31 మంది నక్సల్స్ మృతి
18 మంది జవాన్లకు గాయాలు
భారీగా ఆయుధాల స్వాధీనం
కర్రెగుట్ట ఆపరేషన్ పై పోలీసుల వెల్లడి…
దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కర్రె గుట్టలపై 21 రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించామని, 21 ఎన్ కౌంటర్ ఘటనలు చోటు చేసుకున్నాయని పోలీసు ఉన్నతాధికారులు, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. బుధవారం బీజాపూర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో కర్రె గుట్ట ఆపరేషన్ గురించి సమగ్రంగా వివరించారు. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న కర్రె గుట్టలపై 21 రోజుల జరిగిన కూంబింగ్ ఆపరేషన్లలో 21 సార్లు ఎదురు కాల్పులు జరిగాయని ఇందులో మొత్తం 31 మంది మావోయిస్టులు చనిపోయారని పోలీసు అధికారులు ప్రకటించారు. వీరందరిపై రూ. 1. 72 కోట్ల రివార్డు ఉన్నదని మావోయిస్టుల ఏరివేత కోసం చేపట్టిన సెర్చింగ్ ఆపరేషన్లలో ఇదే అతి పెద్దదని ప్రకటించారు. కర్రె గుట్టలపై చేపట్టిన గాలింపు చర్యలలో మొత్తం 18 మంది జవాన్లు గాయపడ్డారని, వీరందరిని చికత్స కోసం ఆసుపత్రిలకు అప్పటికప్పుడు తరలించామని తెలిపారు. ఈ గుట్టలపై పలు చోట్ల మావోయిస్టు పార్టీకి సంబంధించిన 214 డంపులను గుర్తించామని వాటి నుండి 35 రైఫిళ్లు, 450 ఐఈడీలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 12 వేల కిలోల రేషన్ సరుకులను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా వెల్లడించారు. CRPF, DRG, STF బలగాలు ఈ కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయని, ఏప్రిల్ 21న కర్రె గుట్టలపై ఏరివేతకు శ్రీకారం చుట్టామని తెలిపారు. జాయింట్ కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేసి ఈ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగించినట్టుగా ప్రకటించారు. ఎయిర్ ఫోర్స్ హెలిక్యాప్టర్ లను వినియోగించామన్నారు. వివిధ విభాగాల సమన్వయంతో ఏర్పాటు చేసిన కమిటీతో కర్రె గుట్టలపై ఆపరేషన్ కు సంబంధించిన కార్యాచరణ రూపొందించుకుని ఆపరేషన్ సక్సెస్ చేశామని తెలిపారు. మావోయిస్టులకు అత్యంత కీలకమైన PLGA, CRC, తెలంగాణ కమిటీలకు షెల్టర్ జోన్ గా ఉన్న కర్రె గుట్టలపై ఆపరేషన్ కొనసాగించామని వివరించారు.