దిశ దశ, జగిత్యాల:
సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేపై విమర్శలు సంధించడం మొదలు పెట్టారు. ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన ఒక్కసారిగా ఎదురు దాడికి దిగారు. దీంతో జగిత్యాలలో రసవత్తర రాజకీయాలు మొదలయ్యాయి. రాజకీయ కురు వృద్దుడు తాటిపర్తి జీవన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తప్పు పడుతున్నారు. మొదటి నుండి కూడా సంజయ్ కి వ్యతిరేకంగా తన అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా గాంధీ భవన్ వేదికగా జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఎదురు దాడి చేయడం ఆరంభించారు డాక్టర్ సంజయ్ కుమార్. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనలో కూడా జీవన్ రెడ్డి ఘాటుగానే స్పందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం మీడియాతో మాట్లాడిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి వైఫల్యాలను ఎత్తి చూపడం గమనార్హం. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా జీవన్ రెడ్డి ఓడిపోయారని కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతల్లో అత్యధికంగా ఓటమి చవి చూసింది ఆయనేనని విమర్శించారు. జగిత్యాల అంటేనే తాను అన్న రీతిలో జీవన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారని, గతంలో ఇక్కడి నుండి ప్రాతినిథ్యం వహించిన ఎమ్మెల్యేలు కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాను ఏమీ చేయలేదా అని ప్రశ్నించారు. 1970వ దశాబ్దంలోనే వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పడిందని, అప్పుడు ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపించి సాధించుకున్నారన్నారు. జీవన్ రెడ్డి హయాంలోనే జగిత్యాల అభివృద్ది చెందలేదన్న విషయాన్ని చెప్పిన ఎమ్మెల్యే సంజయ్ తన హయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయించిన ఘనత తనకే దక్కుతుందన్నారు. తన సమీప బంధువు అయిన జువ్వాడి చొక్కారావు, వెలిచాల జగపతి రావుల హయాంలో కూడా జగిత్యాల అభ్యున్నతికి నోచుకుందని స్ఫష్టం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించడంలో కూడా గతంలో ఇక్కడి నుండి ఎమ్మెల్యేలుగు గెలిచిన వారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసిన చొక్కారావుల కృషి ఉందన్నారు.
చివరి ఎన్నికలని…
2014 అసెంబ్లీ ఎన్నికల్లో నైతిక విజయం తనదేనని డాక్టర్ సంజయ్ కుమార్ వెల్లడించారు. అప్పుడు ఇవే తనకు చివరి ఎన్నికలని జీవన్ రెడ్డి ప్రచారం చేసుకుని బోటాబోటి మెజార్టీతో గెలిచారని, 2018, 2023 ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో గెలిచానని గుర్తు పెట్టుకోవాలన్నారు. శీనన్న కొడుకు బీజేపీ అభ్యర్థి అరవింద్ కు ఓటు వేయాలని చెప్పింది కూడా జీవన్ రెడ్డేనని, నాచుపల్లి జేఎన్టీయూ, న్యాక్ టీఆర్ నగర్ గుట్టల్లో ఏర్పాటు చేయించడాని ఆరోపించారు. జీవన్ రెడ్డి అనుచరులు కూడా తనపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వీటిని సహించేది లేదని సంజయ్ స్పష్టం చేశారు. సహనం కోల్పోయి మాట్లాడడం మాని, నిర్మాణాత్మకమైన సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందించి హుందాతనం చాటుకోవాలని సూచించారు. తన కుటుంబం సేవ చేయడంలో మొదటి నుండి ఉందని, రాజకీయాల్లో నేరుగా భాగస్వామ్యం లేనప్పటికీ వెన్నదన్నుగా నిలిచిన చరిత్ర తన తండ్రికి ఉందన్న విషయం గమనించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కోరారు.