుక లారీలు నడుస్తుండడం గమనార్హం. ఇరిగేషన్ అధికారులు కాలువలు ఎలా ఉన్నాయి..? నీటి సరఫరా ఎలా అవుతుంది అన్న విషయాలు గమనించడంతో పాటు మరమ్మత్తులు చేసుకునేందుకు కెనాల్ మీదుగా రోడ్లను నిర్మింటారు. ఈ రోడ్లను సమీపంలోని రైతులు కూడా వినియోగించుకునేందుకు మాత్రమే ఇరిగేషన్ అధికారులు అనుమతి ఇస్తారు. కానీ మల్లారెడ్డిపల్లి ఇసుక రీచు మీదుగా వెల్తున్న ఇసుక లారీలు మాత్రం కెనాల్ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగిస్తుండడం విడ్డూరంగా ఉంది. ఇసుక రవాణా చేసే లారీలు కెనాల్ దారి మీదుగా వెల్తుండడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తరుచూ లారీలు ఇలాగే రాకపోకలు సాగించినట్టయితే భవిష్యత్తులో ఎస్సారెస్పీ కాలువ ఉనికికే ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయి. గతంలో స్థానికులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా 24 ఫీట్ల వెడల్పుతో కెనాల్ రోడ్డు ఉందని దీని మీదుగా భారీ వాహనాలు నడపరాదని స్పష్టం చేశారు. ఇరిగేష్ విభాగం కూడా ఈ కెనాల్ మీదుగా లారీలు నడిపించేందుకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని కూడా ఇంజనీర్లు తెలిపారు. అయినప్పటికీ మల్లారెడ్డిపల్లి ఇసుక రీచు నుండి లారీలు రాకపోకలు సాగిస్తుండడం గమనార్హం.
అడ్డుకోని అధికారులు…
కరీంనగర్ జిల్లాలో నీటిపారుదల శాఖ ఆస్తుల విషయంలో కట్టడి చేసే పరిస్థితి లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి ఇసుక రీచు నిర్వాహాకులు ఏకంగా కెనాల్ రోడ్డును వినియోగించుకుంటున్నా పట్టించుకోకపోవడం విస్మయం కల్గిస్తోంది. గతంలో కరీంనగర్ సమీపంలోని నగునూరు వద్ద అక్షర టౌన్ షిప్ వెంచర్ స్టార్ట్ చేశారు. అసలు రోడ్డు కూడా లేని ఈ వెంచర్ నిర్వాహాకులు ఏకంగా ఎస్సారెస్పీ కెనాల్ రోడ్డునే మెయిన్ రోడ్డుగా చూపించి SUDA అనుమతులు పొందారు. అంతేకాకుండా కెనాల్ రోడ్డుపై తారు రోడ్డు కూడా వేయడంతో పాటు వెంచర్ భూమి లెవలింగ్ చేస్తున్న క్రమంలో రెండు చోట్ల ఛానెల్స్ కూడా ధ్వంసం చేశారు. ఈ విషయంపై ఆయాకట్టు రైతులు ఆందోళన చెంది ఫిర్యాదు చేసిన తరువాత కానీ ఇరిగేషన్ అధికారుల నుండి స్పందన లేకుండా పోయింది. ఈ మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులకు మౌఖిక ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు తప్ప బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు కూడా చేయలేదు. ఆ తరువాత రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా ఈ వెంచర్ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. అంతేకాకుండా కరీంనగర్ శివార్లలోని లోయర్ మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లో కూడా ఇరిగేషన్ భూముల క్రయవిక్రయాలు జరిగినా పట్టించుకోలేన్న ఆరోపణలు ఉన్నాయి. మల్లారెడ్డిపల్లి ఇసుక రీచు నిర్వాహాకుల విషయంలో కూడా నీటిపారుదల శాఖ అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుండడం విచిత్రం. ఇరిగేషన్ ఆస్తులను కాపాడేందుకు చొరవ తీసుకోవల్సిన అధికారయంత్రాంగం పట్టించుకోని వైఖరి అవలంభించడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇసుక లారీల వల్ల కాలువ ధ్వంసం అయినట్టయితే ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని స్థానిక రైతులు అడుగుతున్నారు.