చామనపల్లి హత్య కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష…

కరీంనగర్ కోర్టు సంచలన తీర్పు…

దిశ దశ, కరీంనగర్:

చేపల సొసైటీలో సభ్యత్వం తొలగించాడన్న కోపంతో హత్యకు పాల్పడిన   నిందితులకు కరీంనగర్ జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఒక్కోక్కరికి రూ. 1500 చొప్పున జరిమానా విధించింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చామనపల్లిలో 2019 ఏప్రిల్ 19న మత్స సహకార సంఘం అధ్యక్షుడు బొజ్జ తిరుపతి (48) హత్య జరిగింది. తిరుపతిపై రాళ్లతో దాడి చేసి, టవల్ తో గొంతు నులిమి హత్య చేసిన సంఘటన తెలియగానే అప్పటి కరీంనగర్ రూరల్ సీఐ కె శశిధర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హతుడు తిరుపతి భార్య సమత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హత్య చేయడానికి అసలు కారణాలు ఏంటని ఆరా తీశారు. చామనపల్లి గ్రా మత్సకార సహకార సంఘంలో సభ్యులను తొలగించాడన్న కోపంతో తిరుపతిని చంపేశారని గుర్తించారు. నిందితులు ఎం ధర్మరాజం, రాములు, పోచయ్య, కొమురయ్య, అంజయ్య, వెంకటేశం, నవీన్, ప్రవీణ్, శ్రీనివాస్, సంపత్, శ్రీనివాస్, లచ్చయ్య, సత్తయ్య, శ్రీనివాస్, వెంకట్రాజంలు హత్యకు పాల్పడ్డారని గుర్తించిన పోలీసులు ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చి హత్యకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించారు. కరీంనగర్ జిల్లా కోర్టులో జరిగిన విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం ప్రతాప్ వాదనలు వినిపించారు. అప్పటి సీఐ శశిధర్, ఎస్‌హెచ్‌ఓ ఏ నిరంజన్ రెడ్డి, కోర్టు డ్యూటీ ఆఫీసర్ (CDO) ఎన్ రాజేందర్, సీఎంఎస్ ఏఎస్ఐ ఎం సత్తయ్యలను సీపీ గౌష్ ఆలం అభినందించారు.

ఒకే కుటుంబం…

చామనపల్లి మత్స సహకార సంఘం అధ్యక్షుడు తిరుపతి హత్య కేసులో శిక్ష పడిన 15 మంది కూడా ఒకే కుటుంబానికి చెందిన వారే కావడం గమనార్హం. మ్యాకల కుటుంబానికి చెందిన వీరిలో తండ్రి కొడుకులూ కూడా హత్యకు పాల్పడడం గమనార్హం.