Phone Tapping: SIB లక్ష్యం ఏంటీ… లక్షణంగా వాడుకున్న తీరేంటీ..?

దిశ దశ, హైదరాబాద్:

సంఘ విద్రోహ శక్తులు, తీవ్ర వాదుల కదలికలపై నిఘా వేసేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటలీ జెన్స్ బ్యూరో (SIB)కి నిర్దేశించిన లక్ష్యాన్ని మరుగున పడేశారా..? తమ అవసరాల కోసం రాజకీయ నాయకులకు విప్లవ సంస్థలతో లింక్ పెట్టేశారా..? విప్లవ సంస్థలతో మిలాఖత్ అయ్యారని తప్పుడు నివేదికలు తయారు చేసి తమ అధికారాలను దుర్వినియోగం చేశారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుతో వెలుగులోకి వస్తున్న విషయాలను పరిశీలిస్తే. అంతా తమ చేతుల్లోనే ఉందన్న ధీమాతో కొంతమంది అధికారులు ప్రదర్శించిన అత్యుత్సాహం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.

ముచ్చటగా మూడో సారి…

SIB చీఫ్ గా వ్యవహరించిన రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావును ఫోన్ ట్యాపింగ్ కోసం ఏర్పాటు చేసిన సిట్ (SIT) బృందం మూడోసారి విచారించింది. సాంకేతికతను అందిపుచ్చుకుని ఆధారాలు సేకరించిన సిట్, సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణిత్ రావు కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఆధారాంగా ఆయనను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం అన్నట్టుగా వ్యవహరిస్తున్న ప్రభాకర్ రావు నుండి సమగ్ర వివరాలు రాబట్టేందుకు డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని టీమ్ ప్రయత్నిస్తోంది. తమ వద్ద ఉన్న ఆధారాలను కూడా చూపిస్తూ ప్రభాకర్ రావును ప్రశ్నిస్తుండడంతో అంగీకరించక తప్పని పరిస్థితి ప్రభాకర్ రావుకు ఎదురవుతున్నట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు వెల్లడిస్తున్న అంశాలను రికార్డు చేసుకుంటున్న సిట్ టీమ్ వాటిపై లోతుగా అధ్యయనం చేయనున్నట్టు సమాచారం.

లక్ష్యం దారి మళ్లించి…

SIBని ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని పక్కన పెట్టేసి తమ సొంత ఏజెండాతో ఈ విభాగం ద్వారా కార్యకలాపాలు కొనసాగించినట్టుగా తేలడం గమనార్హం. మావోయిస్టు ఏరివేత ఆపరేషన్ ముసుగు వేసి డీఎస్పీ ప్రణిత్ రావు నేతృత్వంలో ఓ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. డిజిగ్నేటెడ్ అథారిటీ హోదాలో ప్రభాకర్ రావు పంపించిన జాబితాకు ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయా మొబైల్ నంబర్లపై ప్రత్యేక నిఘా వేశారు. రాజకీయ నాయకులకు సంబంధించిన ఈ నంబర్లన్నింటికి కూడా మావోయిస్టు పార్టీకి మెడిసిన్స్, డబ్బులు పంపిస్తున్నారని, ఆయుధాలు కూడా సమకూరుస్తున్నారని ప్రభాకర్ రావు అనుమతులు తీసుకుని సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో ఆ ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా ఒప్పుకోవడంతో SIBని ఏర్పాటు చేసిన లక్ష్యం కోసం కాకుండా ఆ లక్ష్యాన్ని దారి మళ్లించినట్టుగా స్పష్టం అవుతోంది.

కథ అడ్డం తిరిగింది…

ప్రభాకర్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడిన తీరు పోలీసు అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే నేరాలను ఛేదించే పనిలో నిమగ్నం అయ్యే పోలీసులు చాలా కాలంగా ఓ సూత్రాన్ని తూ.చ. తప్పకుండా నమ్ముతారు. నేరస్థులు ఎక్కడో ఓ చోట తప్పు చేస్తారని దాని గురించి ఆరా తీసినట్టయితే ఖచ్చితంగా నిందితులను పట్టుకుంటామని  పోలీసులు ఘంటాపథంగా నమ్మేవారు. సాంకేతికత అందుబాటులో లేని కాలంలో ఈ పద్దతితోనే దర్యాప్తు చేసి నేరాలను ఛేదించడంలో సఫలం అయ్యేవారు. సాంకేతికత అందింపుచ్చుకుని ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుపుతున్న సిట్ బృందం కూడా ఇదే పద్దతిలో ఆరా తీస్తూ అత్యంత కీలకమైన ఆధారాన్ని సేకరించడంలో సఫలం అయినట్టుగా ఉంది. డీఎస్పీ ప్రణిత్ రావు ఎస్ఐబీలో ఉన్న రికార్డులు, హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినప్పటికీ ఆయన పర్సనల్ మొబైల్ ట్యాపింగ్ గుట్టును రట్టు చేస్తుందని ఊహించలేకపోయారు. 2023 ఎన్నికల సమయంలో డీఎస్పీ ప్రణిత్ రావు వాడిన మొబైల్ ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) ఎనాలిసిస్ చేస్తున్న క్రమంలో బయటపడ్డ రికార్డులు సిట్ అధికారులకు అత్యంత కీలకంగా మారాయి. ప్రణిత్ రావు మొబైలో లో ట్యాపింగ్ చేసిన రికార్డుల డాటా లభ్యం కావడంతో అంతా సేఫ్ అనుకున్న ప్రభాకర్ రావు అండ్ టీమ్ పరిస్థితి డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా మారింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే చట్టాన్ని కాపాడే పోలీసులు కూడా ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడినప్పటికీ ఎక్కడో ఓ చోట తప్పు చేసి తీరుతారని అదే వారి పాలిట శాపంగా మారుతుందని డీఎస్పీ ప్రణిత్ రావు ఫోన్ లో లభ్యమైన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.

You cannot copy content of this page