దిశ దశ, వరంగల్:
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించాలని ఖాజీపేట రైల్వే కోర్టు ఆదేశించింది. గ్రానైట్ క్వారీ యజామాని మనోజ్ రెడ్డిని బెదిరించి, డబ్బులు అడిగిన కేసులో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కౌశిక్ రెడ్డిని శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్టులో వరంగల్ కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ తరలించిన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఖాజీపేట రైల్వే కోర్టులో హాజరు పరిచారు సుబేదారి పోలీసులు. కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం దరఖాస్తు చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కౌశిక్ రెడ్డి కేసు పూర్వాపరాలు వివరిస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును అభ్యర్థించారు. ఇరు వర్గాల వాదనలు విన్న మెజిస్ట్రేస్ కౌశిక్ రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఖమ్మం జిల్లా జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ కౌశిక్ రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించనున్నట్టుగా తెలుస్తోంది.

