క్రమ శిక్షణతో ఉంటే క్లీన్ చిట్… తప్పు చేస్తే తాట తీస్తాం…

దిశ దశ, కరీంనగర్:

రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లకు పోలీసులు స్పెషల్ కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. కొంతకాలంగా వీరి వైపు అంతగా దృష్టి పెట్టని పోలీసులు  వారిని గాడిలో పెట్టే పనిలో నిమగ్నం అయ్యారు. క్షణికావేశంలో చేసే తప్పుల వల్ల జీవితాంతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎధుర్కొంటున్నారని వాటి నుండి విముక్తి కావాలంటే క్రమశిక్షణతో మెదలాలని తేల్చి చెప్తున్నారు. శుక్రవారం కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లకు స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సత్ప్రవర్తనతో నడుచుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పోలీసు విభాగంలో ఉన్న రికార్డుల్లోంచి కూడా పేర్లు తొలగిస్తామని ప్రకటించారు. పద్దతిని మార్చుకోకుండా నేర ప్రవృత్తితోనే సహజీవనం చేస్తామంటే మాత్రం చట్టాలకు పని చెప్పి కఠినంగా వ్యవహరిస్తామని సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. మీపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల కోసమైనా నేరం చేసే సంస్కృతిని వదిలేసి ప్రత్యామ్నాయంగా జీవనోపాధి మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. రౌడీ, హిస్టరీ షీటర్లకు సమాజంలో గౌరవ మర్యాదాలు ఏ మాత్రం ఉండవని, హీనాతి హీనంగా చూస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరచరిత ఉన్న వారిలో కూడా మానసిక పరివర్తన రావాలని, లేనట్టయితే ఈ ప్రభావం మీకు పుట్టిన బిడ్డలపై పడుతుందని దీనివల్ల వారి ఉజ్వల భవిష్యత్తును కూడా నాశనం చేసినవారు అవుతారన్నారు. కుటుంబ సభ్యులతో పాటు సంతానం పట్ల కూడా సొసైటీ వివక్ష చూపుతుందని దీనివల్ల ఆయా కుటుంబాల్లోని భావి తరాలు కూడా దారి తప్పే ప్రమాదం ఉంటుందని కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి వివరించారు. ఈ కౌన్సిలింగ్ లో ఎస్ఐ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

You cannot copy content of this page