రూ. 60 వేలు తీసుకుంటుండగా పట్టివేత
దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇరిగేషన్ 7వ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎర్రంరెడ్డి అమరేందర్ రెడ్డి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. జిల్లాలోని ఓ చెక్ డ్యాం నిర్మాణ పనులకు సంబందించిన బిల్లుల రికార్డులు నమోదు చేసేందుకు కాంట్రాక్టర్ వద్ద నుండి రూ. 60 లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలోని బృందం పట్టుకుంది. నిందితుడిని కరీంనరగ్ ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.
తప్పించుకునేందుకు..
అమరేందర్ రెడ్డికి కాంట్రాక్టర్ రూ. 60 వేలు లంచం ఇస్తుండగా పట్టుకోవాలని ఏసీబీ అధికారులకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈ క్రమంలో బాధితుడి నుండి లంచం డబ్బులు తీసుకున్న అమరేందర్ రెడ్డి ఏసీబీ అధికారులను గమనించి వాటిని ఇంటి ఆవరణలో విసిరేశాడు. దీంతో ఏసీబీ అధికారులు అతను తీసుకున్న డబ్బుల గురించి ఆరా తీయగా సీసీ కెమెరా రికార్డులను పరిశీలించడంతో గోడ అవతల విసిరేసినట్టుగా ఉన్న ఫుటేజీ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు.
చుట్టూ వివాదాలే…
ఎర్రంరెడ్డి అమరేందర్ రెడ్డి సుదీర్ఘ కాలంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే పని చేస్తున్నారు. కాంట్రాక్టర్లను ముప్పు తిప్పలు పెట్టడం తాను చెప్పినట్టుగా వ్యవహరించని వారిని టార్గెట్ చేయడం కామన్ అన్నట్టుగా తెలుస్తోంది. శనివారం ఏసీబీ అధికారులకు పట్టించిన కాంట్రాక్టర్ ను కూడా చాలా సార్లు ఇబ్బందులకు గురి చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపు మూడేళ్లుగా ఆయన నిర్మించిన చెక్ డ్యాంకు సంబంధించిన చెక్ మేజర్ మెంట్స్, ఎంబీ రికార్డ్స్ తయారు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇరిగేషన్ ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకుని సదరు కాంట్రాక్టర్ ను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని చెప్పినా వినిపించుకోకుండా పనులకు సంబంధించిన రికార్డ్ షీట్స్ లో క్రాస్ గా గీతలు పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు, కొండాపూర్ గ్రామాల మధ్య నిర్మించిన ఈ చెక్ డ్యాం బిల్లుల కోసం కాంట్రాక్టర్ కాళ్లరిగేలా తిరిగినా ఈఈ మాత్రం కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పని పూర్తి చేసినా బిల్లులు సకాలంలో రాకపోవడంతో భారీ మొత్తంలో డబ్బు చేతికి రాకుండా పోవడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టుగా సమాచారం. మరో వైపున వేములవాడ మీదుగా ప్రవహిస్తున్న మూలవాగుపై చెక్ డ్యాం నిర్మాణం కోసం కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీతో సంబంధం లేకుండా మరో ఏజెన్సీ జయవరం సమీపంలో రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్మించుకుంది. బఫర్ జోన్ కావడంతో పాటు ఇక్కడి ఇసుక వినియోగించుకునేందుకు మైనింగ్ విభాగం నుండి కూడా అనుమతులు తీసుకోకుండానే రెడ్ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ (RMC) నిర్మించుకున్నారని పెద్ది రాజు హరిరాజు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఈ ప్లాంట్ కేవలం జయవరం చెక్ డ్యాం కోసం మాత్రమే ఏర్పాటు చేసుకున్నట్టుగా చెప్పుకున్నారు. అయితే రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో వేరే ప్రాంతంలో నిర్మాణం అవుతున్న వంతెనకు కాంక్రీట్ అవసరం ఉందని, ఈ ప్లాంటు నుండి సేకరించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని ఆర్ అండ్ బి అధికారులు లేఖ రాశారు. ఇందుకు సమ్మతిస్తూ ఇరిగేషన్ ఈఈ అమరేందర్ రెడ్డి మరో లేఖ ఇచ్చారు. అసలు అనుమతి లేకుండానే RMC ప్లాంటు నిర్మించడమే నిబంధనలకు విరుద్దం అంటే ఇతర పనులకు కూడా ఇదే ప్లాంటు నుండి కాంక్రీట్ పంపించేందుకు పర్మిషన్ ఇవ్వడం సరికాదని హరి రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై కూడా అప్పటి ప్రభుత్వం ఓ కమిటీని వేసి వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మైనింగ్ అధికారులు ఇసుక వినియోగించేందుకు తమ విభాగం నుండి సదరు ఏజెన్సీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని వివరించింది. ఫిర్యాదు చేసిన పెద్దిరాజు హరి రాజు కూడా విచారణ కమిటీ ముందు హాజరై వాస్తవాలను వివరించాడు. దాదాపు మూడేళ్లుగా ఈ RMC ప్లాంటు విషయంలో ఆయా శాఖల మధ్య విచారన కొనసాగుతున్నప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇవే కాకుండా చాలా విషయాల్లోనూ ఈఈ అమరేందర్ రెడ్డి నిర్ణయాలు వివాదస్పదంగానే ఉండేవని ఇరిగేషన్ విభాగంతో పాటు కాంట్రాక్టర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఇప్పటికే ఈఎన్సీ హరిరాంపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు కాగా తాజాగా అదే ఇరిగేషన్ విభాగానికి చెందిన ఈఈ ఏసీబీకి పట్టుబడడం మాత్రం సంచలనంగా మారింది.