ఎమ్మెల్సీ కొమురయ్యకు అస్వస్థత…

ఆసుపత్రికి తరలింపు…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అస్వస్థతకు గురయ్యారు. సోమవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని చింతకుంటలో బీజేపీ ప్రచారానికి హాజరైన కొమురయ్య ప్రచార రథంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాల్గొన్నారు. స్థానిక ఓటర్లను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగిస్తున్న క్రమంలో కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే తేరుకుని పైకి లేచిన ఆయనను వెంటనే కరీంనగర్ లోని ఓ ప్రవైటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం హైదరాబాద్ కు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. గత వారం రోజులుగా నిర్విరామంగా ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అస్వస్థకు గురయ్యారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. విశ్రాంతి లేకపోవడంతో ఒత్తిడికి లోనైన ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్టుగా వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వివరించారు.