ఫోటోతో ప్రకటన విడుదల…
అభయ్ పేరిట లేఖ…
దిశ దశ, దండకారణ్యం:
దండకారణ్య అటవీ ప్రాంతంలో ప్రతికూలతను ఎదుర్కొంటున్న మావోయిస్టు పార్టీ ఆయుధాలను వదిలేసేందుకు సిద్దమైందా..? శాంతి చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చిందా..? కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి పేరిట విడుదల చేసిన ఓ లేఖ ఇప్పుడు సరికొత్త చర్చకు దారి తీస్తోంది. ఆగస్టు 15న విడుదల చేసినట్టుగా ఉన్న ఈ లేఖలో సాయుధ పోరాటాలన్ని తాత్కాలికంగా విరమించుకుందని, 2025 చివరి నుండి మావోయిస్టు పార్టీ శాంతి చర్చల కోసం తీవ్రంగా, నిజాయితీగా ప్రయత్నాలు చేస్తోందని, మే 10న మా పార్టీ కార్యదర్శి స్వయంగా కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నామన్నారు. ఆయుధాలను వదులుకుంటున్నామని, కాల్పుల విరమణ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచామని, సహచరులతో సంప్రదింపులు జరపడానికి నెల సమయం కోరిరప్పటికీ దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం అనుకూల వైఖరిని వ్యక్తం చేయలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి 2024 నుండి జరుగుతున్న సైనిక దాడులను తీవ్రతరం చేసిందని ఈ క్రమంలోనే మే 21న మాఢ్ లోని గుండెకోట్ సమీపంలో భీకర దాడిని ధైర్యంగా ప్రతి ఘటిస్తూ పార్టీ కార్యదర్శి బసవరాజ్ తో పాటు 28 మంది మావోయిస్టులు అమరులయ్యారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు చేస్తున్న అభ్యర్థనల దృష్ట్యా తాము ఆయుధాలను వదులుకోవాలని భావిస్తున్నామని అభయ్ పేరిట విడుదలైన ఆ లేఖలో వెల్లడించారు. సాయుధ పోరాటానికి తాత్కలిక విరమణ చేయాలని నిర్ణయించుకున్నామని, ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం నెల రోజుల సమయం ఇచ్చినట్టయితే తమ శ్రేణులతో సంప్రదింపులు జరుకుంటామని అభ్యర్థిస్తున్నట్టుగా ఆ లేఖలోని సారాంశం తేల్చి చెప్తోంది. ఇలా దాదాపు రెండు పేజీలలో హిందీలో వచ్చిన ఈ ప్రకటనలో పలు అంశాలను కూడా పేర్కొన్నారు.
ఫోటోతో…
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదల అయిన లేఖలో చర్చించాల్సిన అంశాలే కాకుండా ఆయన ఫోటో కూడా ముద్రించడం సంచలనంగా మారింది. విప్లవోద్యమ చరిత్రలో ఇంత వరకు ఏనాడు కూడా పార్టీ నేతల ఫోటోలతో కూడిన ప్రకటన మాత్రం విడుదల అయిన దాఖలాలు అయితే లేదు. అయితే తాజాగా విడుదల చేసిన ప్రకటనలో విప్లవకారుని ఫోటో ప్రచూరితం కావడం గమనార్హం.
సంప్రదింపులా..?
ఏడాది కాలంగా పలుమార్లు శాంతి చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని కాల్పుల విరమణ ఒప్పందానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలన్న ప్రతిపాదనలు మావోయిస్టు పార్టీ చేస్తూనే ఉంది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట కూడా చర్చలకు సుముఖంగా ఉన్నట్టుగా పేర్కొనడంతో పాటు శాంతి చర్చల కమిటీ కూడా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. శాంతి చర్చల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒఫ్పించాలని కోరుతు ఈ కమిటీ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. ఈ సందర్భంగా విప్లవ పోరాటాన్ని తాము శాంతి భద్రతల కోణంలో చూడడం లేదని, సామాజిక అంశంగానే పరిగణిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చల కోసం ముందుకు రావల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా విడులైన లేఖలో మాత్రం వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపేందుకు నెల రోజుల సమయం కావాలని కోరినట్టుగా పేర్కొనబడింది. పార్టీ శ్రేణులతో కానీ, జైలు జీవితం గడుపుతున్న వారితో కానీ సంప్రదింపులు జరపేందుకు గడువు కావాలని అభయ్ కోరడం వెనక ఆంతర్యం ఏంటన్నదే అంతు చిక్కడం లేదు. కేంద్ర కమిటీ ప్రకటన తరువాత పార్టీతో పాటు అనుభంద సంఘాలు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా సుముఖత వ్యక్తం చేసినట్టే అవుతుంది కానీ ఆయా వర్గాలతో సంప్రదింపులు మళ్లీ జరపాల్సిన అవసరం ఏంటన్నదే మిస్టరీగా మారింది. మరో వైపున దాదాపు ఏడాది కాలంగా శాంతి చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని కాల్పుల విరమణ ను ప్రకటించిన మావోయిస్టు పార్టీలో ఆయుధాలు వదిలేయాలన్న అంశం ఇంతకాలం చర్చకు రాకుండా ఉంటుందా అన్నదే అంతు చిక్కకుండా పోతోంది. ఒక వేళ ఆయుధాలు వదిలేయాలన్న నిర్ణయం తీసుకున్నట్టయితే మళ్లీ శాంతి చర్చల జరపాల్సిన అవసరం ఏమిటన్నదే అంతుచిక్కడం లేదు. కేంద్ర హోం మంత్రి కానీ, ప్రతినిధి బృందంతో కానీ శాంతి చర్చలు జరిపాల్సి ఉంటుందని ఈ లేఖలోనే స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేసి జన జీవనంలోకి రావాలని కేంద్ర హో మంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయుధాలు వదిలిసే జనజీవనంలోకి వచ్చిన మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాల్సిన అవసరం ఎందుకు ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. అభిప్రాయాలను తెలిపేందుకు ఎంచుకునే వేదికలు కాకుండా nampet (2025)@gmail.com, మెయిల్ ఐడీ, facebook – nampetalkల ద్వారా సమాచారం ఇవ్వాలని ఆ లేఖలో సూచించడం వెనక పార్టీ కొత్త సాంప్రాదాయానికి శ్రీకారం చుట్టిందా అన్న చర్చ కూడా సాగుతోంది.
నంబళ్ల మృతిపై…
కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్ కౌంటర్ లో మరణించిన తరువాత పార్టీ బూటకపు ఎన్ కౌంటర్ అంటూ ఆరోపణలు చేసింది. కానీ తాజాగా విడుదల చేసిన లేఖలో బలగాలు భీకర దాడి చేశాయని ఈ ఘటనలో బసవరాజ్ సహా 28 మంది అమరులయ్యారని కామెంట్ చేయడం గమనార్హం.

కొత్తదనం ఏముంది..?
అభయ్ పేరిట విడుదలైన ఈ లేఖలో శాంతి చర్చల కోసం మావోయిస్టులు కాల్పుల విరమణ చేస్తున్నారా లేక ఆయుధాలను వదిలేస్తున్నారా అన్న విషయంపై ఈ లేఖలో స్పష్టత లేకుండా పోయింది. శాంతి చర్చల కోసం కాల్పుల విరమణ చేస్తున్నామని ప్రకటించినట్టయితే కొంతకాలంగా మావోయిస్టు పార్టీ చేస్తున్న ప్రకటనను మరోసారి అమలు చేస్తామని ప్రకటించినట్టే అవుతుంది తప్ప మరోకటి అయితే కాదన్నది వాస్తవం. ఒక వేళ ఆయుధాలను వదిలేస్తామని మావోయిస్టు పార్టీ ప్రకటించినట్టయితే ఇందుకుగల కారణాలను విశ్లేశించినట్టుగా అయితే కనిపించడం లేదు. ఆయుధాలను వదిలేయాలని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రకటించినప్పుడు కూడా ఎదురు దాడి చేసిన మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఆయుధాలను వదిలేసేందుకు ముందుకు వచ్చామని ప్రకటించే అవకాశం ఉంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.
చర్చల ప్రతినిధి…
శాంతి చర్చల కమిటీలో ప్రతినిధిగా ఉన్న జంపన్న కూడా సోషల్ మీడియా వేదికగా మావోయిస్టుల ప్రకటన షేర్ చేశారు.
https://www.facebook.com/share/p/167rFjvaPj/

