చోరీలకు పాల్పడిన ఘనుడు…
దిశ దశ, కరీంనగర్:
ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ లక్షలాది రూపాయాలో పోగొట్టుకున్న ఓ వ్యక్తి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కాలంటే చోరీలు చేయడమే మేలని భావించాడు. ఒకే ఇంట్లో రెండు సార్లు దొంగతనానికి పాల్పడిన ప్రుబుద్దుడిని కరీంనగర్ రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి రెవెన్యూ కాలనీలోని ఓ ఇంట్లో ఈ ఏఢాది ఫిబ్రవరి, జూన్ నెలల్లో వరసగా రెండు సార్లు దొంగతనం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని పట్టుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించి సక్సెస్ అయ్యారు. కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, సీసీఎస్ సీఐ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో కేసును ఛేదించారు.
గేమ్స్ ఆడి…
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి రెవెన్యూ కాలనీకి చెందిన మహమ్మద్ ముస్తాక్ గత రెండేళ్లుగా ఆన్ లైన్ గేమ్స్ ఆడుతుండేవాడు. ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్, డాష్ రమ్మీ యాప్స్ తన స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ పెద్ద మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్న నిందితుడు తన స్నేహితులతో పాటు ఇతరుల వద్ద అప్పులు చేశాడు. లక్షలాది రూపాయలు గేమింగ్ లో కోల్పోయిన ముస్తాక్ అప్పులు చెల్లించేందుకు దొంగగా అవతారం ఎత్తాడు. గత ఫిబ్రవరి, జూన్ నెలలో రెవెన్యూ కాలనీలోని ఓ ఇంట్లోకి కిటీకి ఊచలు తొలగించి చొరబడిన ముస్తాక్ బంగారం, నగదు ఎత్తుకెళ్లాడు. జూబ్లీ నగర్ దర్గా సమీపంలోని ఓ ఇంట్లో టీవీ చోరీ చేసిన నిందితుడు బంగారన్ని అమ్మేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కరీంనగర్ ప్రాంతానికి చెందిన వారు బంగారాన్ని కొనేందుకు సాహసించకపోవడంతో కోదాడలో విక్రయించాలని భావించినప్పటికీ అమ్మలేకపోయాడు. వాటిని కరీంనగర్, మంచిర్యాల, వరంగల్ కు తీసుకెళ్లి అమ్మాలని భావించిన అతన్ని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుండి 91 గ్రాముల బంగారం, రూ. 5 వేల నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ముస్తాక్ ను కోర్టులో హాజరు పరిచామని ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ముస్తాక్ ను పట్టుకోవడంలో ప్రత్యేక చొరవ చూపిన సీఐలు నిరంజన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ఎస్సై లక్ష్మారెడ్డి, హెడ్ కానిస్టేబుల్లు హసనోద్దీన్, శ్రీరాములు, పీసీలు ఎన్ శేకఱ్, ఎండీ ఖలిఫా, సల్మాన్ లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఏసీపీ విజయ్ కుమార్ లు అభినందించారు.

