ఒక సమావేశానికి శ్రీధర్ బాబు హాజరు
అంటీ ముట్టనట్టుగా పొన్నం…
ధర్మపురికే పరిమితమైన అడ్లూరి…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురేయాలన్న నినాదాలు వినిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వంలో మాత్ర భిన్నమైన తీరుతో వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ బల్దియాను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గుమ్లాపూర్ సమావేశంలో కరీంనగర్ ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాలు కురిపించారు. అయితే కార్యక్షేత్రంలో మాత్రం ఇందుకు అనుగుణంగా సమీకరణాలు నెరపడం లేదు. మరో ఐదు రోజుల్లో పోలింగ్ జరగనున్నప్పటికీ ఒకప్పుడు కరీంనగర్ పై ప్రభావం చూపిన నాయకులు మొక్కుబడి చర్యలకే పరిమితం అవుతున్న తీరు చర్చకు దారి తీస్తోంది.

ఇంఛార్జి మంత్రి…
కరీంనగర్ ఇంఛార్జిగా తుమ్మల నాగేశ్వర్ రావుకు బాధ్యతలు అప్పగించింది అదిష్టానం. నామినేషన్ల పర్వానికి ముందు సిద్దిపేటలో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు మంత్రులకు 22 డివిజన్ల చొప్పున బాధ్యతలు అప్పగిస్తామని పార్టీ శ్రేణులతో చెప్పారు. ఆ తరువాత కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మంత్రులు తుమ్మల, దుద్దిళ్ల, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొప్పదండి మండలం గుమ్లాపూర్ సమావేశ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రులు పర్యటించారు. కానీ కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఒక్క శ్రీధర్ బాబు మినహా మిగతా వారు ఎవరూ కానరాకపోకపోవడం చర్చకు దారి తీస్తోంది.

స్ట్రీట్ కార్నర్ మీటింగ్…
గురువారం గుమ్లాపూర్ సీఎం సభ ముగిసిన తరువాత సెయింట్ జాన్స్ స్కూల్ వద్ద జరిగిన సమావేశానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. అయితే మిగతా డివిజన్ల ప్రచారానికి ఆయన ఇంతవరకూ హాజరు కాకపోగా గురువారం రాత్రి జరిగిన మీటింగ్ ఒక్కదానికే పరిమితం కావడం గమనార్హం. కరీంనగర్ ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షునిగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన శ్రీధర్ బాబు ఒకప్పుడు కరీంనగర్ జిల్లా కేంద్రంపై ప్రత్యేక దృష్టి సారించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సారి మాత్రం పార్టీ సమావేశాలకు హాజరవుతున్నారే తప్ప తమ ప్రభావాన్ని చూపించలేకపోతుండడం వెనక కారణమేంటన్నదే అంతు చిక్కడం లేదు.

కానరాని ‘‘పొన్నం’’
కరీంనగర్ ఎంపీగా పని చేసిన పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం హుస్నాబాద్ నుండి ప్రాతినిథ్యం వహిస్తూ మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నికల్లో మాత్రం హుస్నాబాద్ మునిసిపాలిటీకే పరిమితం కావడం గమనార్హం. ఇంఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమక్షంలో జరిగిన సమావేశాలకు, సీఎం రేవంత్ రెడ్డి సభలో పాల్గొన్న పొన్నం కరీంనగర్ వైపు కన్నెత్తి చూడడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అడ్లూరి ఇలా…
ధర్మపురి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా కరీంనగర్ బల్దియా ఎన్నికల్లో మాత్రం కనిపించడం లేదు. ఆయన తన సొంత నియోజకవర్గానికే పరిమితం కావడం గమనార్హం.
ఎందుకిలా..?
రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కరీంనగర్ లో నిర్వహించే ఏ కార్యక్రమంలో అయినా ముఖ్య భూమిక పోషించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేవలం ఒకే ఒక చోట ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, కరీంనగర్ కు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్న తీరు స్థానికంగా చర్చనీయంశంగా మారింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కీలక భూమిక పోషించిన ఇద్దరు మంత్రులు ఇప్పుడు నామమాత్రమైన చర్యలకే పరిమితం అవుతున్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దూరంగా ఉండాలని చెప్పిందో లేక… మరేదైనా కారణమో తెలియదు కానీ ఒకప్పుడు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ గా మారిన ముఖ్య నాయకులు కార్పొరేషన్ ఎన్నికల్లో కీలక భూమిక పోషించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను తమ భుజాలపై వేసుకున్న నాయకులు ఇఫ్పుడెందుకు ఇలా నడుచుకుంటున్నారన్నదే మిస్టరీగా మారింది.
స్థానిక నాయకులే…
కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా కరీంనగర్ విషయంలో అంతగా దృష్టి సారించనట్టుగా స్పష్టం అవుతోంది. తన నియోజకవర్గ కేంద్రంలోని మునిసిపల్ ఎన్నికలకే పరిమితం అయ్యారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో స్థానికంగా ఉండే నాయకులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, వెలిచాల రాజేందర్ రావు, వైద్యుల అంజన్ కుమార్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వి నరేందర్ రెడ్డి, సత్తు మల్లేశంతో పాటు స్థానికంగా ఉండే నాయకులు మాత్రమే ప్రచారంలో కనిపిస్తున్నారు.
అసలేం జరిగింది..?
కరీంనగర్ జిల్లా అనగానే రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, ఏఐసీసీ నేతలు ప్రత్యేక దృష్టి సారించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ సారి మాత్రం ముఖ్య నేతల జాడ కనిపించకుండా పోవడం విస్మయానికి గురి చేస్తోంది. అధిష్టానం ఆయా నేతలను తమతమ నియోజకవర్గాలకే పరిమితం కావాలన్న సంకేతాలు పంపించిందా లేక, మరేదైనా బలమైన కారణం ఉందా అన్నదే అంతు చిక్కకుండా పోతోంది. కరీంనగర్ మునిసిపాలిటీలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుచుకునే దిశగా పావులు కదుపుతున్నారా లేక ‘చే’జార్చుకున్నా ఫర్వాలేదన్న రీతిలో అధిష్టానం వ్యవహరిస్తోందా అన్న తర్జన భర్జనలయితే సాగుతున్నాయి.

