ఏఎస్పీ మృత్యువాత…
పలువురికి గాయాలు
దిశ దశ, దండకారణ్యం:
దండకారణ్యంలో మావోయిస్టులు ఎదురు దాడి మళ్ళీ మొదలు పెట్టినట్టుగా ఉంది. బలగాల చర్యలను కట్టడి చేసేందుకు సమాయత్తం అయినట్టుగా స్పష్టం అవుతోంది. చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లా కుంటాకు 5 కిలోమీటర్ల దూరంలో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టు పార్టీ నక్సల్స్ మందుపాతరలతో పేల్చారు. ఈ ఘటనలో ఏఎస్పీ అకాశ్ రావు మృత్యువాత పడగా, ఓ డీఎస్పీ, మరికొంత మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. డోండ్రా అటవీ ప్రాంతంలో ప్రొక్లైన్ ను మావోయిస్టులు ఆదివారం రాత్రి దగ్దం చేశారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లొస్తుండగా కాపు కాచిన మావోయిస్టులు పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేశారు.
కవ్వింపు చర్యలా?
మంగళవారం మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ళ కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్ కౌంటర్ కు నిరసనగా బంద్ పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే డోండ్రా అటవీ ప్రాంతంలోప్రొక్లైన్ దగ్దం చేసినట్టుగా భావిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వాహనంలో వెల్లొస్తుండగా కుంట, ఎర్రబోర రహదారిపై పేల్చివేతకు పాల్పడ్డారు. అయితే ప్రొక్లైన్ దగ్దం చేసి కవ్వింపు చర్యలకు పాల్పడినట్టయితే పోలీసులు వస్తారని మావోయిస్టులు అంచనా వేసినట్టుగా తెలుస్తోంది. వారి అంచనాలకు తగ్గట్టుగానే పోలీసులు వాహనంలో వెల్లొస్తుండగా మందు పాతర పేల్చారు. దీంతో పోలీసులు భారీ మూల్యాన్ని చెల్లించుకోవల్సి వచ్చింది. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీ నక్సల్స్ ఏరివేతలో భాగంగా ఎదురు కాల్పులు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. ప్రతీకారంతో ఉన్న మావోయిస్టులు శాంతి చర్చల అంశం తెరపైకి రావడంతో సుముఖత వ్యక్తం చేసిన మావోయిస్టులు కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు వచ్చారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి మాత్రం చర్చల అంశంపై స్పష్టమైన వైఖరి వెలువడలేదు. అయినప్పటికీ మావోయిస్టుల ఏరివేత కొనసాగిస్తూనే ఉన్నాయి బలగాలు. శాంతి చర్చల కారణంగా ఇంతకాలం స్తబ్దంగా ఉన్న నక్సల్స్ ఒక్కసారిగా పంజా విసిరారు.
రేపు బంద్…
కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజ్ ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 10న మావోయిస్టులు బంద్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్ కు 24 గంటల ముందు దండకారణ్యంలో మందుపాతర పేల్చడంతో ఒక్కసారిగా హై అలెర్ట్ అయ్యారు చత్తీస్ గడ్ పోలీసు అధికారులు.