కరీంనగర్ పోలీసుల వినూత్న కార్యక్రమం
దిశ దశ, ఎల్ఎండి:
రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వాహన చోధకులను నిలువరించి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, హెల్మెట్ ధరించాలని సూచించడం వంటి చర్యలకు పరిమితం అవుతుంటారు అధికారులు. అన్ని వర్గాల్లో అవగాహన కల్పిస్తూ ప్రాణం కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తుంటారు. ఇవే అంశాలపై అన్ని వర్గాల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వారిచే ప్రతిజ్ఞ చేయిస్తే బావుంటుందని అనుకున్నారు ఎల్ఎండీ సర్కిల్ పోలీసులు. వాహన చోధకులయినా, డ్రైవింగ్ రాని వారయినా ప్రతి ఒక్కరిలో రోడ్డు ప్రమాదాలపై చైతన్యం నింపినట్టియతే సానుకూల ఫలితాలను సాధించవచ్చని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎల్ఎండి సర్కిల్ పరిధిలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గురువారం కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ప్రతిజ్ఞ చేయించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో చేపట్టిన ఈ కార్యక్రమంలో నవతరం యువతచే ప్రతిజ్ఞ చేయించారు. ఎల్ఎండి సర్కిల్ లోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు పోలీసు అధికారులు.
ప్రాణాలు ముఖ్యం…
కరీంనగర్, హైదరాబాద్ రాజీవ్ రహదారికి ఇరువైపులా విస్తరించి ఉన్న ఎల్ఎండి సర్కిల్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు సర్వ సాధారణంగా మారిపోయాయి. గమ్యం చేరాలన్న ఆతృతతో వేగంగా నడపుతూ, ఓవర్ టేక్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉన్నామన్న ధీమాతో దూకుడు ప్రదర్శిస్తూ, ఆదుర్దా పడుతూ వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు సాధారణంగా మారిపోయాయి. కార్లలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదానికి గురైతే ప్రాణాలతో బయటపడాలన్న ఉద్దేశ్యంతో బెలూన్లను అమర్చే విధానం కూడా మొదలైంది. అయితే సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు యాక్సిడెంట్ అయితే బెలూన్లు ఓపెన్ అవుతుండడంతో ప్రయాణీకులు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్లే ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. గమ్యం చేరేందుకు స్పీడ్ మెయింటెన్ చేయడం కంటే అనుకున్న సమాయానికంటే ముందుగా బయలుదేరి క్షేమంగా ఇంటికి చేరడం ముఖ్యమన్న భావన కల్పించాలని భావిస్తున్నారు.
ప్రజలందరికీ…
అయితే కేవలం వాహనాలు నడిపే వారికే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో సరిపెట్టకుండా అన్ని వర్గాల్లో అవగాహన కల్పించాలని సంకల్పించారు. దీనివల్ల వాహనాలు నడిపే వారు స్వీయ రక్షణ చర్యలు తీసుకోనట్టయితే మిగతా వారు సలహాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని, వాహన చోధకులకు తమ కుటుంబ సభ్యులు చెప్పడంతో అయినా కొంతలో కొంత అయినా మార్పు వస్తుందని ఆశిస్తున్నారు.
సైరన్…
అయితే ప్రతిన చేయించే కార్యక్రమం కేవలం యువతకే కాకుండా ఎల్ఎండి సర్కిల్ లోని ప్రతి గ్రామంలో చేపట్టాలని నిర్ణయించారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు తామీ నిర్ణయం తీసుకున్నామని ఎల్ఎండి సీఐ గడ్డం సదన్ కుమార్ తెలిపారు. గ్రామాల్లో సైరన్ వినిపించగానే ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసేవిధంగా చొరవ తీసుకుంటున్నామని తెలిపారు. మైకుల ద్వారా చేప్పే ప్రతిజ్ఞను ప్రతి ఒక్కరు పాటించే విధంగా గ్రామాల్లో ప్రచారం చేయిస్తున్నారు.
డిఫెన్సివ్ డ్రైవింగ్: సీపీ గౌష్ ఆలం
డీజీపీ ప్రారంభించిన ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్భందీగా నిర్వహిస్తున్నామని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. వాహనదారులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ర్యాష్ బిహేవింగ్ ప్రదర్శించకుండా ఉండాలన్న సంకల్పంతో ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ పద్ధతిపై అవగాహన కల్పించేందుకు చొరవ తీసుకుంటున్నామన్నారు. దీనివల్ల ప్రమాదాల నుండి వాహనచోధకులు తమను తాము రక్షించుకునే అవకాశం ఉంటుంద్నారు. మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపించడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి కారణంగానే తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కొన్ని ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్న వారు కొందరైతే, మరి కొందరు క్షతగాత్రులుగా మంచానికే పరిమితం అవుతున్న తీరు ఆందోళన కల్గిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టాలన్న ఆలోచనతోనే రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించేందుకు తమవంతు ప్రయత్నాలకు శ్రీకారం చుట్టామని సీపీ గౌష్ ఆలం వివరించారు. ప్రాణం కోల్పోయినట్టయితే కుటుంబాలు రోడ్డున పడతాయన్న విషయాన్ని ప్రతి వాహన చోధకుడు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునిల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు విజయకుమార్, రమేష్ సీఐ జి సదన్ కుమార్, శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

