Kaleshwram: పోలీస్ వెరిఫికేషన్ కోసం లేఖలు..!

కాళేశ్వరం ఆలయ అధికారుల నిర్ణయం…

దిశ దశ, కాళేశ్వరం:

రెండు రోజుల క్రితం కాళేశ్వరం ఆలయంలో అర్చకులుగా నియామకం అయిన వారిలో ఒకరిపై ఆరోపణలు రావడంతో వారి నేర ప్రవృత్తి గురించి తెలుసుకోవాలని నిర్ణయించారు అధికారులు. ఈ మేరకు ఆయా జిల్లాల పోలీసు అధికారులకు లేఖలు రాసినట్టుగా తెలుస్తోంది.

శాఖాపరమైన చర్యలో..?

కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న అభ్యర్థిని  అర్చకునిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే సదరు అర్చుకుని విషయంలో ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్న తరువాత నియామక పత్రం ఇస్తామని ప్రకటించిన దేవాదాయ శాఖ అధికారులు తాజాగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ కోసం లేఖలు రాశారు. వారిపై నేర చరిత్ర లేనట్టయితే పోలీసులు క్లీన్ చిట్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అయితే శాఖాపరంగా ఎదుర్కొన్న ఆరోపణల గురించి తెలుసుకోవల్సిన అవసరం కూడా ఉంటుంది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ పోచమ్మ ఆలయంలో హుండీ డబ్బులు దారి మల్లించారన్న ఆరోపణలతో పాటు విధులకు సక్రమంగా  హాజరు కావడం లేదని అక్కడి ఈఓ రీజనల్ జాయింట్ కమిషనర్ కు నివేదిక ఇచ్చినట్టుగా ప్రకటించారు. 2023లో జరిగిన ఈ ఘటన తరువాత దేవాదాయ శాఖ అధికారులు సదరు కాంట్రాక్టు ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారోనన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. అయితే అడెల్లి పోచమ్మ ఆలయంలో వచ్చిన ఆరోపణల తరువాత సదరు ఉద్యోగి డ్యూటీ నుండి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. మళ్లీ దేవాదాయ శాఖలో అర్చకునిగా విధులు నిర్వర్తించేందుకు దరఖాస్తు చేసుకోగా ఆయనను ఎంపిక చేశారు. శాఖాపరంగా గతంలో వచ్చిన ఆరోపణలు మరుగున పడిపోవడంతో తాజాగా అర్చకునిగా ఎంపికయి ఉంటాడన్న చర్చ సాగుతోంది. సంస్థాగతంగా జరిగిన ఈ విషయం గురించి దేవాదాయ శాఖ అధికారులు సమగ్రంగా ఆరా తీస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపున కాంట్రాక్టు ఉద్యోగిగా ఉన్నప్పుడు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన డ్యూటీకి ఎందుకు హాజరు కాలేదు..? అప్పుడు అధికారులు జరిపిన విచారణ తాలుకు ఫైలును క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అంటున్న వారూ లేకపోలేదు.

ఎంపిక విధానం…

కాళేశ్వరం ఆలయంలో అర్చకునిగా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్షతో పాటు ఓరల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందని తెలుస్తోంది. రాత పరీక్షలో ముందు వరసలో నిలిచిన వారు ఓరల్ ఇంటర్వ్యూలో మాత్రం వెనకంజలో పడినట్టుగా తెలుస్తోంది. మౌఖిక పరీక్షలో మహన్యాసం, శివ కళ్యాణంతో పాటు ప్రధానమైన వేద మంత్రాల  గురించి కమిటీ ప్రశ్నిస్తుందని తెలుస్తోంది. అయితే ఈసారి జరిగిన ఇంటర్వూలలో హాజరైన అభ్యర్థులకు ఓరల్ ఇంటర్వ్యూలలో వేసిన ప్రశ్నలు, వారిచ్చిన సమాధానాలకు సంబందించిన విషయంపై కూడా దేవాదాయ శాఖ కమిషనర్ ఆరా తీయాల్సిన అవసరం ఉందంటున్నారు.  ఇంటర్వ్యూ సమయంలో రికార్డు చేసిన వీడియో ఫుటేజీలను సునిశితంగా  పరిశీలించి కాళేశ్వరం ఆలయ అర్చకుల నియామక ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకుంటే బావుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.  కాంట్రాక్టు ఉద్యోగిగా ఉన్నప్పుడు వచ్చిన ఆరోపణల తరువాత అతను  విధుల నుండి తప్పుకోవడానికి అసలు కారణం ఏంటీ అన్న వివరాలను కూడా తెలుసుకోవల్సిన అవసరం ఉందని కూడా మరి కొందరు సూచిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నప్పుడు వచ్చిన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అదే శాకలో రెగ్యూలర్ అర్చకునిగా ఉద్యోగం ఇచ్చేందుకు నిబంధనలు అనుకూలిస్తాయా అన్న విషయంపై కూడా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. వేద మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మికత ఉట్టిపడాల్సిన ప్రధాన ఆలయాల్లో నియమించే అర్చకుల విషయంలో ఒకటికి రెండు సార్లు పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.