Maoist: ఉత్తరాంధ్ర… ఉత్తర తెలంగాణ… ఉద్యమాలు…

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ప్రస్తానం…

మాఢ్ ఫారెస్ట్ లో ‘నంబాల’ ఎన్ కౌంటర్

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ కృష్ణ, అలియాస్ విజయ్ అలియాస్ ప్రకాష్ (68) ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. బుధవారం చత్తీస్ గడ్ లోని నారాయణపూర్ జిల్లాలోని కీకారణ్యాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవ రావు కూడా ఉన్నాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా ఎక్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మావోయిస్టుల ఏరివేత కోసం మాఢ్ ఫారెస్ట్ ఏరియాలో DRG బలగాలు కూంబింగ్ చేపట్టినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుందని చత్తీస్ గడ్ పోలీసు అధికారులు ప్రకటించారు. ఆయనతో పాటు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ మధు, మావోయిస్టు పార్టీ అధికారిక పత్రిక వ్యవహారాలు పర్యవేక్షించే నవిన్ తో పాటు మరో ముఖ్య నేత కూడా ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన వారిలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కానీ పూర్తి వివరాలను చత్తీస్ గడ్ పోలీసు అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఉద్యమాలకు కేరాఫ్…

వామపక్ష ఉద్యమాలకు ఉత్తర తెలంగాణతో పాటు ఉత్తరాంధ్ర కూడా జీవం పోసింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పీపుల్స్ వార్ పోరాటాలకు శ్రీకారం చుట్టిన చరిత్ర ఉంది. ఈ ప్రాంతం నుండే వంగపండు లాంటి ప్రజా గాయకులతో పాటు ఎందరో ఉద్యమకారులు పార్టీ వైపు అడుగులు వేశారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం జియ్యన్నగూడలో నంబాల కేశవరావు 1955లో జన్మించారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఉత్తర తెలంగాణలోని పొరుగల్లు ఓరుగల్లులో అడుగుపెట్టాడు. హన్మకొండలోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ (REC)లో బీటెక్ పూర్తి చేసిన ఆయన ఇదే సమయంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU)లో చేరారు. 1980వ దశాబ్దంలో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణల్లో అరెస్ట్ అయిన కేశవరావు ఉధ్యమం వైపు అడుగులు వేశారు. 1970వ దశాబ్దంలో పోరాటాల వైపు సాగిన ఆయన 1980లో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో ఏర్పడిన పీపుల్స్ వార్ పార్టీ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించారు. 1987లో శ్రీలంకలో విముక్తి పోరాటం చేస్తున్న లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE) నుండి ప్రత్యేక శిక్షణ పొందాడు. అంబూష్ నిర్వహించి దాడులకు పాల్పడడం, పేలుడు పదార్థాలు వినియోగించడం తదితర యుద్దతంత్ర విద్యలపై శిక్షణ పొందాడు. 2004లో విప్లవ పార్టీలన్ని ఒకే గొడుకు కిందకు రావాలన్న నినాదం, నేపాల్ టు ఆంధ్రా రెడ్ కారిడార్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చలు జరిపిన వారిలో నంబాల కేశవ రావు కూడా ఒకరు. మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (MCCI)లో వామపక్ష భావజాల పార్టీలన్ని కూడా విలీనం అయిన సంగతి తెలిసిందే. MCCIలో విలీనం తరువాత కేంద్ర సైనిక కమిషన్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. 2018 నవంబర్ 10న ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శి బాధ్యతల నుండి తప్పుకున్న తరువాత నంబాల కేశవ రావు సీసీ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పీపుల్స్ వార్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో కంచుకోటలను నిర్మించుకుని సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న క్రమంలో పోలీసు వ్యవస్థ కఠినంగా వ్యవహరించడంతో పార్టీ ఉనికిని కోల్పోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో పార్టీ నిర్మాణం, రిక్రూట్ మెంట్, దాడులు చేయడం వంటి వ్యవహారాల్లో కీలకంగా పని చేసిన నంబాల కేశవరావు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టే నాటికే దండకారణ్య అటవీ ప్రాంతంతో పాటు ఝార్ఖండ్, ఒడిషా, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకే పరిమితం కావల్సి వచ్చింది. తెలుగు రాష్ట్రాలలో గతవైభం తీసుకరావాలని వ్యూహ రచన చేసినప్పటికీ విఫలయత్నం అయ్యారు. దండకారణ్య అటవీ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం ఏర్పాటు, గుంపుల స్థాయిలో పార్టీ నిర్మాణం వంటి చర్యలు, పార్టీ మిలటరీ దాడులు తదితర అంశాలపై సునిశితంగా పరిశీలన చేసి కార్యాచరణ రూపొందించే వాడని పేరుంది.

తీరని నష్టం…

1980వ దశాబ్దంలో పీపుల్స్ వార్ ఏర్పడినప్పటి నుండి పార్టీ బలమైన ప్రత్యర్థిగా ఎదిగిన రికార్డు అందుకుంది. 1990వ దశాబ్దం నుండి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ బలగాలపై పై చేయి సాధించిన సందర్భాలు ఉన్నాయి. 1999 డిసెంబర్ 1 కరీంనగర్ ఉమ్మడి జిల్లా కొయ్యూరు అటవీ ప్రాంతంలో కేంద్ర కమిటీ సభ్యులు నల్ల ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ లు చనిపోయారు. అప్పటి వరకు పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ నాయకత్వాన్ని ఎన్ కౌంటర్ లలో కోల్పోయిన చరిత్ర లేదు. ఈ ఎన్ కౌంటర్ కు ముందు రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య ఎన్ కౌంటర్ సంచలనం కాగా, కొయ్యూర్ ఎన్ కౌంటర్ పార్టీని అతలాకుతలం చేసింది. ఆ తరువాత జరిగిన ఎన్ కౌంటర్లలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అటవీ ప్రాంతంలో రామకృష్ణ అలియాస్ ఆర్కె, వాంకిడీ అటవీ ప్రాంతంలో అజాద్, గరియాబంద్ ఎన్ కౌంటర్ లో చలపతిలు మరణించారు. అయితే కేంద్ర కమిటీ కార్యదర్శిగా భాద్యతల్లో ఉన్న వారికి అత్యున్నతమైన రక్షణ వలయం ఉంటుంది. అందునా మాఢ్ ఫారెస్ట్ అంటేనే కాకులు దూరని కారడవని పేరుంది. అటువంటి కీకారణ్యాల్లోకి బలగాలు చొచ్చుకపోయి ఏకంగా కేంద్ర కమిటీ కార్యదర్శినే ఎన్ కౌంటర్ చేయడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. పీపుల్స్ వార్ ఆవిర్బావం తరువాత కొండపల్లి సీతారామయ్యను బాధ్యతల నుండి తప్పించడంతో పాటు అతన్ని దూరంగా పెట్టడంతో ఆయన అరెస్ట్ అయి సాధారణ జీవనం గడిపారు. 2018 వరకు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి బాధ్యతల నుండి తప్పుకోగా ఇంటర్నేషనల్ రివల్యూషనరీ కమిటీ కార్యదర్శి బాధ్యతల్లో కొనసాగుతున్నారు. అయితే ఇప్పటి వరకు కేంద్ర కమిటీ కార్యదర్శి బలగాల చేతికి చిక్కడం అనేదే జరగలేదు. కానీ నంబాల కేశవరావు మాత్రం ఎన్ కౌంటర్ లో చనిపోవడం మావోయిస్టు పార్టీ ఉద్యమానికి తీరని నష్టం వాటిల్లింది.

You cannot copy content of this page