ఖైరిగూడ గ్రామస్థుల ప్రతిజ్ఞ
దిశ దశ, మంచిర్యాల:
హంగూ… అర్భాటాల పేరిట వృథా ఖర్చులతో తడిసిమోపెడవుతున్న పెండ్లి ఖర్చులతో సామాన్యుడు విసిగి వేసారిపోతున్నాడు. సాంప్రాదాయానికి భిన్నంగా కొనసాగిస్తున్న ఆనవాయితీ వారి పాలిట శాపంగా మారిపోయాయి. సోషల్ స్టేటస్ పేరిట ప్రదర్శిస్తున్న దర్పం వల్ల ఆర్థిక భారం పడడమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఓ గ్రామస్థులు చేసిన ప్రతిజ్ఞ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వాటికి నో…
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఖైరిగూడ గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో ఎవరి ఇంట పెళ్లయినా కూడా సాదాసీదాగా జరుపుకునేందుకు చొరవ తీసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెండ్లి తంతులో భాగంగా మారిపోయిన ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించకూడదని, హల్దీ ఫంక్షన్ చేయకూడదని, డీజే సౌండ్స్ సిస్టమ్ వినియోగించకూడదని నిర్ణయించారు. వాటిని గ్రామంలో నిషేధిస్తున్నామని ప్రకటించారు. అలాగే శ్రీరామ నవమి తరువాత గ్రామంలో మద్యం, గుడుంబాను అరికట్టేందుకు పోలీసుల సహకారంతో గ్రామ సభ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు.
జరిమానా…
ఖైరిగూడ గ్రామానికి చెందిన వారంతా స్థానిక సేవాలాల్ మందిర్ వద్ద సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ నిర్ణయానికి భిన్నంగా నడుచుకున్న వారికి రూ. 50 వేల జరిమానా విధించనున్నారు. ఈ మేరకు గ్రామస్థులంతా కలిసి ప్రతిజ్ఞ చేయడం విశేషం.

