Pearl Farming: గోదావరి తీరంలో ముత్యాల పంట…

వైవిద్యమైన సాగు చేస్తున్న ఆదర్శ రైతు…

దిశ దశ, జాతీయం:

ఆ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో పుట్టిన ఆ రైతు వినూత్న సాగును ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన ఆ పంటను వేసేందుకు సాహసించాడు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ కోసం వెళ్లిన ఆ రైతు ఏక కాలంలో రెండు అంశాల్లో సుశిక్షునిగా మారి ముత్యాల సాగుకు శ్రీకారం చుట్టాడు. ఆ రాష్ట్రానికి సరిహధ్దున ఉన్న ఓ తాలుకా కేంద్రంలో పుట్టిన ఆ రైతు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టి తనదైన స్టైల్లో ముత్యాల పంట వేస్తున్నాడు.

గోదావరి తీరంలో…

గోదవరి తీరంలో పత్తి, మిర్చి, వరి సాగే కాదు… ముత్యాల సాగు చేసే విధానం మొదలైంది. బీడు భూములను సస్యశామలం చేసే గోదావరమ్మ ఒడిలో ఇప్పటి వరకు సాంప్రాదాయ పంటలకే పరిమితమైన రైతాంగం ఇప్పుడు అరుదైన ముత్యాలను పండిచేందుకు నడుం బిగించడం నూతన అధ్యాయాన్ని మొదలు పెట్టినట్టయింది.

సిరొంచ…

మహారాష్ట్రలోని సిరొంచ తాలుకా గడ్చిరోలి జిల్లా కేంద్రానికి 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న మారుమూల ప్రాంతం. తెలంగాణ రాష్టంలోని ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన కాళేశ్వరానికి సమీపంలోనే ఉన్న ఈ గ్రామానికి చెందిన రైతు రవి బొంగోని వార్ మూడేళ్లుగా ముత్యాలు సాగు చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం నీటి వనరుల ద్వారా ఆదాయ మార్గాలు కల్పించేందుకు సిఫా (CIFA) ద్వారా శిక్షణ ఇస్తోంది. సిరొంచ తాలుకా కేంద్రానికి చెందిన రవి బొంగోని వార్ భువనేశ్వర్ లోని సిఫా ట్రైనింగ్ కేంద్రంలో చేపల పెంపకంపై శిక్షణ పొందేందుకు వెళ్లాడు. అక్కడే ముత్యాల సాగుకుపై కూడా ట్రైనింగ్ ఇస్తున్న విషయాన్ని తెలుసుకున్న రవి ముత్యాల సాగుపై కూడా శిక్షణ పొందేందుకు ఉత్సుకత చూపాడు. ఆయన చూపిన ప్రత్యేక శ్రద్దే ఇప్పుడు కలిసి వచ్చిందని చెప్పాలి.

20 గుంటల్లో…

సిరొంచ శివార్లలోని కేవలం 20 గుంటల్లో ముత్యాల సాగు చేస్తున్న రవి ముందుగా తాను వేసే పంట దిగుబడి ఎలా ఉంటుంది, వాటిని విక్రయించడం ఎలా అన్న విషయాలపై సమగ్ర అవగాహన చేసుకున్నాడు. ఆయన సెర్చ్ చేస్తున్న క్రమంలో ముత్యాల సాగు చేసే రైతుల నుండి కొనుగోలు చేసేందుకు ముందుగా అగ్రిమెంట్ చేసుకుంటున్నాయని, ఒప్పందం ప్రకారం పంట దిగుబడి వచ్చిన తరువాత కొనుగోలు చేసుకుంటున్నాయని తెలుసుకున్నాడు. ఈ మేరకు రవి సదరు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ముత్యాల సాగు చేయడం ఆరంభించాడు. ఏడాది పాటు సాగునున్న ఈ పంట కోసం మొదటి సంవత్సరం రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టగా రూ. 10 లక్షలు సంపాదించుకున్నాడు. ఏటేటా ముత్యాల సాగు కోసం పెట్టుబడి రెట్టింపు చేస్తే అంతే స్థాయిలో సంపాదిస్తున్నాడు రవి బొంగోని వార్. కంపెనీ ప్రతినిధులకు డబ్బు చెల్లించినట్టయితే ముత్యాల సాగుకు అవసరమైన అల్చిప్పలు, జాలీతో తదితరాలన్నింటిని సమకూర్చుతారు. తరుచూ కంపెనీ ప్రతినిధులు ముత్యాల సాగు తీరుపై సమీక్షించి రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందిస్తుంటారు. పంట చేతికి రాగానే వాటిని కొనుగోలు చేసుకుని డబ్బు రైతుకు ముట్టచెప్తారు.

అవి ఉండాల్సిందే…

అయితే ముత్యాలు సముద్రంలోని అల్చిప్పల్లో మాత్రమే తయారవుతుంటాయి. వీటిని సాగు చేసేందుకు ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఆసక్తి చూపుతుంటారు. కానీ మహారాష్ట్రలోని ఓ మారుముల ప్రాంతానికి చెందిన రైతు రవి బొ్ంగోని వార్ ముందుకు వచ్చి పంట సాగు చేస్తుండడం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్టయింది. అయితే సాగు ఎంచుకున్న భూమిలో 8 ఫీట్ల మేర నీరు ఎప్పుడూ నిలువ ఉండాల్సిందే. నీరు హెచ్చు తగ్గులను తెలుసుకునేందుకు 8 ఫీట్ల ఎత్తులో వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేశాడు. నిత్యం ట్యూబ్ సాయంతో ముత్యాల సాగు ఎలా సాగుతుందో కూడా చెక్ చేస్తూ ఉంటాడు. వీటికి ఫీడింగ్ కోసం కూడా చాలా తక్కువగానే వెచ్చించాల్సి ఉంటుంది కానీ… నిలువ ఉన్న నీటిలో చేపల పెంపకం కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది. సముద్రపు నీటిలో అల్చిప్పల్లో తయారయ్యే ముత్యాలు జలాల్లో సంచరించే చేపలు, ఇతరాత్ర జీవుల ఉనికిని గమనిస్తుంటాయని, ఇదే పద్దతిని సాగులోనూ అవలంభించాల్సి ఉంటుందని రైతు వివరించాడు. ఇందు కోసం నిలువ ఉన్న నీటిలో చేపలను విధిగా పెంచాల్సిందేనని, అయితే ముత్యల దిగుబడి వచ్చిన తరువాత నీటిలో ఎదిగిన చేపలను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నానని కూడా రవి వివరించాడు.