దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ అసెంబ్లీ ఇంఛార్జి పురుమళ్ల శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో నెలకొన్న గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టడంలో భాగంగా శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారని తెలుస్తోంది. అయితే క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం ఇటీవల కాలంలో కరీంనగర్ జిల్లాలో నెలొకొన్న పరిణామాలపై షోకాజ్ నోటీసులు ఇవ్వగా పురుమళ్ల శ్రీనివాస్ క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డికి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని స్పష్టం చేశారు. శ్రీనివాస్ వైఖరిని మార్చుకునేందుకు పార్టీ తగినంత సమయం ఇచ్చినప్పటికీ మార్పు రాలేదని గమనించామని, ఈ కారణంగానే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించింది.
బిగిసిన ఉచ్చు…
పురుమళ్ల శ్రీనివాస్ విషయంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ తీసుకున్న నిర్ణయంతో ఆయన చుట్టు బిగుసుకున్న ఉచ్చు చుట్టుకునేలా చేసినట్టు స్పష్టం అవుతోంది. ఇప్పటికే పలుమార్లు షోకాజ్ నోటీసులు అందుకున్న పురుమళ్ల శ్రీనివాస్ ఎప్పటికప్పుడు కమిటీకి వివరణ ఇచ్చుకోవడంతో పాటు ఫిర్యాదులు కూడా చేశారు. అయితే కమిటీ మాత్రం ఆయన విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే జిల్లాలో నెలకొన్న పరిణామాల విషయంలో బహిరంగంగా మాట్లాడిన శ్రీనివాస్ కు వెన్నుదన్నుగా నిలుస్తారన్న వారు కూడా అండగా నిలవలేదన్న ఆవేదన ఆయన అనుచరుల్లో వ్యక్తం అవుతోంది.
మంత్రి పొన్నం వర్గంలో జోష్…
ఇంతకాలం మంత్రి పొన్నం ప్రభాకర్ లక్ష్యంగా పురుమళ్ల శ్రీనివాస్ చేసిన ఆరోపణల విషయంలో పీసీసీ క్రమ శిక్షణా సంఘం తీసుకున్న నిర్ణయంతో ఆయన వర్గంలో జోష్ వచ్చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడన్న కారణంతో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న మీమాంసలో కొట్టుమిట్టాడిన పార్టీ శ్రేణులకు పీసీసీ డిసిప్లేనరీ కమిటీ తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం అవుతోంది. కరీంనగర్ పార్లమెంట్ ఇంఛార్జి వెలిచాల రాజేందర్ నేతృత్వంలో పార్టీ నాయకులు, అంతకు ముందు వైద్యుల అంజన్ కుమార్ తో పాటు పలువురు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసి ఇక్కడి పరిస్థితులు వివరించడంతో క్రమ శిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు. ప్రధానంగా శ్రీనివాస్ పై ఉన్న కేసుల అంశం గురించి అధిష్టానం తీవ్రంగా పరిగణించిదని కూడా పార్టీ వర్గాల సమాచారం. ఏది ఏమైనా ఏడాది కాలంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిణామాలకు చెక్ పెట్టేందుకు అధిష్టానం ఏకంగా అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీని పార్టీ నుండి సస్పెండ్ చేయడం మాత్రం చర్చకు దారి తీసింది.