కొండగట్టు జెఎన్టీయూలో దారుణం…
దిశ దశ, జగిత్యాల:
కొండగట్టు జెఎన్టీయూ కాలేజీలో విద్యార్థులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీనియర్లు జూనియర్లను వేధించిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. కొత్తగా చేరిన విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాల్సిన సీనియర్లు వేదింపులకు గురి చేసేందుకు శృతి మించిపోయేలా చేశారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చర్చకు దారి తీస్తున్నాయి. కొండగట్టు జెఎన్టీయూలో వరసగా జరుగుతున్న ఘటనలు ఆందోళనకు దారి తీస్తున్నాయి. అయితే కొండగట్టు జెఎన్టీయూలో జరిగిన ర్యాగింగ్ పై పోలీసులకు కానీ, కాలేజీ ఉన్నతాధికారులకు కానీ ఎలాంటి ఫిర్యాదులు రానట్టుగా తెలుస్తోంది. ర్యాగింగ్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో కాలేజీలో క్రమ శిక్షణ లేకుండా పోయిందన్నవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు రోజుల క్రితం జూనియర్ విద్యార్థులకు ర్యాగింగ్ చేసిన సీనియర్లు మగ వారికిద్దిరికి వివాహం తంతు జరిపించినట్టుగా వీడియోల్లో స్పష్టం అవుతోంది. మాంగళ్య ధారణ చేయించడం అనంతరం అరుంధతి నక్షత్రం చూపించడంతో పాటు ఇతరాత్ర అన్ని రకాల ఫార్మాలిటీస్ చేయించినట్టుగా వీడియోల్లో స్పష్టం అవుతోంది. కొంతమంది విద్యార్థులను చున్నీలతో ఓణీ కట్టుకుని డ్యాన్సులు చేయించడంతో పాటు పలు రకాలగా జూనియర్లను వేధింపులకు గురి చేశారు. జూనియర్లపై ర్యాగింగ్ కు పాల్పడినతీరుపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రక్షాలన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నాయి.
చర్యలు…
ఇటీవల స్టూడెంట్స్ పట్ల సెక్యూరిటీ చీఫ్ దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు క్యాంపస్ లో నిరసన వ్యక్తం చేయడంతో బాధ్యునిపై చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అడ్మినిస్ట్రేషన్ విఫలం కావడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కొండగట్టు జెఎన్టీయూలో పరిస్థితులను గాడిలో పెట్టేందుకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది.

