దిశ దశ, జగిత్యాల:
రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఈఓ టి శ్రీకాంత్ రావు బదిలీ అయ్యారు. ఆయనను మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ ఆలయానికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. GO RT NO: 112 ద్వారా శ్రీకాంత్ రావు బదిలీ అయ్యారు.
వివాదాలు…
కొండగట్టు ఆలయ ఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్ రావు వివాదాలతోనే సహవాసం చేశారన్న విమర్శలు ఉన్నాయి. వరంగల్ ఆర్జేడీ కార్యాలయంలో పని చేస్తున్న ఆయనపై వేదింపులకు సంబంధించిన ఆరోపణలు రావడంతో కొండగట్టు ఆలయ ఈఓగా బదిలీ చేస్తున్నట్టుగా ఉత్తర్వులు అప్పట్లో వెలువడ్డాయి. కొండగట్టు అంజన్న ఆలయంలో బాధ్యతలు చేపట్టిన తరువాత సంస్కరణల పేరిట ఆయన తీసుకున్న నిర్ణయాలు వివాదస్పదం అయ్యాయి. స్థానికంగా ఉన్న చెక్ పోస్టు నుండి ప్రధాన ఆలయం వరకు ఎవరి వాహనాలను కూడా అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, దివ్యాంగులు, వృద్దులు ఇలా ప్రతి ఒక్కరూ కూడా చెక్ పోస్ట్ పార్కింగ్ ప్లేస్ నుండి ఎత్తుగా ఉన్న గుట్టపైకి నడుచుకుంటూ వెళ్లడం తప్ప ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేతోనూ వాగ్వాదానికి దిగారన్న ప్రచారం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు అర్చకులచే ప్రత్యేక పూజలు జరిపిస్తున్న క్రమంలోనూ వివాదం చెలరేగింది. దీంతో ఆలయ అర్చకులంతా రాజగోపురం ముందే ఆందోళన చేపట్టారు. ఇటీవల కాలంలో కొండగట్టు అంజన్న అలయంలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన రాష్ట్ర దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈఓ శ్రీకాంత్ రావును బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం.

