దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టుల ఇలాకాలో తొలిసారి జాతీయ జెండా రెపరెపలాడింది. ఇంతకాలం బస్తర్ అటవీ ప్రాంతంలోని నక్సల్ నేతల గ్రామాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన బలగాలు ఈ సారి కర్రెగుట్టలపై మువ్వన్నెల జెండాను ఎగురవేశాయి. దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలోని తడపాల క్యాంపులో CRPF 196, కోబ్రా 204వ బెటాలియన్ బలగాలు సోమవారం జాతీయ జెండా ఎగురవేశాయి.
మందుపాతర…
కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్న బలగాలు ఇటు తెలంగాణలోని పామ్నూరు, అటు చత్తీస్ గడ్ లోని తడపాల వద్ద బేస్ క్యాంపులు ఏర్పాటు చేశాయి. అయితే కర్రెగుట్టలపై ఆదివారం మందుపాతర పేలడంతో 11 మంది జవాన్లు గాయపడినప్పటికీ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపేందుకే బలగాలు సాహసించాయి. వరసగా మందుపాతరలు పేలడంతో గాయపడిన 11 మంది జవాన్లను రాయ్ పూర్ ఆసుపత్రికి హెలిక్యాప్టర్ లో తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మావోయిస్టుల కదలికలతో ఎర్ర జెండాలు కనిపించిన కర్రెగుట్టలపై తొలిసారిగా త్రివర్ణ పతాకం ఎగురవేసి జవాన్లు సంబరాలు చేసుకున్నారు. గత సంవత్సరం ఏప్రిల్ నుండి కర్రెగుట్టలను స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యంతో పారా మిలటరీ బలగాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలోని ములుగు జిల్లా పామ్నూరు వరకు తాత్కాలిక రోడ్డు వేయించిన బలగాలు గుట్టలపై క్యాంపును ప్రారంభించిన సంగతి తెలిసిందే.

