తనిఖీలతో వెలుగులోకి…
దిశ దశ, హైదరాబాద్:
ఆర్టీసీకి తక్కువ ఖర్చుతో పాటు పర్యావరణ పరిరక్షణలోనూ తోడ్పాటును అందిస్తుందన్న ఉద్ధేశ్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త నిర్ణయం తీసుకుంది. అన్నింటా మేలైన ఫలితాలు అందిస్తుందని గమనించిన ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టింది. అయితే ప్రభుత్వ లక్ష్యానికి గండి కొడ్తూ ఇంటి దొంగలు చేతివాట ప్రదర్శిస్తున్న తీరు ఆందోళన కల్గిస్తోంది. ఆదివారం వేకువ జామున కరీంనగర్ 2 డిపోనకు చెందిన ఎలక్ట్రిక్ బస్సును చెకింగ్ అధికారులు తనిఖీ చేసినప్పుడు 11 మంది ప్రయాణీకులకు నకిలీ టికెట్లు ఇచ్చినట్టుగా తేలింది. రూ. 340 ధర పలికే ఒక్కో టికెట్ కు సంబంధించిన డబ్బులను ప్రయాణీకుల నుండి వసూలు చేసిన డ్రైవర్ తన జేబులో వేసుకున్నాడని విచారణలో తేలింది. తెల్లవారు జామున కావడంతో చెకింగ్ అధికారులు పట్టుకునే అవకాశం ఉండదన్న ధీమాతోనే ఇలా వ్యవహరించి ఉంటారని భావిస్తున్నారు. అయితే ప్రయాణీకులకు బ్లాంక్ టికెట్, రీ ఇష్యూ చేసిన టికెట్లను ఇచ్చినట్టుగా చెకింగ్ అధికారులు గుర్తించినట్టుగా సమాచారం.
OMS బస్…
కరీంనగర్ నుండి జేబీఎస్ కు వెళ్లే కొన్ని బస్సుల్లో one man service (OMS) విధానంలో నడుస్తున్నాయి. ఈ బస్సుల్లో టికెట్లను Ticket issuing mission (TIM)ల ద్వారా డ్రైవర్లే ఇస్తుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో one man service బస్సుల్లో డ్రైవర్ల చేతివాటం వెలుగులోకి రావడం ఆర్టీసీ అధికారులను ఆలోచనలో పడేసినట్టుగా ఉంది.
సంస్థ వారే…
అయితే సాధారణంగా ఆర్టీటీ అద్దె బస్సుల విధానంలో అయితే కండక్టర్లు సంస్థకు చెందిన వారు ఉంటారు. కానీ one man service ఎలక్ట్రిక్ బస్సుల్లో మాత్రం సంస్థ ఒప్పందం చేసుకున్న jbm సంస్థ నియమించిన డ్రైవర్లే నడుపుతుంటారు. థర్డ్ పార్టీ అగ్రిమెంట్ ద్వారా తెలంగాణ ఆర్టీసీ ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఎలక్ట్రిక్ బస్సులను jbm సంస్థ నియమించిన డ్రైవర్లు మాత్రమే నడిపిస్తుంటారు. వీటిలో one man service నడిపే డ్రైవర్లు సింగిల్ గా ఆపరేటింగ్ చేస్తారు కాబట్టి వారు ఏం చేసినా సంస్థ దృష్టికి వచ్చే అవకాశం అయితే లేదు. తనిఖీలు చేసినప్పుడు తప్ప ప్రయాణీకులు ఎంతమంది వెల్తున్నారు ఎన్ని టికెట్లు ఇష్యూ అయ్యాయి, డ్రైవర్లు చెప్తున్న లెక్కలు సరైనవేనా అన్న వివరాలు అధికారుల దృష్టికి వచ్చే అవకాశం ఉండదు. దీనివల్ల సంస్థకు ఆదాయం భారీగా గండిపడే అవకాశాలు అయితే ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదివారం బొల్లారం వద్ద తనిఖీల్లో పట్టుబడ్డ డ్రైవర్ ను jbm సంస్థకు తిప్పి పంపించడంతో పాటు అతన్ని ఆర్టీసీలో తీసుకునేందుకు అధికారులు సుముఖత చూపే అవకాశాలు లేవన్నట్టుగా తెలుస్తోంది.
థర్డ్ పార్టీ ఎలా..?
అయితే మిగతా బస్సుల విషయంలో అమలు చేస్తున్న విధానానికి ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా అమలు చేస్తున్న విధానానికి ఏ మాత్రం పోలిక లేకుండా పోయింది. సంస్థకు రావల్సిన ఆదాయం విషయంలో ఆర్టీసీ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. కండక్టర్ సర్వీస్ అందించే రూట్లలో మాత్రమే హైర్ బస్సులను నడిపేందుకు ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ సంస్థతో సంబంధం లేకుండా సంస్థ ఇచ్చిన TIMల ద్వారా టికెట్ల విక్రయించేందుకు ప్రైవేటు డ్రైవర్లకు అప్పగించడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. one man service అందించే బస్సుల్లో డ్రైవర్లను కట్టడి చేసే అధికారం కూడా ఆర్టీసీ అధికారులకు ఉండే అవకాశం ఉండదు. వారు థర్డ్ పార్టీ అగ్రిమెంట్ చేసుకున్న సంస్థ ప్రతినిధులతో మాత్రమే సంప్రదింపులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీంతో తమను నియంత్రించే వారు ఎవరూ లేరన్న ధీమాతో ఎలక్ట్రిక్ బస్సుల్లో వన్ మేన్ సర్విసులు నడుపుతున్న డ్రైవర్లు వ్యవహరించే అవకాశం ఉంటుందని ఆదివారం బొల్లారం వద్ద తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన విషయం తేటతెల్లం చేస్తోంది.
అర్హులు లేరా..?
సుశిక్షితులైన వారు, సీనియారిటీతో ఉన్న డ్రైవర్లకు ఆర్టీసీ సంస్థలో అయితే ఏ మాత్రం కొదవ లేదు. వీరి సేవలను ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో వినియోగించుకున్నట్టయితే సంస్థకు జవాబుదారి తనంగా వ్యవహరించాల్సి ఉంటుందన్న ఆలోచన ఉంటుంది. కానీ బస్సులను నిర్వహించే సంస్థ నియమించుకునే డ్రైవర్ల బాధ్యతారాహిత్యంగానే నడుచుకునే పరిస్థితులే ఎక్కువగా ఉంటాయన్నది వాస్తవం. మరో వైపున ఆర్టీసీ డ్రైవర్లచే ఎలక్ట్రిక్ బస్సులు నడిపించేందుకు సంస్థ ఎందుకు వెనుకడుగు వేసిందన్నది కూడా అంతు చిక్కకుండా పోతోంది. కేవలం ఎలక్ట్రిక్ బస్సులను నడిపించే సంస్థ నియమించే డ్రైవర్లకు మాత్రమే వీటిని నడిపించే సత్తా ఉంటుందన్న కారణమా లేక సదరు సంస్థ చేసిన ప్రతిపాదనలకు మొగ్గు చూపడమా లేక ఇతరాత్ర కారణాలా తెలియరావడం లేదు. కానీ ఆర్టీసీ నియమించుకున్న డ్రైవర్లు గరుడ లాంటి లాంగ్ సీసీ బస్సులను కూడా నడుపుతున్నారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఎలాంటి వాహనాలు అయినా నడిపేందుకు వెనకాడని ఆర్టీసీ సంస్థకు చెందిన డ్రైవర్లకే ఎలక్ట్రిక్ బస్సులను నడిపించే అవకాశం కల్పిస్తే సంస్థకు కూడా లాభదాయంగా ఉండనుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా చేపట్టిన తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన విషయం ఒక్కటేనని అనుకోకుండా వేరే ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఇలాంటి తంతు సాగే అవకాశం లేకపోలేదన్న విషయాన్ని అధికారులు గమనించాల్సి ఉంది. ఇప్పుడు అధికారుల దృష్టికి వచ్చిన విషయం ఇదే మొదటి సారి కాబట్టి మిగతా ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదన్న నమ్మకాన్ని పక్కన పెట్టి ప్రత్యేక దృష్టి సారించడం వల్ల సంస్థ ఆదాయానికి గండి పడకుండా ఉంటుంది.