Doctor’s Day Special: వైద్యుల కళాత్మకత… పౌరాణిక పాత్రల ప్రదర్శన…

దిశ దశ, కరీంనగర్:

“బావా! ఎప్పుడు వచ్చి తీవు? సుఖులే భ్రాతల్, సుతుల్ చుట్టముల్!
నీ వాల్లభ్యము బట్టు కర్ణుడును, మన్నీలున్ సుఖోపేతులే?
మీ వంశోన్నతి గోరు భీష్ముడును, మీ మే ల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమముమై నెసంగుదురె నీ తేజంబు హెచ్చించుచున్.”

కృష్ణా కార్యార్థినై తొలుత వచ్చిన వాడను నేను…

కపట నాటక సూత్ర ధారి కృష్ణుడు తాను తీసిన గోతిలో తానే పడ్డాడు…

ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరిక్షయే కానీ క్షత్రియ పరిక్ష కాదే…

హవాభావాలతో పౌరాణిక పాత్రలు వేసిన కరీంనగర్ వైద్యులు అందరినీ  అబ్బురపరిచారు. డాక్టర్స్ డే పురస్కరించుకుని ఏటా తమలోని కళాత్మకతను ప్రదర్శించే వైద్యులు ఈ సారి మరింత ఉత్సాహంగా  ప్రతిభను ప్రదర్శించారు. కరీంనగర్ కు చెందిన సీనియర్ డాక్టర్లు మరణించడంతో వైద్యుల దినోత్సవాన్ని వాయిదా వేసుకున్న IMA శనివారం రాత్రి కరీంనగర్ బైపాస్ రోడ్డులోని వి కన్వెన్షన్ లో నిర్వహించింది. ఈ సందర్భంగా దాన వీర శూరకర్ణ, సుభద్ర పరిణయం వంటి పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు. పాండవులు నిర్మించిన మయసభ, కర్ణునికి అంగరాజ్య పట్టాభిషేకం, కౌరవ పాండవ యుద్దానికి ముందు శ్రీ కృష్ణుడి సాయం కోసం దుర్యోదనుడు, అర్జునుడు వెల్లినప్పుడు జరిగిన వాదనలతో పాటు సుభద్ర పరిణయం నాటకాలను డాక్టర్లు ప్రదర్శించిన తీరు పలువురిని ఆకట్టుకుంది. దుర్యోదనుడి పాత్రలో డాక్టర్ ఎస్ రవి కుమార్, కృష్ణుడి పాత్రలో డాక్టర్ వెంకటేశ్వర్లు, అర్జునుడి పాత్రలో డాక్టర్ తిరునాధర్ హవాభావాల ప్రదర్శించారు.

ఉత్సాహాంగా ఉల్లాసంగా…

నాలుగైదేళ్ల క్రితం వరకు డాక్టర్స్ డే అనగానే సన్మానాలు, సత్కారాలు… తమ గొప్పతనాన్ని చాటుకునే ప్రసంగాలకు మాత్రమే పరిమితం అయ్యేది.  కరీంనగర్ IMA మాత్రం తమ సంఘ సభ్యుల్లో నూతనోత్తేజం నింపే ప్రయత్నం చేస్తూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. నిరంతరం  పేషెంట్ల సేవలో మునిగిపోయే వైద్యుల్లో మానసికంగా ఉల్లాసం నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతున్నాయి. దీంతో  తమలోని కళలను ప్రదర్శించేందుకు డాక్టర్స్ డే వేడుకలను వేదికగా మల్చుకుంటున్నారు. సినిమా పాటలకు స్టెప్పులు వేయడం, హస్యరసాన్ని పండించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఆరంభించారు. మొదట ప్రేక్షక పాత్రకే పరిమితమైన డాక్టర్లు క్రమక్రమంగా  తమలోని కళలను ప్రదర్శించేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. దీంతో శనివారం రాత్రి నాటి కార్యక్రమంలో కేవలం పౌరాణిక నాటకాలే కాకుండా ఇతరాత్ర ప్రదర్శనలు కూడా చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ సినిమా పాటలకు డ్యాన్సులు చేసి సభికులను ఆనంద పరవశంలో ముంచెత్తారు. నేటి తరం వైద్యులే కాకుండా సీనియర్ వైద్యులు కూడా వేదికపై స్టెప్పులేశారు. అలనాటి పాటలపై నృత్యం చేసిన వెటరన్ డాక్టర్లు సరికొత్త జోష్ నింపారు. అనస్తిషియా, పెడియాట్రిక్, గైనిక్ ఇలా ఆయా రంగాల్లో నిపుణులైన వైద్యులు గ్రూపులుగా ఏర్పడి కళలను ప్రదర్శించారు. ఈ సారి వేదికపై ప్రదర్శనలు చేసేందుకు ఎక్కువ సంఖ్యలో బృందాలు ముందుకు రావడంతో డాక్టర్లు నూతన ఒరవడి మొదలైనట్టయింది. నేటి  తరం నుండి వెటరన్ డాక్టర్ల వరకు వివిధ కళా రూపాల ప్రదర్శనతో నిర్వహించిన డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ అత్యంత వైవిద్యంగా కొనసాగాయి.