ఆర్టీసీ కండక్టర్లను వేధిస్తున్న ‘టార్గెట్’
దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సరికొత్త సవాల్ ఎదురైంది. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘మహా లక్ష్మీ’ పథకం పేరిట ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అధికారికంగా నగదు లావాదేవీలు ఎక్కువగా జరిపించాలన్న ఆదేశాలు ఇవ్వకున్నప్పటికీ మౌఖికంగా మాత్రం అందిన ఆదేశాలు కండక్టర్ల పనితీరుకు ప్రామాణికంగా మారాయన్న చర్చ సగుతోంది. సర్కారు నిర్దేశించుకున్న లక్ష్యానికి తాము బాధ్యులు కావల్సి వస్తోందన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. కార్మికుల ముందు ఉంచుతున్న టార్గెట్ల వల్ల తాము సరిగా విధులు నిర్వర్తించలేకపోతున్నామన్న ఆవేదన డ్యూటీ చేస్తున్న కండక్టర్లలో వ్యక్తం అవుతోంది.
ఆదాయం విభజన ఇలా…
ఒక రూట్ లో నడిచే బస్సు ద్వారా ఆదాయం ఇంత రావాలని అంచనా వేసే ఛార్టులు తెలంగాణ ఆర్టీసీలో గతంలో కూడా ఉన్నాయి. సగటు ఆదాయానికి తక్కువగా వస్తే శాఖాపరంగా చర్యలు తీసుకునే వారు, వంద శాతం అక్యూపెన్సీ రెష్యో (OR) సాధించిన వారికి ప్రోత్సాహకం కింద రూ. 500 నగదు ఇచ్చే ఆనవాయితీ కొనసాగేది. అయితే అప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కిన ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకునే విధానంలో అమల్లో ఉండేది. కానీ తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమల్లోకి వచ్చిన మహాలక్ష్మీ పథకం ద్వారా కొత్త పద్దతులకు శ్రీకారం చుట్టారు ఆర్టీసీ అధికారులు. మహాలక్ష్మీ పథకం ద్వారా అమ్ముతున్న టికెట్లతో పాటు పథకం వర్తించకుండా వస్తున్న ఆదాయాన్ని వేర్వేరుగా లెక్కిస్తున్నారు. రెండు పద్దతుల ద్వారా ఎంతమేర ఆదాయం సాధించాలి అన్న లక్ష్యాన్ని కూడా నిర్దేశించారు. అయితే మహాలక్ష్మీ పథకం విషయంలో అంతగా పట్టించుకోని అధికారులు నగదు లావాదేవీల విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఉచిత ప్రయాణం అంశం పక్కన పెట్టి సంస్థకు నేరుగా వచ్చే ఆదాయం విషయంలో మాత్రం సీరియస్ గా పరిశీలిస్తున్నట్టుగా కార్మిక వర్గాలు చెప్తున్నాయి.
ఉచితం తరువాత…
అయితే మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేసిన తరువాత తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళ ప్రయాణీకులే ఎక్కువగా తిరుగుతున్నారని కండక్టర్లు అంటున్నారు. వేడుకలు, వివాహాలు జరిగే సమయం మినహాయిస్తే మిగతా సమయాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ శాతం పురుషులే ప్రయాణం చేసే వారు. అప్పుడు ఒక్కో ఆర్టీసీ బస్సులో 80 నుండి 90 శాతం వరకు పరుషులు ప్రయాణిస్తే ఇప్పుడా పరిస్థితులకు పూర్తి భిన్నంగా సాగుతున్నాయి. చాలా బస్సుల్లో కూడా పురుషులు ప్రయాణిస్తున్న సందర్భాలు అత్యంత తక్కువగా ఉంటున్నాయని ఆర్టీసీ అధికారులు కూడా గుర్తించారు. కానీ నగదు రూపంలో వచ్చే ఆదాయం విషయంలో మాత్రం అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారన్న ఆందోళన కండక్టర్లలో ఎక్కువగా కనిపిస్తోంది. బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటున్న విషయాన్ని గమనించిన పురుషులు చాలా మంది కూడా ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు. అయితే మహాలక్ష్మీ పథకం అమలు తరువాత బస్సులు కిటకిటలాడిపోతున్నప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్ని కావని అంటున్న వారూ లేకపోలేదు. పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సుల్లో అయితే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని, మరో స్టాప్ వచ్చేలోగా టికెట్లను ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండడం లేదని వాపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే టెన్షన్ తో టికెట్లు ఇవ్వాల్సి వస్తోందని, కిలోమీటరు దూరంలోనే లోకల్ స్టాప్ ఉంటుందని ఆ గమ్యం చేరేలోగా బస్సులో ఉన్న ప్రయాణీకులకు టికెట్లు ఇవ్వాలన్న ఆతృతతో డ్యూటీ చేయాల్సి వస్తోందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు నగదు ద్వారా వచ్చే ఆదాయంపై ప్రత్యేక దృష్టి పెట్టిన యాజమాన్యం ప్రాక్టికల్ గా తమకు ఎదురవుతున్న సమస్యలను కూడా గమనించాల్సిన అవసరం ఉందన్న అభ్యర్థన వినిపిస్తోంది.