పుష్కర ఘాట్ లో జైళ్ల శాఖ స్టాల్… ప్రారంభించిన డీజీ సౌమ్య మిశ్రా…

దిశ దశ, కాళేశ్వరం:

పుష్కర స్నానంతో పునీతులు అవుతున్న భక్తులకు జైళ్ల శాఖ సరికొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. జైలు జీవితం గడుపుతున్న ఖైదీల చేతుల్లో తయారైన వివిధ రకాల వస్త్రాలు, అగర్ బత్తులను ఈ స్టాల్ లో విక్రయించనున్నారు. శుక్రవారం జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఈ మేరకు ఈ స్టాల్ ను ప్రారంభించగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జైళ్ల శాఖ వరంగల్ డీఐజీ ఎం సంపత్, వరంగల్ సెంట్రల్ జైల్ సూపరింటిండెంట్ టి కళాసాగర్ లు పాల్గొన్నారు. ఈ విక్రయశాలలో పర్యావరణ రహిత ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తున్నామని జైల్స్ డీజీ తెలిపారు.. ‘‘మై నేషన్’’ ‘‘ వేస్ట్ టు వెల్త్’’ కార్యక్రమాల ద్వారా సంస్కరణ, పర్యావరణ, నైపుణ్యాభివృద్దిని పెంపోందించేందుకు తెలంగాణ జైళ్ళ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుంటోందని సౌమ్య మిశ్రా వివరించారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలతో జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలలో కూడా సానుకూల ధృక్ఫథం తీసుకరావడంలో సఫలం అవుతున్నామని వెల్లడించారు. ఈ స్టాల్ లో విక్రయించే అగర్ బత్తులకు ఓ ప్రత్యేకత ఉందని, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజించిన పూలను సేకరించి వేస్ట్ టు వెల్త్ అనే కార్యక్రమంలో భాగంగా తయారు చేయిస్తున్నామని తెలిపారు. చేతితో తయారు చేసిన సబ్బులు, నేత వస్త్రాలు, దుర్రీలు వంటి ఉత్పత్తులపై ఖైదీలకు అందిస్తున్న స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా తయారు చేయిస్తున్నామని సౌమ్య మిశ్రా వివరించారు.

అడ్మిన్ హోదాలో నాడు… 

కరీంనగర్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా పని చేస్తున్నప్పుడు సౌమ్య మిశ్రా కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ముద్రపడ్డ కాళేశ్వరానికి ఐపీఎస్ అధికారులు ఆ సమయంలో వచ్చే పరిస్థితులు లేకుండా ఉండేవి. పీపుల్స్ వార్ నక్సల్స్ దాడులు చేస్తూ కంచుకోటగా మార్చుకున్న మహదేవపూర్ అటవీ ప్రాంతంలో క్షణ క్షణం భయం నీడనే బ్రతకాల్సిన పరిస్థితులు టార్గెట్లకు ఎదురయ్యేవి. అందునా పోలీసు అధికారులయితే స్వీయ రక్షణ చర్యలు తీసుకున్నా క్షేమంగా గమ్యం చేరుతామా లేదా అన్న మీమాంసలోనే ప్రయాణాలు సాగేవి. అటువంటి భయానక పరిస్థితులు నెలకొన్న సమయంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అడిషనల్ ఎస్పీ హోదాలో సౌమ్య మిశ్రా కాళేశ్వరాన్ని సందర్శించారు. గోదావరి నది తీరంలో సంచరించిన అనంతరం శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు సౌమ్య మిశ్రా. 1998లో కాళేశ్వరాన్ని సందర్శించిన సౌమ్య మిశ్రా నేడు జైళ్ల శాఖ డీజీ హోదాలో కాళేశ్వరం రావడం విశేషం.

You cannot copy content of this page