దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం కలకలం లేచింది. కారుణ్య నియామకం విషయంలో కనికరించడం లేదన్న ఆవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రజా వాణిలో ఎన్ని సార్లు వినతి చేసినా ఉద్యోగం మాత్రం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాడు. పెద్దపల్లి కలెక్టరేట్ లో సోమవారం ప్రజావాణి సందర్భంగా వినతి పత్రం అందించేందుకు వచ్చిన కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన బండి సతీష్ ఆత్హహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక స్వీపర్ గా పనిచేస్తున్న తన తండ్రి బండి లింగయ్య విధుల్లో ఉండగా పాము కాటు వేయడంతో చనిపోయాడని బాధితుడు తెలిపాడు. గత జనవరి 26న గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని పతాకావిష్కరణ ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే పాము కాటుకు తన తండ్రి గురయ్యాడని వివరించాడు. విధుల్లో ఉన్నప్పుడు చనిపోయిన తన తండ్రి ఉద్యోగం తనకు ఇస్తామని జడ్పీ సీఈఓ నరేందర్, ఇతర అధికారులు ప్రకటించారన్నాడు. అయితే తనకు ఉద్యోగం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, ప్రజా వాణిలో చాలా సార్లు వినతి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు బండి సతీష్. ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని వెల్లడించాడు. తన చావుకు అధికారులదే బాధ్యత అని ఆయన ఆరోపిస్తున్నాడు. బండి సతీష్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు.

