బెల్టు షాపులు మూసేయండి: లేదంటే రూ. 50 వేల జరిమానా…

నోటీసులు జారీ చేస్తున్న పంచాయితీ సెక్రటరీ…

దిశ దశ, పెద్దపల్లి:

బెల్టు షాపులను వెంటనే మూసేయండి… ఐదు రోజుల్లోగా క్లోజ్ చేయకపోతే రూ. 50 వేలు జరిమానా విధిస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామంలోని బెల్టు షాపుల నిర్వాహాకులకు నోటీసులు జారీ చేయడం మొదలైంది. స్థానిక పంచాయితీ కార్యదర్శి పేరిట జారీ చేస్తున్న ఈ నోటీసుల్లో పంచాయితీ తీర్మాణానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. చట్ట విరుద్దంగా సాగుతున్న బెల్టు షాపుల వల్ల గ్రామంలోని యువత మద్యానికి అలవాటు పడుతోందని, మహిళలు కుటుంబ కలహాల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులపై చెడు ప్రభావం పడుతోందని పంచాయితీ గుర్తించి బెల్టు షాపులు తొలగించాలని తీర్మానం చేసిందని వివరించారు. గ్రామాల్లో వేళ్లూనుకున్న బెల్టు షాపులను తొలగించేందుకు పంచాయితీ తీర్మానం చేసి నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఓ చిన్న గ్రామంలో బెల్టు షాపులను తొలగించేందుకు ఏకంగా పంచాయితీ తీర్మానం చేయడం, ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేయడం ఆధర్శంగా నిలుస్తోంది.


గతంలో…

మండలంలోని మొట్లపల్లి గ్రామంలో మద్యం అమ్మకాలు కొనసాగించకూడదంటూ పంచాయితీ పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించింది. రోడ్డు ప్రమాదాలతో పాటు సామాజిక రుగ్మతలకు కారణమవుతున్న మద్యం క్రయ విక్రయాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని సర్పంచ్ తుల మనోహర్ కోరారు. ఈ మేరకు గ్రామంలో మద్యం అమ్మాకాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చొరవ తీసుకోవాలని కోరారు. తాజాగా కిష్టంపేట గ్రామంలో బెల్టు షాపులకు నోటీసులు జారీ చేయడంతో కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో బెల్టు షాపులపై సరికొత్త సమరం మొదలైనట్టుగా కనిపిస్తోంది. అయితే ఆయా పంచాయితీలు బెల్టు షాపులను మూసివేయాలని ఇస్తున్న పిలుపును ఎంతకాలం పాటిస్తారోనన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.