Maoist: అన్నలకు బహిరంగ లేఖలు… సోషల్ మీడియాలో వైరల్

దిశ దశ, దండకారణ్యం:

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు సూచనలు చేస్తూ రాసిన లేఖలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘తెలంగాణ ప్రజలు’’, ‘వోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్’ పేరిట విడుదలైన ఈ లేఖల్లో నక్సల్స్ జనజీవనంలో కలవాలని కోరుతున్నట్టుగా పేర్కొన్నారు. ఏ సిద్దాంతం శాశ్వతం కాదు… కాలంతో పాటూ సిద్దాంతాలూ మారుతుంటాయి… మారిన కాలంలో సాయుధ పోరాటానికి అనువైని పరిస్థితులు భారత దేశంలో లేవని మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూర్ మాజీ సభ్యుడు కోబాడ్ గాంధీ రాసిన ‘‘ఫ్రాక్చర్డ్ ఫ్రీడమ్’ అనే పుస్తకంలో పేర్కొన్న విషయాన్ని ఊటంకిస్తూ ఓ లేఖ విడుదల అయింది. సీపీఐ మావోయిస్టు పార్టీలో తెలంగాణాకు చెందిన నాయకులే ఉన్నతమైన స్థాయిలో ఉండి పార్టీకి దిశా నిర్దేశం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలంతా కూడా అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ నేతలు గ్రామాలకు తిరిగి వచ్చి ప్రజాస్వామ్య పద్దతిలో పని చేయాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. కేంద్ర కమిటీ నుండి గదళ సభ్యుని వరకు ప్రతి ఒక్కరూ కూడా గౌరవ ప్రదంగా గ్రామాలకు తిరిగి రావాలని తెలంగాణ బిడ్డలు ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. ‘‘మావోయిస్ట్ ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్’’ పేరిట విడుదలయిన లేఖలో మీరు నమ్మిన సిద్దాంత సామాన్యునికి ఆశాకిరణ ఎన్నడైంది..? మీకు ఎదురైన సవాళ్లు, పరిణామాలను విశ్లేషిస్తే మీకు ఆత్మ సంతృప్తిని మిగిల్చింది ఏందీ..? ఆత్మ సంతృప్తి లేని ఆత్మ గౌరవంతో ముందుకెల్తున్న మీ 40 ఏండ్ల ఉద్యమ బాట ప్రజా ధారణ లేక మోడు వారిన బీడు భూమిలా అయ్యింది… మావోయిస్టు అగ్రనేతలారా… కాలం చెల్లిన సిద్దాంతాలను వీడి ప్రజల జీవన విధానంలో పాత్రులు కావాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేఖల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ నాయకులు, శ్రేణులను ఉద్ధేశించి రాయడం గమనార్హం.

పార్టీ బలహీనం…

అయితే లేఖల వెనక తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టు నాయకులే లక్ష్యం చేసుకుని ఉన్నట్టుగా కనిపిస్తోంది. చత్తీస్ గడ్, ఒడిషా, తెలంగాణ, ఏఓబీ, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో వేళ్లూనుకున్న మావోయిస్టు పార్టీకి దిశానిర్దేశం చేస్తున్న వారంతా కూడా తెలంగాణా వారే కావడంతో వారిని బాహ్య ప్రపంచంలోకి తీసుకరావాలన్న లక్ష్యం కనిపిస్తోంది. తెలంగాణకు చెందిన ముఖ్య నేతలంతా బయటకు వచ్చినట్టయితే మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండా పోతుందన్న భావనతోనే ఈ లేఖలు విడుదల చేసినట్టుగా అర్థం అవుతోంది. దీనివల్ల మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో సాయుధ పోరాటం, విప్లవ పంథాకు పుల్ స్టాప్ పెట్టినట్టుగా అవుతోందన్న అంచనాలతోనే ఈ లేఖలు తయారు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు.

బయటకు వస్తారా..?

అయితే ఐదు దశాబ్దాలకు పైగా విప్లవ పంథాలో కొనసాగుతున్న నక్సల్స్ నేతలు ఇప్పుడు బాహ్య ప్రపంచలోకి వస్తారా..? జనజీనవంలో చేరిపోతారా అన్నది మాత్రం అనుమానంగానే కనిపిస్తోంది. విప్లవ బాటలో కొనసాగుతూ సైద్దాంతిక పోరాటం కోసం నాటి పీపుల్స్ వార్, నేటీ మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న నేతలంతా బయటకు రావాలని గతంలోనే తెలంగాణ పోలీసులు ఎన్నో విదాలుగా ప్రయత్నించారు. వారి కుటుంబాలతో మమేకమయ్యే ప్రయత్నం చేయడం, జన జీవనంలో కలవాలని పిలుపునివ్వడం వంటి కార్యకలాపాలు తెలంగాణ పోలీసులు రెండున్నర దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నారు. ఇటీవల కూడా మావోయిస్టు పార్టీ ప్రభావిత రాష్ట్రాల సరిహద్దులను ఆనుకుని ఉన్న జిల్లాల పోలీసు అధికారులు వివిధ నినాదాలు కూడా ఇచ్చి అజ్ఞాత నక్సల్స్ బయటకు రావాలని పిలుపునిచ్చారు. దీనివల్ల కొంతమంది మాత్రమే జన జీవనంలో కలిసేందుకు ముందుకు వచ్చినప్పటికీ మిగతా వారు మాత్రం సుముఖంగా లేరని స్పష్టం అయిపోయింది. చత్తీస్ గడ్, ఒడిషా, ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాయి. ఈ నేఫథ్యంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న నక్సల్స్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న యోచనలో పోలీసులు కూడా అంచనా వేస్తున్నట్టుగా సమాచారం. అయితే గత రెండేళ్ల కాలంగా దండకారణ్య అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎన్ కౌంటర్ల పరంపర, మావోయిస్టులకు బాసటగా నిలుస్తున్న వారిని కట్టడి చేయడం వంటి చర్యలు ముమ్మరం అయ్యాయి. ఈ విషయంపై పార్టీలో కూడా సుదీర్ఘంగా చర్చ జరిగినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఎదురొడ్డే అవకాశం లేదని లొంగుబాట వైపు అడుగులు వేయాలన్న అంశంపై కూడా చర్చించినట్టుగా పోలీసు వర్గాలకు సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్య నాయకులు, సైద్దాంతిక పోరాటానికి అంకితమైన వారంతా కూడా పోరుబాటలోనే కొనసాగాలన్న యోచనకే మొగ్గు చూపారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అనారోగ్యంతో బాధ పడుతున్న కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రా రెడ్డి అలియాస్ చలపతిని సరెండర్ కావాలని కేంద్ర కమిటీ ప్రతిపాదించినప్పటికీ ఆయన ససేమిరా అన్నట్టుగా తెలుస్తోంది. ఒడిషా సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో చలపతి మరణించిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతంలో నడిచే పరిస్థితి లేకున్నా ఊత కర్రల సాయంతో పార్టీలోనే చివరి వరకు ఆయన కొనసాగారని ఇలాంటి కరుడుగట్టిన వారు బాహ్య ప్రపంచలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తారా అన్నది మాత్రం అనుమానస్పదంగానే ఉంది. కేంద్ర కమిటీతో పాటు పలు రాష్ట్ర కమిటీలలో ముఖ్య భూమిక పోషిస్తున్న నేతలు కూడా అనారోగ్యంతో బాధ పడుతున్నప్పటికీ బయటకు వచ్చేందుకు ముందుకు రావడం లేదన్న ప్రచారం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జన జీవనంలో కలవాలంటూ విడుదల అయిన లేఖలు ప్రభావితం చేస్తాయా అన్న చర్చ కూడా సాగుతోంది.