కేబుల్ బ్రిడ్జి సమస్యకు పరిష్కారం లభించేనా..?

దిశ దశ, కరీంనగర్:

ఆ వంతెన సమస్యలతో స్వాగతం పలుకుతోంది ఎందుకు..? తరుచూ వన్ వే ద్వారా ట్రాఫిక్ మళ్లించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది..? నిర్మాణ సమయంలో జరిగిన లోపాలా..? లేక పర్యవేక్షణ వైఫల్యమా..?  వారదిపై గుంతలు ఏర్పడుతుండడానికి అసలు కారణమేంటీ..?

మణిహారం…

దక్షిణాది రాష్ట్రాలకే తల మానికంగా నిలవనుందని గొప్పలు చెప్పుకున్న కరీంనగర్ తీగల వంతెన తరుచూ మరమ్మత్తులకు గురవుతుండడం స్థానికులను విస్మయ పరుస్తోంది. నాడు టూరిజం స్పాట్ అంటూ అర్భాటంగా చెప్పుకున్నా… నేడు దానీ మీదుగా వాహనాల రాకపోకలకు  అంతరాయం ఏర్పడతూనే ఉంది. వీకెండ్స్ మస్తీ పేరిట మ్యూజిక్ నైట్స్ నిర్వహించడం కూడా ఓ కలలా మారిపోయినట్టయింది. కరీంనగర్ తీగల వంతెన సరికొత్త శోభను తెచ్చిందో లేక బాధను తెచ్చిపెట్టిందో అర్థం కాని పరిస్థితి తయారైంది. రూ. 224 కోట్ల వరకూ వెచ్చించి అంతర్జాతీయ ఖ్యాతిని గడించే విధంగా కరీంనగర్ సమీపంలోని మానేరు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి తరుచూ రిపేర్లకు గురవుతుండడం విస్మయానికి గురి చేస్తోంది. వంతెనపై గుంతలు పడుతుండడంతో తరుచూ రిపేర్లు చేయాల్సిన దుస్థితి ఎదురవుతోంది. దీంతో వంతెన మీదుగా వాహనాల రాకపోకలను కట్టడి చేయాల్సి వస్తోంది అధికారులకు. వంతెనకు అనుసంధానం చేస్తూ నిర్మించిన అప్రోచ్ బ్రిడ్జి, రోడ్డు వల్ల ఈ సమస్య ఎదురవుతోందా మరేదైనా కారణామా అన్నది తెలియదు కానీ ఎక్కువ శాతం వన్ వేగానే ఉపయోగించాల్సి రావడం ఆశ్యర్యానికి గురి చేస్తోంది. గతంలో అప్రోచ్ కు గుంతలు పడిన విషయం వెలుగులోకి రాగా అలాంటిదేమీ లేదని ప్రచారం చేశారు. కొంతమంది అయితే తప్పుడు ప్రచారం అంటూ ఆర్ అండ్ బి అధికారుల సంతకాలు లేకుండా ఓ ప్రెస్ నోట్ ను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నేటికీ తీగల వంతెన మాత్రం వాహనదారుల సహానానికి పరీక్ష పెడుతూనే ఉంది.

పరిష్కారం లేదా..?

కరీంనగర్ తీగల వంతెన గంతలు పడినప్పుడల్లా అధికారులు రిపేర్లు చేస్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం దొరకడం లేదని స్పష్టం అవుతోంది.  నిర్మాణ సమయంలోనే పర్యవేక్షణతో పాటు నిపుణుల సలహాలు తీసుకుంటే ఈ పరిస్థితి ఎదరుయ్యేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం కేబుల్ బ్రిడ్జిపై నిర్విరామంగా వాహనాల రాకపోకలు సాగుతున్నా ఇబ్బందులు తలెత్తడం లేదు. కానీ కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిపై మాత్రం తరుచూ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. వంతెనపై వేస్తున్న బీటీ తరుచూ లేచిపోతుండడంతో ఏర్పడుతున్న గుంతలు వాహనదారులకు సవాల్ విసురుతున్నాయి.