దిశ దశ, కరీంనగర్:
డంపింగ్ యార్డ్ చెత్తను బయో మైనింగ్ ప్రాసెస్ చేసేందుకు ఇచ్చిన కాంట్రాక్టర్ నిబంధనలు అమలు చేశారా..? ఇక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించాల్సిన మునిసిపల్ అధికారులు ప్రత్యేకమైన సడలింపులు ఇచ్చారా..? లొగుట్టు పెరుమాళ్లకెరుకా అన్నట్టుగా తయారైందక్కడ.

వెయిమెంట్…
29 మెట్రిక్ టన్నలు చెత్తను బయో మైనింగ్ ప్రాసెస్ చేసేందుకు అధికారులు జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఏజెన్సీకి కాంట్రాక్టు ఇచ్చారు. 29 వేల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెస్ చేసేందుకు 1.63 కోట్లకు సదరు సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. అయితే ఈ సంస్థకు ఇప్పటికే రూ. 40 లక్షల వరకు బిల్లులు కూడా చెల్లించారని తెలుస్తోంది. మరో రూ. 40 లక్షల వరకూ బిల్లుల సిద్దం అయినట్టుగా తెలుస్తోంది. వెయిమెంట్ ప్రకారం చెత్తను ప్రాసెస్ చేయాల్సి ఉన్నందున సైట్ వద్ద ప్రత్యేకంగా వే బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వే బ్రిడ్జిపై తూకం వేసిన తరువాత ఎంతమేర చెత్త ప్రాసెస్ చేస్తున్నారన్న లెక్కలు రికార్డు చేయాల్సి ఉంటుంది. అయితే జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించిన ప్రాంతంలో వారం పది రోజుల క్రితం వరకూ అసలు వే బ్రిడ్జి ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. ఇటీవలే ఇక్కడ వే బ్రిడ్జి ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా పవర్ కనెక్షన్ ఇవ్వకపోగా, వెయిట్స్ అండ్ మేజర్ మెంట్స్ (తూనికలు కొలతల) శాఖ అధికారులు అనుమతులు కూడా ఇవ్వనట్టుగా తెలుస్తోంది. ఇక్కడ వే బ్రిడ్జి లేకుండానే ప్రాసెస్ చేయాల్సిన చెత్తను ఎలా తూకం వేశారన్నది మునిసిపల్ అధికారులకే తెలియాలి. తూకం వేయకుండానే సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీకి బిల్లులు ఎలా మంజూరు చేశారన్నది అంతుచిక్కకుండా పోతోంది.
సీసీ కెమరాలు…
అయితే స్వచ్ఛ సరేక్షన్ లో భాగంగా చేపడుతున్న బయో మైనింగ్ పనులకు సంబంధించిన వివరాలు మొత్తం సీసీ కెమరాల ద్వారా రికార్డు చేయడంతో పాటు వాటిని కమిషనర్, డైరక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (CDMA)కు అనుసంధానం చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీకి అప్పగించిన పనుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఒక వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టయితే సదరు కాంట్రాక్టు ఏజెన్సీ ఎన్ని టన్నుల చెత్తను ప్రాసెస్ చేసింది, ఇందుకు సంబంధించిన వెయిమెంట్ ఎలా చేశారు తదితర రికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది. కరీంనగర్ మునిసిపల్ కార్యాలయంలో రికార్డులు అందుబాటులో లేకున్నా CDMA కార్యాలయంలో ఉంటాయని స్పష్టం అవుతోంది. వీటన్నింటిని పరిశీలించి వాస్తవాలను తేల్చాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

