‘‘కోల్డ్ వార్’’ లేఖలో పేర్కొన్నట్టుగానే…
దిశ దశ, దండకారణ్యం:
ఓ వైపున బలగాలు ముప్పేట దాడులు జరుపుతున్నా కేంద్ర కమిటీ కీలక సమావేశం జరగినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకత్వ బాధ్యతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీకి అప్పగించినట్టుగా తెలుస్తోంది. సెంట్రల్ మిలటరీ కమిషన్ (CMC) చీఫ్ గా, పొలిట్ బ్యూరో సభ్యునిగా పని చేస్తున్న దేవుజీని కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
తెలుగు వారికే…
కేంద్ర కమిటీ కార్యదర్శి బాధ్యత మరోసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికే దక్కింది. పీపుల్స్ వార్ ఆవిర్భావం తరువాత కొండపల్లి సీతారామయ్య సీసీ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించగా ఆయనను ఆ బాధ్యతల నుండి తప్పించి ముప్పాళ లక్ష్మణ్ రావు సుదీర్ఘ కాలం పని చేశారు. 2005లో మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ (MCC) ఆవిర్భావం తరువాత కూడా ముప్పాళే ఆ బాధ్యతల్లో కొనసాగారు. పార్టీలో సంస్థాగత మార్పులు చేర్పుల జరిపినప్పుడు నంబళ్ల కేశవ రావును కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 2025 మే 21న ఛత్తీస్‌గఢ్ బస్తర్ డివిజన్‌లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో నంబాళ్ల కేశవ్ రావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గగనన్న 28 మంది సహచరులు చనిపోయారు. ఆ తరువాత పార్టీ పొలిట్ బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్ కమిటీల సంయుక్త సమావేశం జరగలేదు. దీంతో పార్టీకి సీనియర్ నేత ముప్పాళ లక్ష్మణ్ రావు దిశా నిర్దేశం చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా కేంద్ర కమిటీ బాధ్యతలను తిప్పిరి తిరుపతికి అప్పగించినట్టుగా వెలుగులోకి వచ్చింది. దీంతో మరోసారి తెలుగు నాయకత్వానికే పట్టం కట్టినట్టయింది.
జగిత్యాలకే జై…
ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందిన కొండపల్లి సీతారామయ్యను బాధ్యతల నుండి తప్పించిన తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూతనంగా ఆవిర్భవించిన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన ముప్పాళ లక్ష్మణ్ రావు బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి మండలం జియన్నపేటకు చెందిన నంబళ్ల కేశవరావు పార్టీ సుప్రీంగా వ్యవహరించారు. తాజాగా ఈ బాధ్యతలు అప్పగించిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేడ్కర్ నగర్ కు చెందిన వారు. పొలిట్ బ్యూరోలో కీలక బాధ్యతలు వహించిన వారికే ఇంతకాలం సీసీ కమిటీ కార్యదర్శి బాధ్యతలు అప్పగించే వారు. ఈ సారీ మిలటరీ కమిషన్ చీఫ్ గా, పొలిట్ బ్యూరో సభ్యునిగా ఉన్న తిప్పిరి తిరుపతికి ఈ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. అయితే పెద్దపల్లి పట్టణానికి చెందిన మరో కీలక నేత మలోజ్జుల వేణుగోపాల్ పేరు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ దేవుజీ వైపే ముఖ్య నాయకత్వం మొగ్గు చూపినట్టుగా తెలుస్తున్నది. పార్టీ ఆర్థిక వేత్తగా, కేంద్ర కమిటీ సభ్యునిగా పని చేస్తున్న వేణుగోపాల్ అలియాస్ భూపతి అలియాస్ అభయ్ అలియాస్ సోనూ దాదా విధాన నిర్ణయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. మిలటరీ ఆపరేషన్లలో దిట్టగా పేరున్న ముఖ్య నేతల్లో ఒకరైన దేవుజీకి ఈ బాధ్యతలు అప్పగించినట్టయితే సముచితంగా ఉంటుందని భావించినట్టుగా సమాచారం. దండకారణ్యంలో పార్టీ కార్యకలాపాల నిర్వహణకు ప్రతికూల పరిస్థితులు నెలకొనడం, రెడ్ కారిడార్ ఏరియాలో చాలా భూభాగాన్ని బలగాలు కైవసం చేసుకున్నాయి. అంతేకాకుండా పార్టీ మెయిన్ లీడర్లే లక్ష్యంగా బలగాలు ఆపరేషన్లు చేపడుతున్న క్రమంలో ఎదురు దాడులు చేయాల్సిన ఆవశ్యతకను కూడా కేంద్ర కమిటీ నాయకులు గమనించినట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే అటు మిలటరీ ఆపరేషన్లు, ఇటు రాజకీయ వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉన్న దేవుజీకి బాధ్యతలు అప్పగించినట్టయితే సముచితంగా ఉంటుందని ముఖ్య నాయకత్వం యోచించి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కోల్డ్ వార్ లేఖ…
ఇటీవల మావోయిస్టు పార్టీలో ‘‘కోల్డ్ వార్’’ పేరిట ఓ లేఖ వైరల్ అయింది. ఆ లేఖలోని సాంరాశం ప్రకారం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) బాధ్యతలు మిలటరీ ప్లాటూన్ నంబర్ 1 ఇంఛార్జిగా ఉన్న మడావి హిడ్మా అలియాస్ సంతోష్ కు బాధ్యతలు అప్పగించారు. దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంపై మాత్రమే పట్టున్న ఆయనకు DKSZC కార్యదర్శి బాధ్యతలు అప్పగించారని, తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో నాయకుడు తక్కళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్నను పక్కన పెట్టేశారని అందులో విమర్శించడం జరిగింది. తాజాగా బయటకు వచ్చిన సమాచారం మేరకు DKSZC కార్యదర్శిగా మడావి హిడ్మాను నియమించినట్టుగా తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిడ్మాకు DKSZC ప్రాంతాన్ని అప్పగించడాన్ని బట్టి చూస్తే మిలటరీ ఆపరేషన్లు మరింత వేగవంతం చేసే యోచనలో పార్టీ నాయకత్వం ఉందని, ఈ కారణంగానే మిలటరీ కమిషన్ బాధ్యులను అందలం ఎక్కించే యోచనలో ఉన్నారని స్పష్టం అవుతోంది. అయితే ఆశన్నకు అప్పగించిన బాధ్యతలు ఏమిటన్న విషయం తెలియరావడం లేదు.

