దర్జాగా పీడీఎస్ రైస్ అక్రమ రవాణా…

దిశ దశ, హైదరాబాద్:

ఆహార భద్రతా కార్డులు ఉన్న వారికి ఉచితంగా అందిస్తున్నబియ్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించడంలో విఫలం అవుతున్నారా..? సన్న బియ్యం పంపిణీ చేస్తున్నా కూడా అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగడం వెనక కారణం ఏంటీ..? సులువుగా ఆదాయం వస్తుండడంతో అక్రమ దందాగాళ్లు రేషన్ బియ్యంతో వ్యాపారం చేయడం మానుకోలేకపోతున్నారు.

సరిహద్దులు…

కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మీదుగా మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాలకు దర్జాగా రేషన్ బియ్యం తరలిపోతున్నాయి. లబ్దిదారులకు సన్న బియ్యం అందించడం వల్ల వినియోగించుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావించినప్పటికీ అక్రమ వ్యాపారం మాత్రం నిలువరించలేకపోతున్నారు. వాస్తవంగా మహారాష్ట్రలో దొడ్డు బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గతంలో రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున వ్యాపారం సాగింది. లబ్దిదారులకు కిలోకు రూ. 18 వరకు చెల్లించిన వ్యాపారులు ఏజెంట్లకు రూ. 2 వరకు కమిషన్ ఇస్తూ టన్నుల కొద్ది బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించుకపోయారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తుండడంతో సబ్సీడీ బియ్యం అక్రమ రవాణా ఆగిపోయిందని భావించారంతా. కానీ సన్న బియ్యాన్ని కూడా స్మగ్లింగ్ చేస్తూ ఆదాయం గడించేందుకు వ్యాపారులు రంగంలోకి దిగారు. సన్నబియ్యం సరఫరా చేయడం మొదలు పెట్టిన తొలినాళ్లలో అక్రమ రవాణా అంతగా కాలేదు. కానీ గత మూడు నాలుగు నెలల నుండి మాత్రం సన్న బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు కూడా వ్యాపారులు తమ నెట్ వర్క్ ను పునరుద్దరించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

భారీ నెట్ వర్క్…

గ్రామాల నుండి కలెక్షన్ చేస్తున్న సన్న బియ్యాన్ని తమ ఏజెంట్లు కలెక్ట్ చేసుకుని మహారాష్ట్రలోని సిరొంచకు తరలించినట్టయితే కిలోకు రూ. 28 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రూ. 24కు గ్రామాల్లో కొంటున్న ఈ సన్నబియ్యాన్ని రూ. 24 చొప్పున కొనుగోలు చేసి రూ. 40 నుండి 50ల వరకు విక్రయిస్తున్నట్టుగా సమాచారం. మహారాష్ట్రలో సన్న బియ్యానికి డిమాండ్ అంతగా లేదన్న సాకు చూపిస్తూ వ్యాపారాన్ని చేయడం లేదని నమ్మించే ప్రయత్నం చేసిన రేషన్ బియ్యం వ్యాపారులు ఇటీవల కాలంలో సన్న బియ్యం కొనుగోలుపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తోంది. కమిషన్ ఏజెంట్ల ద్వారా తమ డెన్ లకు తరలించిన బియ్యాన్ని మాహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

అక్కడ కూడా…

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా కేంద్రంగానే కాకుండా ఆసిపాభాద్ జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్ కేంద్రంగా కూడా భారీగా వ్యాపారం సాగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతానికి చెందిన ఓ బడా వ్యాపారి రేషన్ బియ్యం సేకరించేందుకు ప్రత్యేకంగా గోదాములను కూడా ఏర్పాటు చేసుకున్నారని ఇక్కడకు చేరుకున్న బియ్యం సంచులను మార్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా సమాచారం. రేషన్ బియ్యం వ్యాపారంలో ఆరితేరిన సదరు వ్యాపారి తనకున్న ఇమేజ్ ద్వారా దర్జాగా బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

డ్రైవర్లను మార్చి…

తెలంగాణలోని పలు జిల్లాల నుండి తరలిస్తున్న బియ్యాన్ని వాహనాల్లో తరలిస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు డ్రైవర్లను మారుస్తూ గమ్యస్థానాలకు చేరవేసేందుకు భారీ స్కెచ్ వేసినట్టుగా సమాచారం. ఒకే డ్రైవర్ వాహనం నడిపించినట్టయితే అధికారులు మొటైల్ సిగ్నల్ ద్వారా లారీల ఉనికిని ట్రేస్ చేసే అవకాశం ఉందని గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా సమాచారం. సన్నబియ్యం కూడా స్మగ్లింగ్ చేస్తున్న విషయంపై సివిల్ సప్లై విజిలెన్స్ విభాగం కఠినంగా వ్యవహరించినట్టయితే భారీ నెట్ వర్క్ గుట్టు రట్టయ్యే అవకాశాలు ఉన్నాయి.