అటవీ శాఖ వర్సెస్ దేవాదాయ శాఖ… అంజన్న ఆలయ భూముల వివాదం…

దిశ దశ, జగిత్యాల:

పవనసుత హనుమాన్ క్షేత్రంలో భూ వివాదం చోటు చేసుకుంది. రెండు శాఖల మధ్య భూ ఆక్రమణలకు సంబంధించిన వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇంతకాలం దేవాదాయ శాఖకు చెందిన భూమిగానే భావించినప్పటికీ అటవీ శాఖ అధికారులు తమ విభాగానికి చెందిన భూములకు మార్కింగ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ భూములు తమవేనని దేవాదాయ శాఖ అధికారులు గతంలో ఇఛ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చినప్పటికీ తాజాగా అటవీ శాఖ అధికారులు మార్కింగ్ చేయడంతో మరో సారి తెరపైకి వచ్చింది. కొండగట్టు అంజన్న ఆలయం సమీపంలోని ఈఓ కార్యాలయం, అన్నదాన సత్రంతో పాటు పలు నిర్మాణాలకు అటవీ శాఖకు సంబంధించిన భూముల్లోనే ఉన్నాయని అటవీ శాఖ అధికారులు వాదిస్తున్నారు. 500 ఏళ్లకు పైగా చారిత్ర్మాత్మక ఆధారాలు ఉన్న కొండగట్టు అంజన్న క్షేత్రానికి సంబంధించిన భూములేనని దేవాదాయ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

10 ఎకరాలు…

ఆలయ ప్రాంగణంలో జరిపిన నిర్మాణాలతో పాటు దేవాదాయ శాఖ వినియోగిస్తున్న దాదాపు 10 ఎకరాల భూమి అటవీ శాఖకు సంబంధించినదేనని ప్రత్యామ్నాయంగా తమకు భూమి అప్పగించాలని జిల్లా అటవీ శాఖ అధికారులు కొండగట్టు ఆలయ అధికారులకు సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. గతంలోనే రెండు శాఖల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగినప్పటికీ ఈ అంశం మరుగున పడిపోయింది. తాజాగా అటవీ శాఖ అధికారులు తమ విభాగానికి చెందిన భూములను గుర్తించి మార్కింగ్ చేయడంతో మరో సారి చర్చ మొదలైంది. అటవీ శాఖ అధికారులకు, దేవాదాయ విభాగం అధికారులకు మధ్య గత ఆగస్టు నుండే లేఖల ప్రక్రియ మొదలయినట్టుగా తెలుస్తోంది. అయితే దేవాదాయ శాఖ అధికారులు మాత్రం అంజన్న ఆలయానికి పక్కాగా భూములు ఉన్నాయని అటవీ శాఖకు ఏ మాత్రం సంబంధం లేదన్న వాదనలు వినిపిస్తున్నారు.

జాయింట్ సర్వే…

అయితే తాజాగా కొండగట్టు అంజన్న భూముల విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో జాయిట్ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఆయా విభాగాల అధికారుల వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా సర్వే చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే యోచనల ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం.