Crime: రక్షణ విభాగాల్లో ఉద్యోగాల కోసం తప్పుడు సర్టిఫికెట్లు..!

రాకెట్ ఛేదించిన పోలీసులు…

ముగ్గురి అరెస్ట్: ఏఎస్పీ కాజల్ సింగ్

దిశ దశ, ఆదిలాబాద్:

రక్షణ విభాగాల్లో ఉద్యోగాలు పొందేందుకు నకిలీ నివాస ధృవీకరణ పత్రాలు పొందిన వారిపై కొరడా ఝులిపించారు ఉట్నూరు పోలీసులు. తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందిన వారి గురించి ఆరా తీసిన పోలీసులు 12 మందిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

UP TO TG…

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెదిన 9 మంది తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన వారిగా నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి, నివాస ధృవీకరణ పత్రాలు పొంది రక్షణ రంగ విభాగాల్లో ఉద్యోగాలు సంపాదించారు. మొదట యూపీకి చెందిన సహాని సూరజ్ అనే వ్యక్తి ఇస్లాంనగర్ వాసిగా నకిలీ ఆధారాలు క్రియేట్ చేసి నివాస ధృవీకరణ పత్రం పొంది సీఐఎస్ఎఫ్ విభాగంలో ఉద్యోగం పొందాడు. అయితే పోలీసులు సహానీ సూరజ్ కు సంబంధించిన వివరాలు సేకరించినప్పుడు ఇస్లాంపూర్ నివాసి కాదని ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఆయన తప్పుడు డాక్యూమెంట్లు క్రియేట్ చేసుకుని సీఐఎస్ఎఫ్ విభాగంలో ఉద్యోగం సంపాదించినట్టుగా గుర్తించారు. ఆయన ఇచ్చిన ఇంటి నంబర్ 48-2-2 ఇస్లాంపూర్ గ్రామంలో లేదని గుర్తించిన పోలీసులు అనుమానించి వివిధ కోణాల్లో ఆరా తీశారు. దీంతో సహన్ సూరజ్ తో పాటు మరో ఎనిమిది మంది కూడా ఇస్లాంపూర్ వాసులుగా తప్పుడు నివాస ధృవీకరణ పత్రాలు పొందినట్టుగా గుర్తించారు. దీపక్ తివారీ అనే వ్యక్తి రూ. 4 వేలు ఇచ్చి ఇస్లాంపూర్ వాసిగా ఆధార్ కార్డును పొందిన తరువాత నివాస ధృవీకరణ పత్రం కోసం పంచాయితీ కార్యదర్శిని సంప్రదించారు. అయితే స్థానికేతరుడయినందును లోకల్ క్యాండిడెట్ గా సర్టిఫై చేయనని పంచాయితీ కార్యదర్శి నిరాకరించారు. ఆ తరువాత ఇస్లాంపూర్ మాజీ సర్పంచ్ భర్త షేక్ ఫరీద్ తో పాటు షేక్ ఖలీంల ద్వారా ఉత్తరప్రదేశ్ కు చెందిన వారంతా కూడా ఇస్లాంపూర్ గ్రామస్ధులేనని పంచాయితీ కార్యదర్శి ద్వారా సంతకం చేయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. షేక్ ఫరీద్, షేక్ ఖలీంలు పంచాయితీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి సర్టిఫై చేసిన తరువాత మీ సేవా కేంద్రం ద్వారా నివాస ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుని సర్టిఫికెట్లు పొందారు. దీపక్ తివారీ మొదట ఉద్యోగం పొందిన తరువాత మిగతా వారంతా కూడా ఇదే పద్దతిలో ఇస్లాంపూర్ వాసులుగా రెసిడెన్స్ సర్టిపికెట్లు పొందినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.

రూ. 9 లక్షల డీల్…

స్థానికేతరులైన వీరికి ఇస్లాంపూర్ వాసులుగా సర్టిఫై చేయించి నివాస ధృవీకరణ పత్రాలు ఇప్పించేందుకు ఒక్కొక్కరి వద్ద రూ. లక్ష చొప్పున మొత్తం 9 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో రూ. 3 లక్షలు అడ్వాన్సుగా ఇవ్వగా మిగతా రూ. 6 లక్షలు యూపీకి చెందిన హుర్లిక్ వద్ద ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయం తెలుసుకున్న ఇస్లాంపూర్ నివాసి జాదవ్ గజానంద్ వారివద్ద ఉన్న డబ్బు కాజేసేందుకు ప్రయత్నించగా షేక్ ఫరీద్, షేక్ ఖలీంలు అతనికి రూ. 20 వేలు ముట్టజెప్పారు. ఈ వ్యవహారంలో మొత్తం 12 మందిపై క్రిమినల్ కేసు నమోదు కాగా ఇచ్చోడ మండలం ఇస్లాంపూర్ కు చెందిన షేక్ ఫరీద్ (34), షేక్ ఖలీం (59), జాదవ్ గణేష్ (35)లను అరెస్ట్ చేశారు. క్రైం నంబర్ 131/2025 U/Sec 318(4), 335, 338, 340(2), 308(2) & 238 BNSలలో ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. నకిలీ డాక్యూమెంట్లు క్రియేట్ చేసి తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందిన వారు ఇంకా ఉద్యోగాలు చేస్తున్నారని, వారిపై విచారణ కొనసాగుతోందని ఏఎస్పీ కాజల్ సింగ్ తెలిపారు.

తెలంగాణ కోటాలో…

అయితే దేశ రక్షణ విభాగాల్లో ఉద్యోగాలు చేసేందుకు ఉత్తరాది రాష్ట్రాల నుండి ఎక్కువ మంది పోటీ పడుతుంటారని, దీంతో తమకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవని గమనించే వీరంతా తెలంగాణ కోటాలో ఉద్యోగాలు పొందాలని ప్లాన్ చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దక్షిణాది రాష్ట్రాల నుండి రక్షణ విభాగాల్లో పని చేసేందుకు తక్కువగా పోటీ ఉంటుందని తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ వాసులు తెలంగాణను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. కాంపిటీషన్ తక్కువగా ఉండడంతో తమకు సులువుగా ఉద్యోగాలు వస్తాయని భావించిన వారంత కూడా ఇప్పుడు తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందిన కేసులో అరెస్ట్ కాక తప్పేలా లేదని సమాచారం. ఈ మీడియా సమావేశంలో సీఐ బండారి రాజు, ఎస్ఐ వి విష్ణు వర్ధన్ లు కూడా పాల్గొన్నారు.